
ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఈ నెల 10వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతికి వచ్చిన 39 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఈ నెల 10వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతికి వచ్చిన 39 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ మహిళ శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపి పరీక్షించగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మహిళ కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్టు స్పష్టం చేశారు. ఒమిక్రాన్ సోకిన మహిళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు పేర్కొన్నారు.
ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో మహిళ ఉన్నట్టు తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం, ఇతర ఏ లక్షణాలు మహిళకు లేవన్నారు. గురువారంతో క్వారంటైన్ 10 రోజులు పూర్తవుతుందని, తిరిగి వైరస్ నిర్ధారణ పరీక్ష చేపడతామన్నారు. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన 45 మందికి, వారి సన్నిహితులు 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు చెప్పారు. వీరి నమూనాలన్నింటినీ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, భౌతిక దూరంతో పాటు ఇతర కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, చిత్తూరు జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రోజు నుంచే ఆమె నివాస పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. డోర్ టు డోర్ ఫీవర్ సర్వే నిర్వహించారు. గతంలో విజయనగం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ రాగా అతను వెంటనే కోలుకున్న విషయం తెలిసిందే.