రెక్కలు విరిగిన ఆకాశం | a real indin Gulf husband story | Sakshi
Sakshi News home page

రెక్కలు విరిగిన ఆకాశం

Published Tue, Jun 14 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

రెక్కలు విరిగిన ఆకాశం

రెక్కలు విరిగిన ఆకాశం

చంటి పిల్లాణ్ణి గట్టు మీద పడుకోబెట్టి, మరోకొడుకును వాడికి కాపలాగా పెట్టివరి పొలం కోసుకుంటున్న ఈ మహిళ.. బాపనయ్య మొతుకుంట తాండకు చెందిన మాలోతు లక్ష్మి.  ఆకాశంలోకి చూస్తే.. గల్ఫ్ కనిపించదు.గల్ఫ్‌ని గుర్తుకుతెచ్చే విమానం కనిపిస్తుంది! వచ్చే ప్రాణం, పోయే ప్రాణంలా... అది వచ్చే విమానమో, పోయే విమానమో? మేఘాల్లోంచి పొలాల్లోకి జారి పడుతున్న వాన చుక్కలా...  ఏ గల్ఫ్ విమానంలోంచైనా... భర్త దిగిరాకపోతాడా అని ఒకే ఒక్క ఆశ! ఆకాశమంత ఆశ!!  రెక్కలు ముక్కలు చేసుకున్నా కష్టాలు తీరక... ఎడారుల్లోకి వెళ్లి తడారిపోయిన మెతుకుసీమ బతుకులివి.  విరిగిన ఆకాశం అతుకులివి!

 

‘‘పెద్దపిల్ల పెండ్లికి ఎదిగింది. ఆయనేమో దేశం నుంచి ఒచ్చేటట్టు లేడు. ఆడపిల్ల ఉట్టిగ పోతదా. పెండ్లిజేసి పోదువు రావయ్యా అంటే కంపినోళ్లు ఒదిలి పెట్టరే అని ఒక్కటే గుంజాతి పడుతుండు. ఇంటి మొగోడు లేకుండా పిల్ల పెండ్లి జేస్తే నలుగురు ఏమనుకుంటరు. ఇన్ని కష్టాలల్ల బిడ్డ పెండ్లెట్ట జెయ్యాల్నో తెల్వక తండ్లాడుతన్న’.  గుండె లోతుల్లో దిగమింగుకున్న ఆవేదనను వెళ్లగక్కింది జ్యోతి. రామాయంపేట మండలం కాశీంపేట తాండా ఆమెది. ఆమె భర్త మంగ్యా నాయక్. మస్కట్ పోయి నాలుగేళ్లు అవుతోంది. ‘‘పిట్రోలు బాయిల పనికి కుదిరిండట. ఆరు నెలలకు రూ 10 వేలో.. రూ 15 వేలో పంపుతడు. అయి దేనికయిత బిడ్డా.. మిత్తీలకు కూడా సరిపోవు. ఇక్కడ చేసుకుందామంటే కాలం పాడుగాను కాలం పోయింది. పోనీ మస్కట్ల అయినా నాలుగు పైసలు సంపాయిస్తరా అంటే అదీ లేకపాయ..’’ అని జ్యోతి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.

  

 అమీనా ఓ గిరిపుత్రిక. రామాయంపేట మండలం బాపనయ్య మొతుకుంట తాండ. కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువు. అత్తమామలు అనురాగాన్ని, భర్త ప్రేమను పంచాడు.  రెండు నెలలకు అమీనా గర్భం దాల్చింది. అమ్మ కాబోతున్న ఆమె ఆనందంలో కరువు రాక్షసి నిప్పులు పోసింది. వరుస కరువుతో ఎద్దు.. ఎవుసం పోయింది. కడుపులో బిడ్డతోపాటు అప్పులు పెరిగాయి. అమీనాకు మూడోనెల పడ్డప్పుడు...  ఆమె భర్త జగన్ బతుకు తెరువునును వెతుక్కుంటూ మస్కట్ వెళ్లిపోయిండు. మళ్లీ రాలేదు. ఇప్పుడామె రెండేళ్ల  బిడ్డకు తల్లి, రూ 5.50 లక్షల అప్పులకు పూచీ. బిడ్డను సాకలేక, అప్పులోళ్ల బాధతో వేగలేక రోజూ చస్తూ బతుకుతోంది. తిండి గింజల కోసం దొరికిన పని చేస్తూ, తునికాకులు ఏరుకొని కాలం వెళ్లదీస్తోంది. వానొస్తే వలవల కురిసే గుడిసెలో కాలం నెట్టుకొస్తోంది. మస్కబారిన బతుకు నుంచి  వెలుగులు నింపే మొగుడు ఎప్పుడొస్తాడోనని కళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తోంది.

