ఉహురు కెన్యాట్టా – కెన్యా అధ్యక్షుడు, మార్గరెట్ వాంజిరు గకువో – కెన్యా తొలి మహిళ, వాళ్ల ముందు భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి ప్రసంగించారు ఓ మహిళ. మన వివాహ వ్యవస్థను చప్పట్లతో అభినందిస్తూ మళ్లీ మళ్లీ విన్నారు వాళ్లు. కెన్యాలో ఉన్న హిందువుల పెళ్లిని నిర్ధారించాల్సిన బాధ్యత ఆమెకే అప్పగించారు. ఇప్పుడు... దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తున్నాయి... యుద్ధానికి దేశాన్ని సన్నద్ధం చేయాల్సిన బాధ్యతనూ ఆమె భుజాల మీదనే పెట్టింది కెన్యా. ఇప్పుడామె... ఆ దేశంలో వాళ్లకు మన నమస్కారాన్ని నేర్పిస్తున్నారు.
చిలుక పచ్చ బోర్డరున్న నేవీ బ్లూ చేనేత చీర కట్టుకుని, చెవులకు బుట్ట జూకాలు ధరించిన ఓ అచ్చమైన తెలుగింటి మహిళ చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడి చివరగా స్వాహిలి భాషలో ‘కోమేషా కరోనా’ అంటూ నమస్కారంతో పూర్తి చేశారు. కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కెన్యా దేశ ప్రజలకు వివరించడానికి రూపొందించిన వీడియో అది. ఇరవై ఏడేళ్ల కిందట భర్త ఉద్యోగ రీత్యా ఆరు నెలలు మాత్రమే ఉండడానికి కెన్యాలో అడుగుపెట్టారు కోటంరాజు సుజాత. ‘ఇరవై ఏడు క్యాలెండర్‌లు మారినా నాకింకా ఆరు నెలలు పూర్తికాలేద’న్నారామె నవ్వుతూ. స్వాహిలి భాష నేర్చుకుని కెన్యా ప్రజలతో మమేకమైపోయారామె. కరోనాసంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కెన్యా తీసుకుంటున్న రక్షణ చర్యల్లో భాగంగా ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ సుజాత దగ్గరకు వచ్చింది. భౌతికదూరం పాటించడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం, షేక్‌హ్యాండ్‌కు బదులు నమస్కారం చేయడం ద్వారా కరోనాను దూరంగా ఉంచవచ్చనే సందేశాన్ని సుజాత మాటల్లో చెప్పించుకుంది కెన్యా. ఆ దేశ టీవీల్లో ఆమె సందేశమిచ్చిన వీడియో ప్రసారమవుతోంది.
బందరమ్మాయి
కోటంరాజు సుజాత పుట్టింది, పెరిగింది మచిలీపట్నంలో. పెళ్లి తరవాత హైదరాబాద్‌కి వచ్చి చైల్డ్ సైకాలజీలో కోర్సు చేశారు. భర్త కోటంరాజు రుద్రప్రసాద్ బరోడాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న రోజులవి. ఉద్యోగంలో భాగంగా కెన్యాకు వెళ్లాల్సి వచ్చింది. ఆ దేశం వెళ్లడానికి మొదట్లో ఏ మాత్రం ఇష్టపడని సుజాత... కొన్నాళ్ల తర్వాత అయిష్టంగానే కెన్యాలో అడుగుపెట్టారు. అది కూడా ఆరునెలల్లో వచ్చేయవచ్చనుకుంటూ విమానం ఎక్కారు. ఆ తర్వాత ఆమె ఇండియాకి వచ్చింది ప్రసవం కోసమే. ‘గృహిణిగా కెన్యాలో అడుగుపెట్టిన సుజాత... ఇప్పుడక్కడ కీలకమైన బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నారు. కెన్యా సమాజ నిర్మాణంలో కూడా ఆమె సేవలందిస్తున్నారు.
జర్మనీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన అంతర్జాతీయ శాంతిసదస్సుకు కెన్యాప్రతినిధిగా హాజరయ్యారు. ‘ఆఫ్రికా ఉమెన్ ఫెయిత్ నెట్‌వర్క్’, కెన్యా హెల్త్‌కేర్, లేబర్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, యాంటీ కరప్షన్ స్టీరింగ్ కమిటీలలో మెంబరుగా విశేషంగా సేవలందిస్తున్నారు. కెన్యాలోని హిందూ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ, సత్యసాయి సేవా సమితి వైస్‌ప్రెసిడెంట్‌గా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కరోనా భూతాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో ఉపాధికి దూరమైన వాళ్లను ఆదుకోవడానికి కెన్యాలో ఉన్న హిందూ కౌన్సిల్ ప్రభుత్వానికి వంద మిలియన్ షిల్లింగులను (సుమారు ఏడు కోట్ల పదిలక్షల రూపాయలు) విరాళంగా ఇవ్వడంలో సుజాత చొరవ ప్రధానమైనది. ఇవి కాకుండా స్వయంగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, హెచ్‌ఐవి బాధితుల శరణాలయాలకు వెళ్లి విరాళాలను పంపిణీ చేశారామె.
