మన పాదాలకు ఓ నమస్కారం!
ట్రివియా
ఒక సాధారణ వ్యక్తి తన జీవితకాలంలో నడిచే సగటు దూరం 1,28,000 కిలోమీటర్లు. అంటే అతడి అడుగులన్నింటినీ లెక్కేస్తే అతడు తన జీవితకాలంలో భూమిని మూడుసార్లు చుట్టి వస్తాడన్నమాట. ఒకరి జీవితకాలంలో అతడి పాదాలు మోసే మొత్తం బరువు 1,000 టన్నులుంటుంది. మన పాదాల సైజు ఉదయంతో పోలిస్తే సాయంత్రానికి 5-10 శాతం పెరుగుతుంది. మనం శరీరంలోని అన్ని ఎముకల్లో నాలుగోవంతు మన పాదాలలోనే ఉంటాయి. మన రెండు పాదాలలో కలిపి 52 ఎముకలుంటాయి.
మన రెండు పాదాలు సమానంగా ఉండటం చాలా అరుదు.పురుషులకు వచ్చే పాదాల సమస్యలతో పోలిస్తే... మహిళలకు వచ్చే పాద సంబంధ సమస్యలు నాలుగురెట్లు ఎక్కువ. వాళ్లు తొడిగే హైహీల్స్ చెప్పులే ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తున్నాయి. పురుషుల్లో పాదాలను తొలగించే పరిస్థితి ఎక్కువగా సిగరెట్ వల్లనే వస్తోంది. సిగరెట్ అలవాటు ఉన్నవారిలో పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ అనే వ్యాధి వల్ల పాదాలకు రక్తప్రసారం చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి, పాదం కుళ్లి (గ్యాంగ్రీన్ వచ్చి) పాదాలను తొలగించాల్సి వస్తోంది. చాలారకాలమైన వైద్య సమస్యలు పాదాలలో కనిపించే లక్షణాలతోనే బయట పడతాయి. ఉదాహరణకు డయాబెటిస్, ఆర్థరైటిస్, రక్తప్రసరణ సమస్యల వంటివి.