ఆరు నెలలుగా ఆ సమస్య వేధిస్తోంది! | Acidity confuse heart attack ..? | Sakshi
Sakshi News home page

ఆరు నెలలుగా ఆ సమస్య వేధిస్తోంది!

Published Fri, Mar 25 2016 11:18 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

Acidity confuse heart attack ..?

హోమియో కౌన్సెలింగ్

 

 నా వయసు 30 ఏళ్లు. నాకు గత ఆరు నెలలుగా మలద్వారం వద్ద బుడిపెలా ఏర్పడి మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. నొప్పి, మంట ఉండి అప్పుడప్పుడు సూదితో గుచ్చినట్లుగా ంది. కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అని చెప్పారు. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?

 - రాములు, నల్లగొండ

 ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న సమస్యలలో ఇది ఒకటి.  మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే సిరలు ఉబ్బి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి.మొలలు దశలు : గ్రేడ్-1 దశలో మొలలు పైకి కనిపించవు.నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. గ్రేడ్-2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి.గ్రేడ్-3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. గ్రేడ్-4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.


కారణాలు :  మలబద్దకం  మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి.  సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం  స్థూలకాయం (ఒబేసిటీ)  చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ  మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు  మంచి పోషకాహారం తీసుకోకపోవడం  నీరు తక్కువగా తాగడం  ఎక్కువగా ప్రయాణాలు చేయడం  అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ.

 
లక్షణాలు : నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి  మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం.

 
నివారణ :  మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం సమయానికి భోజనం చేయడం ముఖ్యం  ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం  కొబ్బరినీళ్లు  నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం  మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం  మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు.


హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులతో వ్యాధిని నయం చేస్తారు.

 

డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్

 

 కార్డియాలజీ కౌన్సెలింగ్


నా వయసు 45 ఏళ్లు. ఒక నెల నుంచి నాకు ఛాతీలో విపరీతమైన మంటగా ఉంటోంది. డాక్టరును కలిస్తే ఎసిడిటీ మందులు ఇచ్చారు. వాటిని వాడినా ఏమాత్రం ఉపశమనం లేదు. ఛాతీ మధ్యలో మంట, నొప్పి, భుజం లాగడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కనబడుతున్నాయి. అప్పుడప్పుడూ చెమటలు కూడా పడుతున్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.

 - రవి, హైదరాబాద్

 సాధారణంగా గుండెపోటు లక్షణాలతో వైద్యులను కలిసే రోగుల్లో ఎక్కువ మంది అసిడిటీ రోగులే ఉంటారు. కానీ మీరు చెబుతున్న అంశాలను బట్టి చూస్తుంటే మీకు గుండెపోటు వచ్చే ముందు కనిపించే ముందస్తు హెచ్చరిక లక్షణాల్లా అనిపిస్తున్నాయి. అసిడిటీని గుండెపోటుగా భ్రమిస్తే పర్వాలేదు. కానీ గుండెపోటును ఎసిడిటీగా పొరబడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. మీరు డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడానని అంటున్నారు. కొన్నిసార్లు గుండెనొప్పికీ, ఎసిడిటీకి తేడా కనిపెట్టడం కష్టమవుతుంది. ఛాతీనొప్పిని పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకునే కన్నా అది గుండెనొప్పి కాదని తెలుసుకోడానికి చేసే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా మేలు. గుండెపోటు వచ్చే ముందు కొన్ని హెచ్చరికలు చేస్తుంది.మొదట ఛాతీ మధ్యభాగంలో నొప్పి మొదలవుతుంది   అది మెల్లగా ఛాతీ ఇరువైపులకు వ్యాపిస్తుంది.  ఆ తర్వాత వెనకైవైపునకు పాకుతుంది  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.  చెమటలు పడతాయి   కొన్నిసార్లు మూర్ఛ రావచ్చు   వాంతులు కూడా అవుతాయి.


అంతేకాకుండా 10-20 నిమిషాల పాటు నొప్పి తగ్గకపోతే అది కచ్చితంగా గుండెపొప్పే అని అనుమానించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. బాధితుడిని ఎంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్తే అంత మెరుగైన ఫలితాలు అందించవచ్చు. చాలామంది ఛాతీ ఎడమవైపున నొప్పి వచ్చినా కూడా నిర్లక్ష్యం వహిస్తారు. దాంతో నొప్పి పెరిగాక ఆసుపత్రులకు వెళ్లి అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. అందుకే ఎసిడిటీ సమస్య వచ్చినా, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకొని గుండెనొప్పిపై ఒక నిర్ధారణకు రావడం చాలా ముఖ్యం.

 

డాక్టర్
అనుజ్ కపాడియా
సీనియర్ కార్డియాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

 

ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

 

నా వయసు 48 ఏళ్లు. గృహిణిని. నా కుడి మోకాలులో గత రెండేళ్లుగా విపరీతమైన నొప్పిగా ఉంది. అది ఇటీవల మరీ తీవ్రమయ్యింది. నడవడం బాగా కష్టమైపోతోంది. నా మోకాలి లోపలి భాగమంతా అరిగిందనీ, మోకాలి కీలు మార్పిడి  శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ) అవసరమని మాకు తెలిసిన ఆర్థోపెడిక్ సర్జన్ ఒకరు  చెబుతున్నారు. అసలు నా కాళ్ల మీద నిలబడగలనా అని నాకు చాలా ఆందోళనగా ఉంది. ఈ  వయసులో అంత పెద్ద సర్జరీ చేయించుకోవడం నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇప్పుడు పాక్షిక మోకాలి మార్పిడి (పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్) కూడా  చేస్తున్నారని మరో డాక్టర్ అన్నారు. అయితే అది అంత ప్రభావపూర్వకం కాదని, నేను టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీకే వెళ్లాలని ఇంకో సీనియర్ డాక్టర్ చెప్పారు. నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.

 - శ్రీలక్ష్మి, హైదరాబాద్

చాలా సాధారణంగా నిర్వహించే టోటల్ రీప్లేస్‌మెంట్ సర్జరీ మీలాంటి వారికి బాగానే ఉండే సర్జరీ. అయితే మీలా తక్కువ వయసు ఉన్న వారికి పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్) మరింత బాగుంటుంది. ఎందుకంటే పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ రీప్లేస్‌మెంట్ సర్జరీ)తో పోలిస్తే పార్షియల్ నీ రీ ప్లేస్‌మెంట్‌లో ఎముకలోని కేవలం 20 శాతాన్ని మాత్రమే తొలగిస్తారు. మిగతాది  అంతా అలాగే ఉంటుంది. ఇక ఇందులో విజయావకాశాలు (సక్సెస్ రేట్) 98 శాతం ఉంటాయి. దీని ఫలితాలు సాధారణంగా 20 ఏళ్ల పాటు ఉంటాయి. నొప్పి కూడా తక్కువే. మోకాలు ముడుచుకునే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. చాలా మంది సర్జన్లు పాక్షిక మోకాలి సర్జరీని అంతగా సిఫార్సు చేయరు. కానీ మీ వయసుకు మీరు పార్షియల్ సర్జరీని చేయించుకోవచ్చు.

 

డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి

చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,

ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,

హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement