అడవి రాములు
వైయస్సార్ జిల్లా గాలివీడు మండలంలో ఉన్న ఆ ఊరు కాని ఊరి పేరు కమలామర్రి. అదో చిట్టడవిలో ఉంటుంది. బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే అక్కడి నుంచి కనీసం ఎనిమిది కిలో మీటర్లు కాలిబాటన నడవాల్సిందే. వేరే దారిలేదు. అలాంటి ప్రదేశంలో నలభైఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు రాములు, రవణమ్మ. వ్యవసాయం దండగ అంటున్న పెద్దలకు కనువిప్పుగా నిలుస్తున్న ఆ రైతు దంపతుల జీవనం గురించి రాములు మాటల్లో...
నా స్వగ్రామం మాధవరం గ్రామం నాగిరెడ్డి గారిపల్లె కాలనీ. నలభై ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న. తరువాత ఇక్కడే ఈ అడవిలో స్థిరపడిపోయా. మా అత్త వీరనాగమ్మ, మామ సుబ్బరాయుడు. వాళ్లకి నా భార్య రవణమ్మ ఒక్కతే కూతురు. ఆయనకు అప్పటికే టీబీ ఉంది. తనెక్కడ కూతురు పెళ్లి చేయలేకపోతానోనన్న బెంగతో బాధపడుతూ నన్ను ఇల్లరికం తీసుకొచ్చి ఆయన కూతుర్నిచ్చి చేశాడు. మాపెళ్లి అయిన ఆరు నెలలకే ఆయన చనిపోయాడు. తరువాత నేను, నా భార్య, మా అత్త మేము ముగ్గురమే అ అటవీ ప్రాంతంలోనే నివాసం ఏర్పరుచుకున్నాం. మా మామకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో రెండు బావులు తవ్వించి పెట్టారు. ఆ బావులను ఆధారంగా చేసుకొని కవ్వెళ్లు వేసి సేద్యం చేశాను. తరువాత కొంత కాలానికి ఆయిల్ ఇంజన్ వేసి సేద్యం చేయడం మొదలు పెట్టాను.
పిల్లలంతా ప్రయోజకులయ్యారు
మాకు నలుగురు పిల్లలు. మొదట అమ్మాయి పుట్టింది. ఆమె మాత్రం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టింది. మిగిలిన ముగ్గురూ ఈ అడవిలోనే. ఈ ముగ్గురికీ మా సీతమ్మవ్వే పురుడు పోసింది. అందరిలాగానే మేము కూడా మా బిడ్డల్ని మంచి ప్రయోజకులను చేయాలనే ఆశతో వారిని బాగా చదివించాం. మొదటి కూతురు నాగేశ్వరి బీఈడీ చేసింది. రాయచోటి పట్టణంలోని దిగువ అబ్బవరంలో పెళ్లి చేశాం. రెండవ వాడు నాగరాజు కర్నూల్లో బీటెక్ పూర్తి చేసి బెంగుళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడవ వాడు మనోహర్ ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక చివరి అమ్మాయి మేఘన. ఈమె కూడా ఎమ్మెస్సీ కంప్యూటర్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరికి వివాహం అయ్యింది.
భూమినే నమ్ముకున్నాం
మేమిద్దరం, మాకు తోడుగా మా అత.్త ఈ భూమినే నమ్ముకున్నాం. ఇప్పటి వరకు ఏనాడూ ఈ భూమాత మమ్మల్ని నష్ట పెట్టలేదు. కరెంట్ కూడా లేకుండా ఇలా చీకటిలోనే సేద్యం చేశాను. ఇక చేయడం కష్టంగా మారింది. కరెంటోళ్లకు 1995లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా డబ్బులు కట్టాను. పోళ్లు ఇచ్చారు. వైరు ఇవ్వడం మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ డబ్బులు కట్టమంటున్నారు. నిత్యం పందులు, ఎలుగుబంటులతో సహవాసం చేసిన వాళ్లం. చుట్టపు చూపుగా అప్పుడప్పుడు క్రూర జంతువులు వస్తుంటాయి. అయినా ఎలాంటి భయం లేకుండా బతుకుతున్నాం. ఇప్పటి వరకు మాకు సెల్ ఫోన్ లేదు. టివి లేదు. కరెంట్ లేదు. అలాగే బతికేశాం. బతుకుతున్నాం.
ఇటు అన్నలు, అటు పోలీసులు
అప్పుడెప్పుడో గుర్తుకు లేదు కానీ, అన్నలు తిరుగుతున్న సమయంలో అర్ధరాత్రి అయితే వచ్చి బువ్వ పెట్టమని భయపెట్టేవాళ్లు. పెట్టకపోతే చంపుతామని అనేవాళ్లు. బిడ్డలోళ్లం కదా భయపడి బువ్వ పెట్టి పంపేవాళ్లం. తెల్లవారితే పోలీసులు వచ్చి బెదిరించే వాళ్లు. ఇలా బాధలు భరించామే కానీ, ఏనాడూ భూమిని వదిలేందుకు ఇష్టపడలేదు.
ఈ నలభై ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఇంతటి కరువును చూడలేదు. ఇప్పుడున్న రెండు బావుల్లో నీరు అడుగంటిపోయాయి. బోర్లు వేసుకుందామన్నా కరెంట్ లేదు. కరెంట్ ఇస్తే బోరు వేసుకుంటాం.
ఫొటోలు: పి రాజమోహన్, రాయచోటి
కార్డుల వల్ల ఒరిగిందేమీ లేదు
రకరకాలుగా పంటలు సాగు చేస్తాం. వరి, వేరుశనగ, కూరగాయలు, పొద్దుతిరుగుడు, మల్బరీ రేషం పంటలు పండించేవాళ్లం. ఎంత లేదన్నా ఏడాదికి లక్ష వరకు ఆదాయం తెచ్చేవాణ్ణి. అందుకే నా బిడ్డలను గొప్ప గొప్ప చదువులు చెప్పించాను. నాకు రేషన్ కార్డు, ఓటరు కార్డు, ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నాయి. కానీ ఏనాడూ వాటి వల్ల మాకు ఒరిగిందేమి లేదు.