మనవాళ్లే స్ఫూర్తి
‘‘1992లో మా వారు కెన్యాలో కొంతకాలం పని చేయాలని చెప్పగానే ప్రపంచ పటం తీసుకుని కెన్యా ఎక్కడ ఉందోనని చూసుకున్నాను. అన్యమనస్కంగానే బయలుదేరాను. అప్పటికి కెరీర్ ప్లాన్లు కూడా ఏమీ లేవు. అక్కడికి వెళ్లిన తర్వాత నాలో మార్పు వచ్చింది. సమాజాన్ని చూసే దృక్కోణం మారిపోయింది. కెన్యాలో నూరుశాతం అక్షరాస్యత ఉంది. ఇళ్లలో పని చేయడానికి వచ్చిన వాళ్లు కూడా మంచి ఇంగ్లిష్ మాట్లాడతారు. రెండు–మూడు తరాల కిందట మనదేశం నుంచి వెళ్లిన అనేక కుటుంబాలు నాలో ఇండిపెండెంట్‌గా జీవించగలగాలనే కోరిక కలిగించాయి. ముఖ్యంగా గుజరాత్ వాళ్లయితే ముసలి వాళ్లు కూడా సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుని వస్తుంటారు. దాంతో నేను ఇండియాలో చదివిన మాంటిస్సోరీ చైల్డ్ సైకాలజీలోనే అడ్వాన్స్‌డ్ కోర్సు చేసి అదే విద్యాసంస్థలో టీచర్‌గా చేరాను. పిల్లలతోపాటు నేనూ స్కూలుకెళ్లేదాన్ని. కొన్నేళ్లకు మా వారు ఉద్యోగం మానేసి నైరోబీ (కెన్యా రాజధాని)లో సొంత వ్యాపారం మొదలు పెట్టారు. తరచూ మారిపోయే ఉద్యోగులతో ఆయనకు ఇబ్బంది ఎదురవుతుండేది. దాంతో నేను టీచర్ ఉద్యోగం మానేసి మా సంస్థలో హెచ్‌ఆర్, అకౌంట్స్ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టాను. సంస్థ నిర్వహణలో నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయమేమిటంటే... కరోనా లాక్‌డౌన్ కారణంగా పనులు ఆగిపోవడంతో అనేక కంపెనీలు ఉద్యోగాల కోత, జీతాల కోతను ఆశ్రయిస్తున్నాయి. కానీ నేను ఆ పని చేయలేదు.
కెన్యా భాష స్వాహిలి
నేను సరదాగా స్వాహిలి భాష నేర్చుకున్నాను. నేను మాట్లాడే స్వాహిలి విన్న వాళ్లు నేను కెన్యాలో పుట్టి పెరిగాననుకుంటారు. వాళ్ల భాష నేర్చుకోవడం వల్ల స్థానికంగా సామాజిక కార్యక్రమాల నిర్వహణలో వాళ్లతో సులభంగా కలిసిపోగలిగాను. ప్రస్తుతం కెన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి కరోనా నియంత్రణ, నివారణ కోసం పని చేస్తున్నాను. చాలా బాగా కట్టడి చేయగలిగామనే చెప్పాలి. మా దగ్గర కోవిడ్ కేసులు పదకొండు వందల దగ్గరే ఆగిపోయాయి. మరణాలు యాభై దాటలేదు’’ అన్నారు సుజాత.
రెండూ సొంత దేశాలే
మన భారతదేశంలో పుట్టి, కెన్యా గురించి మాట్లాడేటప్పుడు ‘మా దగ్గర’ అన్నారామె. అంతగా ఆ దేశంతో మమేకమైపోయారు సుజాత. ‘‘మరి ఈ దేశం (కెన్యా) మాకు పౌరసత్వం కూడా ఇచ్చింది. ‘మా’ అనుకోకుండా ఉండలేను. ఇండియా ఎంతో నాకు కెన్యా కూడా అంతే’’ అన్నారు సుజాత. కరోనా తగ్గిన తర్వాత ఫ్రాన్స్‌లో ఉన్న పెద్ద కొడుకు, యూఎస్‌లో ఉన్న చిన్న కొడుకుకీ సెలవు చూసుకుని అందరం ఒకసారి ఇండియాకి రావాలని ఉందన్నారామె. – వాకా మంజులారెడ్డి
‘కరోనాను కట్టడి చేద్దాం’ అని కెన్యా ప్రజలకు పిలుపునిస్తున్న కోటంరాజు సుజాత
Comments
Please login to add a commentAdd a comment