  

యాదమ్మ 17 ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లి. ఈమెది గజ్వేల్ మండలం దాచారం. భర్త వల్లపు కిష్టయ్య(35) కౌలు రైతు. కౌలు భూమిలో రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. కాలం లేక పత్తి పంటపోయింది. మస్కట్ పోతే అప్పులు తీరుతాయి అనుకున్నడు. కానీ వీసాలో మోసం జరిగింది. కిష్టయ్య గుండె ధైర్యం సడలింది. భార్య, పిల్లలు గాఢ నిద్రలో ఉన్న అర్ధరాత్రి వేళ ఇంటి దూలానికి ఉరేసుకొని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. కుటుంబ భారం యాదమ్మ మీద పడింది. ఏ పని చేయాలో తెలియని ఆమె ఉప్పరి పనిలో కర్పూరంలా కరిగిపోతోంది. అయినా అప్పులోళ్లు ఆగలేదు, ఆమె ఇంటి మీద పడుతున్నారు. వీళ్ల నుంచి తప్పించుకునేందుకు తెల్లారక ముందే ఇంత సద్ది కట్టుకొని పొరుగు ఊరికి వెళ్లిపోతే రాత్రైతేనే ఇంటికి వస్తోంది. సాగుజూదం, గల్ఫ్‌గాయంతో  ఇలా రైతు భార్య బతుకంతా  చీకటైపోయింది.

 

మెతుకూ లేదు... బతుకూ లేదు!
మెతుకు సీమ అంటే బువ్వ పెట్టే ప్రాంతం. అమ్మతనానికి.. ఐదోతనానికి నెలవులు ఈ సీమలోని పల్లెలు. నుదుటకుంకుమ.. కాళ్లకు పారాణి ఇక్కడి మహిళల సంస్కృతి. ఇదంతా గతం. ఇప్పుడు మెదక్‌లోని ఏ పల్లెలోకి తొంగి చూసినా..  తాళిబొట్టు తెగిపోయి బొట్టు చెరిగిపోయి, వైధవ్యం పొందిన ఆడబిడ్డల ఘోష,  భర్త జాడ లేక బతుకు మీద ఆశలు పోయి కొడిగట్టిన కొవ్వొత్తిలా కరిగిపోతున్న అమీనాల గల్ఫ్ గోసలే కనిపిస్తున్నాయి. వృత్తులు పోయి, ఉపాధి వెతుక్కుంటూ లక్షల మంది యువత  పల్లె వదిలి... దేశం విడిచి... ఎల్లలు దాటి  వెళ్లిపోతున్నారు. పోయిన పోకడే కానీ ఇప్పటి వరకు వాళ్లు తిరిగి రాక.. కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లు ఎదురుచూస్తున్నారు.

 

విధిలేక గల్ఫ్‌కు వలస
సాగుకు తెచ్చిన అప్పులు.. ఎదిగిన ఆడబిడ్డ పెళ్లిలు.. మైక్రోఫైనాన్స్ రుణాలు... అప్పులు తీర్చే హామీ ఇవ్వలేని ఉపాధి ఒకదానికొకటి పురి వేసుకొని యువతను, రైతును ఊరి నుంచి తరిమేస్తున్నాయి. వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు చిట్టీలు ఎత్తి డబ్బు తీసుకొని చిట్టీ వాయిదా కట్టడం కోసం మైక్రో ఫైనాన్సియర్ల దగ్గర చిల్లర అప్పులు చేసి.. వాటిని తీర్చడం కోసం వడ్డీ వ్యాపారుల వద్ద పొలం తాకట్టు పెట్టి... ఇలా సాలెగూడు లాంటి అప్పుల వలయంలో చిక్కుకుపోతున్న రైతుకుటుంబాలు విధిలేక గల్ఫ్‌కు పయనం అవుతున్నాయి మెదక్ జిల్లా నుంచి 75 వేల మందికి పైగా దుబాయ్, మస్కట్ లాంటి దేశాలకు వెళ్లిపోయారు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా వాళ్ల జాడ లేదు. ఒకవేళ జాడ తెలిసినా, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇక్కడి వ్యవసాయ కుటుంబ స్త్రీలలో సగటున ప్రతి 100 మందిలో 25 మంది మహిళలు గల్ఫ్ పోయిన భర్తల జాడకోసం ఎదురు చూస్తూ కనిపిస్తున్నవారే కావడం విషాదం.
- వర్ధెల్లి వెంకటేశ్వర్లు,  సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

