చదివి వినిపిస్తుంది....
మొబైల్‌ఫోన్ చేతిలో ఉంటే ఎంచక్కా ఈ బుక్స్ చదువుకోవచ్చునని చాలామంది అంటూంటారు. ఇది నిజమేకానీ... కొన్ని సందర్భాల్లో పుస్తకం చదివే ఓపిక కూడా మనకు ఉండకపోవచ్చు. ఎంచక్కా ఎవరైనా ఈ పుస్తకంలోని కథ మనకు వినిపిస్తే బాగుండునని అనిపిస్తూంటుంది కూడా. అచ్చంగా అలాంటి సందర్భాల కోసమే ఆమెజాన్ కంపెనీ ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఆడిబుల్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్ మీ కోసం పుస్తకాలను చదివి వినిపిస్తుంది. అప్లికేషన్‌తోపాటే దాదాపు 1,50,000 ఈబుక్స్ కూడా అందుబాటులోకి వస్తాయి కాబట్టి... ఇకపై మీకు బోర్ అనిపించే సందర్భాలే ఎదురుకావు. బ్యాక్‌గ్రౌండ్‌లో కథలు వింటూనే, లేదా డౌన్‌లోడ్ చేసుకుంటూనే ఇతర పనులూ చక్కబెట్టుకునే అవకాశముండటం మరో విశేషం. అంతేకాదు... ఈ ఆడిబుల్ అప్లికేషన్ ద్వారా మీ పుస్తక అభిరుచులను ఇతరులతో పంచుకోవచ్చు కూడా.
కూరగాయల ధరలను చెప్పే ‘మన రైతుబజార్’
కూరగాయల ధరల గురించి తెలుసుకోవడానికి మార్కెట్ వరకూనో, షాపింగ్‌మాల్ వరకూనో వెళ్లాల్సిన అవసరం లేకుండా... స్మార్ట్‌ఫోన్ నుంచే ఆ వివరాల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది ‘మన రైతుబజార్’ అనే ఈ అప్లికేషన్. సాధారణంగా కూరగాయల ధరలు రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని ప్రముఖ నగరాల్లోని రైతు బజార్లలో కూరగాయల ధరలను చెబుతుంది ఈ అప్లికేషన్. వాటి మధ్య పోలికను కూడా చూపుతూ అవగాహన నింపుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఫొటో ఎడిటింగ్ కోసం ‘మిక్స్’
గూగుల్ ప్లే స్టోర్‌లో ఫొటో ఎడిటింగ్ కోసం ఇప్పటికే అనేకానేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ‘మిక్స్’ పేరుతో మరో అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఎన్నో అవార్డులు సాధించిన కెమెరా 360, హెలో కెమెరా వంటి అప్లికేషన్లను అభివృద్ధి చేసిన బృందమే ‘మిక్స్’ను కూడా అభివృద్ధి చేయడం విశేషం.ఈ అప్లికేషన్‌ను వాడటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌తో తీసే ఫొటోలను కూడా ప్రొఫెషనల్ డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాల స్థాయి నాణ్యత తీసుకురావచ్చు. దాదాపు 115 ఫిల్టర్లు 40 వరకూ ఒరిజినల్ టెక్స్చర్లు, పది వరకూ ప్రొఫెషనల్ అడ్జస్ట్‌మెంట్ టూల్స్ దీంట్లో ఉన్నాయి. దీంతోపాటు మల్టీ లేయర్ ప్రాసెసింగ్ వంటి ఫీచర్లు కూడా దీంట్లో ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ వంటివాటితో కలిసి పనిచేసేందుకు ఇది మెరుగైన అప్లికేషన్ అని కంపెనీ అంటోంది. మీరు ఫొటోలకు చేసే ఎటిటింగ్‌ను ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుని ఇతర ఫొటోలకు ఫార్ములా మాదిరిగా వాడుకోవడం కూడా ‘మిక్స్’ ఫీచర్లలో ఒకటి కావడం విశేషం.
ఆండ్రాయిడ్‌లోనూ వీఎల్‌సీ..
డెస్క్‌టాప్ కంప్యూటర్లకు చిరపరిచితమైన వీడియో ప్లేయర్ వీఎల్‌సీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లకూ అందుబాటులోకి వచ్చింది. వీఎల్‌సీ ఫర్ ఆండ్రాయిడ్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న ఈ మీడియా ప్లేయర్ ప్రస్తుతం బీటా దశలోనే ఉంది. కాకపోతే ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఏఆర్‌ఎం 7 సీపీయూ లేదా ఎక్స్86 ఆర్కిటెక్చర్ సీపీయూలతో మాత్రమే పనిచేస్తుంది. ఆడియో, వీడియోలతోపాటు నెట్‌వర్క్ స్ట్రీమ్స్‌ను కూడా ప్లే చేయగలదు ఈ మీడియా ప్లేయర్. మీడియా లైబ్రరీని ఏర్పాటు చేసుకోగలగడం, సబ్‌టైటిల్స్‌తో మల్టీట్రాక్ ఆడియోలను వినిపించగలగడం ఈ అప్లికేషన్‌కు ఉన్న ఫీచర్లలో కొన్ని. వీడియో కంట్రోల్ కోసం ప్రత్యేకమైన విడ్జెట్, హెడ్‌సెట్స్‌కూ సపోర్ట్ ఉంటుంది. బీటా వెర్షన్ కావడం వల్ల దీంట్లో ఇప్పటికీ చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల స్మార్ట్‌ఫోన్లతోనే పనిచేస్తుంది. అకస్మాత్తుగా క్రాష్ అవుతూంటుంది. యూఎస్‌బీలో ఉండే ఆడియో, వీడియో ఫైళ్లను గుర్తించి ప్లే చేయడం లాంటి ఫీచర్లు కూడా దీంట్లోకి ఇంకా చేరాల్సి ఉంది.
భలే ఆప్స్
Published Wed, Sep 10 2014 11:35 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement