కెన్యా వన విహారం
అరణ్యాలూ, పర్వతాలూ, వన్యమృగాలకి ఆలవాలం కెన్యా. ఆ అరణ్యాలనీ, ఆ అరణ్యాలలో తమ సహజ పరిసరాలలో విహరించే వన్యమృగాలనీ సందర్శించాలని ఆఫ్రికాలోని కెన్యా యాత్రకి బయలుదేరాం. గున్న ఏనుగులకు అనాథాశ్రమం.. ముంబయి నుండి ఆరు గంటల విమానయానం తరువాత కెన్యా రాజధాని నైరోబీలో దిగాం. టూర్ ఆపరేటర్ పంపిన వాహనంలో హోటల్‌కి చేరి, అటు నుంచి విహారానికి బయల్దేరాం. నైరోబీలో తల్లికి దూరమయిన బుల్లి ఏనుగు పిల్లల కోసం ఒక అనాథ శరణాలయం ఉంది. తల్లి లేని ఏనుగు పిల్లల్ని ఇక్కడ కనీసం రెండేళ్ల వయసు నిండే వరకూ పెంచుతారు. ఇక్కడ ఏనుగు పిల్లలు, రెండు సంవత్సరాలు నిండే వరకూ తల్లి సంరక్షణలో లేకపోతే అవి చనిపోతాయి అని వాటి సంరక్షకుడు చెప్పాడు. ఏనుగు పిల్లలకి పాలు పట్టి పెంచుతారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకూ ఏనుగులకి పాలు పట్టడం, వాటి ఆటలు సందర్శకుల కోసం ప్రదర్శనగా ఉంచుతారు.
జిరాఫీలకి ‘ఆం..’ తినిపించాం... నైరోబీలో చూసిన మరో ప్రదేశం- జిరాఫీ సెంటర్. ఇక్కడ జిరాఫీలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. మనం వాటి నోటికి ఆహారం అందిచాలి. అంత పొడవుగా సాగిన మెడ పైన ఉన్న నోటికి ఆహారం అందించాలంటే, మనం మెట్లెక్కి మొదటి అంతస్తులో నిలబడాలి. మొక్కజొన్న, గోధుమలతో తయారయిన సుద్ద ముక్కల్లాంటి వాటిని నిర్వాహకులు మనకి ఇస్తారు. వాటిని ఒక్కొక్కటీ మనం అందిస్తోంటే,మెడలాగానే, బాగా పొడుగ్గా ఉన్న నాలుకని ముందుకు చాపి అందుకుని, ఆనందంగా ఆరగిస్తాయి ఆ జిరాఫీలు.
వన్య మృగాలకూ ఆలవాలం.. ఆ రాత్రి నైరోబీలో విశ్రమించి, ఉదయాన్నే మాసైమారాకి బయలు దేరాం. ఈ ప్రాంతాన్ని మైసైమరా గీకు రిజర్వ్ అంటారు. దీని వైశాల్యం దాదాపు 1500 చ.కి.మీ. ఇది టాంజానియాలోని సెరంగిటీ నేషనల్ పార్కుతో కలిసి ఉంటుంది. ఈ గ్రీకు రిజర్వ్ వన్యమృగాలకి ఆలవాలం. జూలై - అక్టోబర్ నెలల్లో దాదాపు 1.5 మిలియన్ల శాకాహార వన్యమృగాలు టాంజానియా నుండి ఇక్కడికి వలస వస్తాయి. దాన్నే ‘గ్రేట్ మైగ్రేషన్’ అంటారు. మా వాహనదారుడు మమ్మల్ని ‘గ్రీకు డ్రైవ్’కి తీసుకువెళ్ళాడు. వాహనంలో కూర్చుని, వనమంతా తిరుగుతూ వివిధ మృగాలని వెతుకుతూ చూస్తూ, ఆనందించడమే ‘గ్రీకు డ్రైవ్’. వాహనం పై భాగాన్ని తెరుస్తారు. మనం నిలబడి ఆరుబయట ఉన్నట్లుగా మృగాలని చూస్తాం. పదుల సంఖ్యలో ఏనుగులు, వందల సంఖ్యలో జీబ్రాలు, జిరాఫీలూ, వేల సంఖ్యలో వివిధ రకాల జింకలూ ఇలపాలాలూ, గొర్రెలూ దర్శనమిచ్చా యి. టీవీలో చూసే నేషనల్ జియోగ్రఫీ చానెల్‌ని కళ్ళారా చూసినట్లుంది.