 

ఎప్పుడొస్తవ్ పెనిమిటీ?!
‘‘ పెళ్లయి నాలుగేండ్లు అయింది. అమ్మానాయిన.. అత్తామామా లేరు. ఈడు జోడు ముద్దుగుందని ఊరంత అనుకుంటంటే ఇంతకంటే ఏం కావాలని మురిసి పోయిన. మంచిగ జూసుకునే భర్త దొరికిండు ఈ జన్మకు ఇది చాలు అనుకున్న. కష్టం, సుఖం అన్నీ నా భర్తే అనుకున్న. మా మావ సంపాయించి ఇచ్చిన మూడెకరాల్లో ఇద్దరం కష్టం చేసుకునేటోళ్లం. పెండ్లైన ఏడాదికి కొడుకు పుట్టిండు. సుకంగానే కాలం గడిచిపోతోంది. ఇంతలోనే ఆ దేవునికి కన్ను కుట్టినట్టుంది. విత్తనం వేసుడే కానీ పంట తీసింది లేదు. అప్పుకు మిత్తి పెరిగింది. బరువు అలివిగానిదైపోయింది. ఇగ తప్పదని అరెకరా ఉంచుకోని రెండున్నర ఎకరాలు అమ్ముకుని అప్పులు కట్టినం. ఇంకో రూ 80 వేలు అప్పు జేసి ఆయన దుబాయ్ పోయిండు. ఆయనకు వీసా వచ్చినప్పుడే రెండోకొడుకు కడుపుల పడిండు. ఇప్పుడు వానికి ఏడాది. ఇంతవరకు మా ఆయన కొడుకును జూసుకోలే. పోయినోడు పోవుడేగానీ ఇప్పటిదాకా జాడ లేకపాయ. ఎన్నికష్టాలు పడుతుండో...ఎంత బాధ పడుతుండో.. ఇంటికైతే ఇప్పటిదాకా రూపాయి పంపలే. మా బావ పనికి కుదిరిన దుబాయ్ సేటు మంచోడు కాదని అక్కడోళ్లు చెప్తుంటే పానం విలవిలలాడి పోతంది. ఆయన ఫోన్ చేస్తే ‘ఏం తింటున్నవ్ బావా... ఎప్పుడొస్తవ్ బావా’ అని అడగాలని ఉంది. ‘కలిసి ఇక్కడనే ఉండి కలోగంజో తాగి బతుకుదాం రా బావ’ అని పిలవాలని ఉంది. ఆర్నెల్ల కింద ఒకసారి...మూడు నెలల కింద ఇంకోసారి మా ఇంటి దగ్గర వాళ్ల పిల్లగానికి ఫోన్ చేశాడట గాని నేను కూలి పనికి పోయిన. నాకు సెల్లు లేదు. బావ ఫోన్ సేసిండు అన్న రోజున కన్నీళ్ల్లు ఆగవు. కంటికి పుట్టెడు శోకమే. ఇద్దరు పిల్లలను తీసుకొని కూలికి పోతన్న. సంటోన్ని గట్టు మీద పడుకోబెట్టి పెద్దోన్ని (రెండేళ్ల వయసు) కావలి పెట్టి కూలి పనులు చేసుకుంటా. అర ఎకరంలో వరి పెడితే నీళ్లు లేక  ఎండిపోయింది. బొంది కోస్తన్నా. రూ 80 వేలకు మిత్తీ జత అయింది. అప్పులు ఇచ్చినోళ్లు ఊకుంటరా. పోయినేడాది ఇంట్లే రెండు దూడ పెయ్యలు ఉంటే అమ్మిన, ఆన్నో.. ఈన్నో తండ్లాట బడి ఇంకిన్ని రూపాయలు కలేసి మనిషింత మిత్తి కట్టిన. ఈయేడు తలుసుకుంటెనే పానం పోయినంత పనైతంది. పిలగానికి బడీడచ్చింది. ఆన్ని బడికి పంపితే సిన్నోన్ని పట్టుకునేటోళ్లు లేరు. బావ ఎప్పుడొస్తడో, ఏం తెస్తడో తెల్వదు’’.

 - మాలోతు లక్ష్మి, బాపనయ్య మొతుకుంట తాండ

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement