ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
సీఎం కప్ లోగో, మస్కట్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. క్రీడల అభివృద్ధికి ఇప్పటికే ప్రకటించిన పలు ప్రణాళికలతో పాటు మరిన్ని కొత్త అంశాలతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే చీఫ్ మినిస్టర్స్ (సీఎం) కప్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ‘పల్లెల నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు’ అనే నినాదంతో త్వరలోనే జరగనున్న ఈ టోర్నీకి సంబంధించిన లోగో, మస్కట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాలుగు దశల్లో జరిగే టోర్నీ అక్టోబర్ 21న ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను టోర్నీ మస్కట్‌గా ఉంచి దానికి ‘నీలమణి’ అని పేరు పెట్టారు. ఇటీవల కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిన సమయంలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధికారులతో చర్చించామని.. దానికి అనుగుణంగా భారత్ అండర్–17 ఫుట్‌బాల్ టీమ్‌ను దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
గోవాలో జరిగిన జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన, గత ఏడాది జరిగిన సీఎం కప్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలిపి మొత్తం రూ.1.02 కోట్లు, రూ.52 లక్షలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఈ కార్యక్రమంలో సీఎం అందజేశారు. ప్రతిభకు గుర్తింపుగా బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌లను ప్రభుత్వ ఉద్యోగంతో గౌరవించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. కార్యక్రమంలో నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. భవిష్యత్తులో ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, శాసన సభ్యులు వివేక్, రాంచంద్ర నాయక్, ప్రభుత్వ సలహాదారులు జితేందర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, పార్లమెంటు సభ్యులు అనిల్‌కుమర్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ జితేందర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సాంస్కృతిక పర్యాటక శాఖ కార్యదర్శి వాణిప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారిలతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment