శక్తి ప్రవాహాన్ని సరిచేసే చికిత్స... ఆక్యుపంక్చర్! | Acupuncture treatment to correct the flow of energy | Sakshi
Sakshi News home page

శక్తి ప్రవాహాన్ని సరిచేసే చికిత్స... ఆక్యుపంక్చర్!

Published Sat, Oct 24 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM

శక్తి ప్రవాహాన్ని సరిచేసే చికిత్స...    ఆక్యుపంక్చర్!

శక్తి ప్రవాహాన్ని సరిచేసే చికిత్స... ఆక్యుపంక్చర్!

ఆక్యుపంక్చర్ అంటే... అది సూదులు గుచ్చుతూ రోగిని మరింత బాధించే ప్రక్రియ అనే అపోహ ఉంది. కానీ చాలా సందర్భాల్లో సూది గుచ్చడం రోగికి బాధాకరంగా పరిణమించదు. పైగా అది ఆరోగ్యాన్ని చక్కబరుస్తుంటుంది. ఈ ప్రక్రియపై ఉన్న అపోహలను తొలగించి, అవగాహనను కలిగించడానికే ఈ కథనం.

మన శరీరమంతటా ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తి ప్రవాహపు నెట్‌వర్క్‌ను ‘చి’ లేదా ‘కి’ అంటారు. శక్తిప్రవాహ మార్గాలు ఒకదాన్ని మరొకటి కలిసే జంక్షన్‌లను ‘మెరీడియన్స్’ అంటారు. ఆ ప్రవాహంలో ఎక్కడైనా లోపాలు తలెత్తినప్పుడు, ఆ జంక్షన్లను జాగ్రత్తగా గుర్తించి, వాటిలోకి సూదులు గుచ్చి, ఆ ప్రవాహాన్ని మళ్లీ క్రమబద్ధం చేస్తారు. ఈ ప్రక్రియనే ఆక్యుపంక్చర్ అంటారు. ఇలా సూదులు గుచ్చడం సాధారణంగానైతే నొప్పి లేని ప్రక్రియ. ఎప్పుడోగానీ అది నొప్పి కలిగించదు.  

ఆక్యుపంక్చర్ ప్రక్రియ చైనాలో 4000 ఏళ్ల క్రిందటే ఆవిర్భవించింది. మొదట్లో జపాన్ కొరియా వంటి దేశాల్లో విస్తరించింది. ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచంలోనూ, భారత్‌లోనూ ప్రాచుర్యాన్ని సంపాదించుకుంటోంది. ఆక్యుపంక్చర్ గురించి అందరూ ఒకే తరహాగా తలపోస్తుంటారు. కానీ  దేశదేశాల్లోనూ అక్కడి తాత్విక ధోరణులను (స్కూల్ ఆఫ్ థాట్‌ను) బట్టి, ప్రాక్టీషనర్‌ను బట్టి ఆచరణలో దీన్ని వేర్వేరు దేశాల్లో దీన్ని వేర్వేరుగా అనుసరిస్తుంటారు. చాలామంది దీనికి తమదైన పరిజ్ఞానాన్ని జోడించి, శాస్త్రాన్ని మరింత విస్తృతపరుస్తుంటారు. దాంతో అల్లోపతి, హోమియోపతి విధానాలతో పోలిస్తే ఆక్యుపంక్చర్ ప్రాక్టీస్‌లో భేదాలు చాలా ఎక్కువ.

 అయితే ఇందులో ఆక్యుపంక్చర్‌కు సంబంధించిన మూల అధ్యయనవేత్తలైన చైనీయుల మార్గమే ఎక్కువ అనుసరణీయం. ఎందుకంటే వాళ్లు దేహంలో శక్తి ప్రయుక్తం అయ్యే సరైన తీరునూ, ఆ ప్రవాహం వల్ల శరీరంలో ఏర్పడే అనారోగ్యాలను గుర్తించారు. కొందరు చైనీయుల మార్గాన్ని అనుసరిస్తూనే అక్కడి వేర్లూ, పసర్లను ఉపయోగించి వైద్యం చేస్తారు. అయితే ఆక్యుపంక్చర్ వైద్యవిధానంలో వ్యాధికి ఒక నిర్దిష్టమైన చికిత్స కంటే... ఆ వ్యక్తికి కలిగిన అనారోగ్యం, స్వస్థతలో లోపం వంటి వాటిని అనుసరించి, వ్యక్తి వ్యక్తికీ చికిత్స మారుతుంటుంది. ఇందులో వ్యాధి లక్షణాలనూ, వ్యక్తిత్వాన్ని, అతడి శరీర నిర్మాణపు ఒడ్డూపొడవూ, వైద్యపరీక్షల ద్వారా తెలిసిన అంశాలూ, రోగి ఇష్టానిష్టాలు, భావోద్వేగాలు... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వ్యాధిని తెలుసుకుంటారు.

 ఆక్యుపంక్చర్ వైద్యవిధానంలో నిర్దిష్టత చాలా ప్రధానం. దీనితో పాటు విశ్లేషణశక్తి, వ్యాధిని ఊహించగలిగే సామర్థ్యం ఇవన్నీ చాలా ముఖ్యభూమికను పోషిస్తాయి. నిర్దిష్టత, విశ్లేషణ, ఊహాసామర్థ్యం ఈ మూడు అంశాల సరైన సమతౌల్యతతోనే చికిత్సలోని నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. కేవలం వ్యాధిని మాత్రమే గాక... ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం, అతడి జీవనశైలి, ఆహార విహారాలు... ఇలా అన్ని అంశాల పరంగా ఆలోచించి చికిత్స చేసి స్వస్థత పరచాల్సి ఉంటుంది. చైనీయుల జ్ఞానాన్ని ఉపయోగించి ఆహార విహారాదులు మొదలకొని అన్నింటా పాటించాల్సిన పరిమితులు, వదిలివేయాల్సిన అతి ధోరణులను తెలుసుకోవాల్సి ఉంటుంది.

 అయితే చాలామందికి దీని దుష్ర్పభావాల గురించి కొన్ని అపోహాలు ఉంటాయి. శక్తి ప్రయుక్తమయ్యే జంక్షన్లు, కీలక స్థానాలను సరిగా గుర్తించకుండా వైద్యం చేస్తే రోగి పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని చాలామంది భావిస్తారు. కానీ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే సూది గుచ్చిన చోట అసౌకర్యాలు, గాయాలయ్యే అవకాశాలు తలెత్తుతాయి. కానీ శక్తిప్రయుక్తమయ్యే కీలకస్థానాలను కనిపెట్టగలిగే ఆక్యుపంక్చర్ నిపుణుల వల్ల అలాంటి పరిస్థితులను నివారించవచ్చు.  
     
 సంప్రదించాల్సిన మెయిల్ ఐడీ : indumati_p@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement