ప్రమాద బాధితుల పాణదాత
సాధారణంగా మనం మనవాళ్లకి జరగకూడనిది ఏదైనా జరిగితే బాధ పడతాం. అలా ఎవరికీ జరగకూడదని కోరుకుంటాం. కానీ అలాంటి ప్రమాదం వారికి జరగకుండా చూసేందుకు ప్రయత్నించం. అందుకు ఏదైనా చేద్దామని ఆలోచించం. కానీ పీయూష్ తివారీ ఆలోచించాడు. తనకు, తన కుటుంబానికి కలిగిన బాధ మరెవరికీ కలగకూడదను కున్నాడు. అతడి ఆలోచన ఎంతోమంది జీవితాలను నిలబెట్టింది. ఎందరికో ప్రాణదానం చేసింది. ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపింది.
అది 2007. న్యూఢిల్లీ.
పీయూష్ తివారీకి అతడి బంధువుల ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్లు చెప్పింది వినగానే చేస్తున్న పని వదిలి వాళ్లింటికి పరుగెత్తాడు పీయూష్. పదిహేడేళ్ల తన కజిన్ శివమ్ బాజ్‌పేయ్ మృతదేహం చూసి విస్తుపోయాడు. చిన్నవాడు. చురుకైనవాడు. ప్రమాదంలో చనిపోయాడని తెలిసి బాధపడ్డాడు.
అయితే ఆ కథ అక్కడితో ముగిసిపోలేదు. శివమ్ మరణం గురించి పీయూష్‌కి కొన్ని నిజాలు తెలిశాయి. శివమ్ ఘటనా స్థలంలోనే చనిపోలేదు. త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం వల్ల మరణించాడు. దారిని పోయేవాళ్లెవరూ అతడిని హాస్పిటల్‌కి తీసుకెళ్లలేదు. దాదాపు నలభై అయిదు నిమిషాల తర్వాత ఓ వ్యక్తి అంబులెన్‌సకి ఫోన్ చేస్తే, వాళ్లు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది.
ఇది తెలియగానే ఎంతో ఆవేదన చెందాడు పీయూష్. వెంటనే రోడ్డు ప్రమాదాల గురించి వాకబు చేశాడు. ఆ క్రమంలో అతడికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. మన దేశంలో జరిగే రోడ్డుప్రమాదాల్లో సగానికి పైగా మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. దారుణం ఏమిటంటే... ప్రమాదం జరిగిన తరువాత వాళ్లని ఎవరూ పట్టించుకోక పోవడం వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారు. లేనిపోని తలనొప్పి ఎందుకని ఎవరూ స్పందించడం లేదు. పోలీసులు, అంబులెన్సులు చేరుకునేటప్పటికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ వాస్తవాలు పీయూష్ మనసును తొలిచేశాయి. ఈ పరిస్థితుల్ని మార్చాలంటే ఏం చేయాలా అని ఆలోచించాడు. ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ ను స్థాపించాడు. రోడ్డు ప్రమాదాల బారిన పడినవాళ్లను రక్షించేందుకు నడుం కట్టాడు.
మృత్యుద్వారాలను మూసెయ్యాలని...
2008లో తన స్నేహితుడు క్రిషన్ మెహతాతో కలిసి న్యూఢిల్లీలో తన ఫౌండేషన్‌ను నెలకొల్పాడు పీయూష్ తివారీ. ప్రమాదాలకు గురైనవారిని కాపాడి సకాలంలో వైద్యాలయాలకు తరలించడం, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన తీరు గురించి ప్రజల్లో అవగాహనను పెంచడం వంటి లక్ష్యాలను పెట్టుకుని అడుగులు కదిపాడు. ఆసక్తి ఉన్నవారిని వాలంటీర్లుగా చేర్చుకున్నాడు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం 2010 నాటికి సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించేవారి సంఖ్య లక్షా అరవై వేలు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే... 2020 నాటికి ఈ సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుతుంది. అయితే ప్రమాదాల నియంత్రణ అన్నది మన చేతుల్లో ఉండదు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి.
అందుకే ప్రమాదం జరిగిన తర్వాత చేయాల్సిన వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రమాదానికి గురైనవారికి చికిత్స జరిగేలా చూడడంలో ఆలస్యం కారణంగా ఏ ఒక్కరి ప్రాణాలూ పోకూడదు అన్న ఆలోచనకు తగ్గట్టే ఏర్పాట్లు చేశాడు. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిస్తే చాలు, వాలంటీర్లు అక్కడకు క్షణాల్లో చేరిపోతారు. గాయపడినవారికి ప్రథమ చికిత్స చేసి, ఆపైన ఆసుపత్రికి తీసుకెళ్లి పోతారు. అలా దాదాపు పది రాష్ట్రాల్లో, ఎనిమిది వేల మంది వాలంటీర్లు... కొన్ని వేలమంది ప్రాణాలు కాపాడారు.
అయితే ఈ విషయంలో పోలీసులకు కూడా ప్రమాదానంతర చర్యల మీద పూర్తి అవగాహన ఉండాలి. కాబట్టి పోలీసులకు ఆ విషయంలో తర్ఫీదు అవసరం అని భావించాడు పీయూష్. పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించి, తమ సంస్థలోని బోధనా విభాగం ద్వారా పోలీసులకు ఎమర్జెన్సీ కేర్ విషయంలో శిక్షణనివ్వడం మొదలుపెట్టాడు. అందుకోసం విదేశాల నుంచి నిపుణులను రప్పిస్తున్నాడు.
ఇప్పటివరకూ తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో ‘లైఫ్’లను ‘సేవ్’ చేసి, తన సంస్థ పేరును సార్థకం చేశాడు. ‘‘ఈ బాధ్యత నా ఒక్కడిదీ కాదు, ప్రమాదం బారిన పడినవారిని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలి’’ అంటాడు పీయూష్. నిజమే... సాటి మనిషి ప్రాణం నిలబెట్టడానికి అందరూ తమవంతు సహాయం చేయాలి. అప్పుడు పీయూష్ లాంటివారి అవసరం ఉండదు. శివమ్‌లా ఎవరూ ప్రాణాలూ కోల్పోరు!
- సమీర నేలపూడి
ప్రపంచమంతా తెలిసింది!
పోలీసులతో కలిసి పీయూష్ చేస్తోన్న సేవల్ని మనదేశంతో పాటు ప్రపంచమంతా గుర్తించింది. 2010లో ఆయనను ‘రోలెక్స్ అవార్‌డ ఫర్ ఎంటర్‌ప్రైజ్’ పురస్కారం వరించింది. 2011లో అమెరికాలోని కొలెరాడో యూనివర్శిటీ వారు వచ్చి ఫౌండేషన్ గురించి ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. అదే ఏడు ‘ద వీక్’ పత్రిక తమ వార్షికోత్సవ సంచికలో ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక కథనాన్ని వెలువరించింది.