లేక్ ఎలిమెంటైటా... రెండు రోజుల అనుభావాన్ని మూటకట్టుకుని మాసైమరాకి వీడ్కోలు పలికి లేక్ ఎలిమెంటైటాకి బయలుదేరాం. దారిలో 139 చ.కీ.మీ. వైశాల్యం ఉన్న నైవేష సరస్సులో నౌకా విహారం, నీటిలో ఉన్న హిప్పోపొటమస్‌ల పక్క నుండీ వెళ్తూ, మధ్యలో ద్వీపాల మీద ఉన్న జంతువులని పక్షులనీ చూసుకుంటూ.. ఆ విహారం కేరళలోని ‘చోక్‌వాటర్స్’ లో బోట్ ప్రయాణాన్ని తలపించింది. - మరో మజిలి - అబర్‌డారీ. ఇక్కడ మేం బస చేసిన రిసార్ట్‌లో ఏనుగులూ, ఇతర జంతువులూ నీళ్ళు తాగడానికి వచ్చేలా, వాటిని దగ్గర్నుండి చూసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి.
భూమధ్యరేఖ... ఈ ప్రయాణంలో ‘నాన్యుకి’ అనే ప్రాంతం దగ్గర ‘భూమధ్యరేఖ’ మమ్మల్ని ఆకర్షించింది. ఆ రేఖా ప్రాంతం మీద నిలబడడం ఒక అనుభూతి. భూమధ్యరేఖకి ఉత్తరాన దక్షిణాన నీరు సుడి తిరిగే దశలు వేరుగా ఉంటాయి. ఉత్తరాన నీరు కుడి పక్కకి సుడి తిరుగుతుంది. దక్షిణాన నిలబడితే అదేనీరు ఎడమవైపుకి సుడి తిరుగుతుంది. భూమధ్యరేఖ మీద ఉంటే మాత్రం ఎటూ సుడి తిరగదు. ఈ అంశాన్ని అక్కడ ఉన్న వ్యక్తి ఒక చిల్లు గిన్నెలో నీటిని పోసి, అందులో ఒక అగ్గిపుల్ల వేసి చూపించాడు.
నల్లవారు ‘నల్ల’ వారు... కెన్యాలో ఉన్న ఆరురోజుల్లో ఎందరో నల్ల వారిని కలిశాం. సభ్యత, సంస్కారం, మర్యాదతో మెలిగారు. మేము శాకాహారులం.. అందుకు అనుగుణంగా ప్రతి హోటల్లో మమ్మల్ని ఎంతగానో అందరించారు. అసలు వారి వంటల్లో భారతీయుల వంటకాల పేర్లే ఎక్కువ, నన్ను సంబోధించాల్సి వస్తే, మామ (అమ్మ) అనేవారు. అది మన పద్ధతే కదా!
క్రాహేరి కెన్యా: యాత్ర ముగించుకుని నైరోబీ ఏర్‌పోర్టుకి చేరి, క్రాహేరి కెన్యా (గుడ్‌బై) అని చెప్పి విమానంలో ‘జాంచో’ (హెలో) అని మాట్లాడుతున్న ఎయిర్‌హోస్టెస్ మాటలు వింటూ తిరుగుప్రయాణమయ్యాం.
- డా॥గాయత్రీదేవి, ఆయుర్వేద వైద్యులు, హైదరాబాద్