దేవుడిచ్చిన రూపం
ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. ఆ అడవిలో పుష్కలంగా దొరికే పచ్చగడ్డిని తిని ఎత్తుగా, బలంగా తయారయ్యింది. దానితో అది తన ఆకారాన్ని చూసుకుని విర్ర వీగి పోయేది. ఒకరోజు గుర్రానికి నీటి కాలువ దగ్గర ఒక ఒంటె కనబడింది. ఒంటె ఆకారాన్ని చూడగానే దానికి నవ్వొచ్చింది. పడీ పడీ నవ్వసాగింది.
‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అని అయోమయంగా అడిగింది ఒంటె.
‘‘నువ్వెలా ఉంటావో నీకు తెలుసా? ఒంకర్లు తిరిగిన పెద్ద మెడ, వీపు మీద ఇంత మూట, సన్నటి పొడవైన కాళ్ళు... మొత్తానికి నీ రూపు భలేగా ఉంటుందోయ్’’ అని సకిలించుకుంటూ నవ్వింది గుర్రం.
గుర్రం మాటలకు ఒంటె బాధ పడింది. జవాబు చెప్పకుండా మౌనంగా అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు గుర్రానికి ఒంటె అక్కడే తారసపడింది.
‘‘ఏమిటోయ్ మిత్రమా! ఎలా ఉన్నావు?’’ ఒంటెను పలకరించింది గుర్రం.
‘‘నీ కోసమే వచ్చాను మిత్రమా! నీ అందమైన రూపం గురించి నిన్న నా స్నేహితులతో చెప్పాను. కానీ వాళ్ళు ‘అసలు అంత అందమనేది ఉంటుందా?’ అని ఆశ్చర్యపోయారు. నేను కోతలు కోస్తున్నానని వెక్కిరించారు. నాకు చాలా అవమానంగా అనిపించింది. నిన్ను వాళ్ళకు చూపించి వాళ్ళ నోళ్ళు మూయించాలని ఉంది. నువ్వు నాతో వస్తావా?’’ అంది ఒంటె.
అది విని గుర్రం తన అందాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చిందని సంతోషించింది. వెంటనే ఒంటె వెంట బయలుదేరింది. కొద్దిసేపు అడవిలో ప్రయాణించాక ఒంటె గుర్రాన్ని తీసుకుని అడవిని దాటి ఎడారి వైపు ప్రయాణం కొనసాగింది. ఇసుకలో చకాచకా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న ఒంటెను అనుసరించడానికి ఇబ్బంది పడింది గుర్రం. దాని కాళ్లు ఇసుకలో కూరుకుపోయి అడుగుపడటం కష్టమైపోయింది.
‘‘త్వరగా నడువు మిత్రమా! నా స్నేహితులంతా నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు’’ అంటూ ఒంటె నడక వేగం పెంచింది.
మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రంగా ఉంది. వేడిగాలులు వీస్తున్నాయి. అప్పుడప్పుడు వీచే బలమైన గాలికి ఇసుకరేణువులు గుర్రం ముక్కులోకి, కళ్ళలోకి దూరిపోతున్నాయి. దాహంతో కాలుక పిడచ కట్టుకుపోగా ‘‘ఇంకెంత దూరం నడవాలి?’’ అని గుర్రం భయంగా అడిగింది.
‘‘ఇంకో గంట నడవాలి’’ అని చెప్పింది ఒంటె.
మరికొంత దూరం వెళ్ళగానే ఇక గుర్రం అడుగులు ముందుకు వేయలేక పోయింది.
‘‘నేనింక నడవలేను.’’ అంటూ ఇసుకలో చతికిలపడిపోయింది గుర్రం.
‘‘చూసావా మిత్రమా! ఎవరికి ఏ రూపం అవసరమో వారికి అలాంటి రూపమే ఇస్తాడు దేవుడు. నేను అందంగా లేనని గేలి చేసావు. ఎంతో అందంగా, బలంగా ఉన్నానని విర్రవీగావు. ఇప్పుడు ఏమైంది? ఎడారిలో నివసించడానికి వీలుగా నా రూపం ఇలా ఉంది. అది అర్థం చేసుకో’’ అని చెప్పింది ఒంటె.
తన తప్పు తెలిసివచ్చిన గుర్రం సిగ్గుతో తల వంచుకుంది.
నీతి: దేవుడు ఎవరి అవసరానికి తగిన ఆకారాన్ని, రూపాన్ని వారికి ఇస్తాడు. దాన్ని చూసుకుని పొంగిపోవటమూ, కుంగిపోవటమూ కూడా తప్పే! దానివల్ల ముప్పే!