జైలు జీవితం ఎందుకని అడిగితే... చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి అని చెప్తాం. నిజానికి నేరం చేసిన వారిని జైల్లో ఉంచడం వెనుక ఉన్న పరమార్థం వారిలో పరివర్తన తీసుకురావడమే. అలాంటి పరివర్తన అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు మొదలైనట్లే ఉంది. నాలుగేళ్ల శిక్షలో భాగంగా శశికళ కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో ఉంటున్నారు. అక్కడ ఆమె ‘అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్’ (వయోజన అక్షరాస్యత కార్యక్రమం)లో చేరి కన్నడ అక్షరాలు దిద్దుతున్నారు. కన్నడలో పదాలు చదవడం, రాయడం నేర్చుకుంటున్నారు. అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ క్లాస్‌లకూ హాజరవుతున్నారు. లైబ్రరీలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
మౌనమే సమాధానం
శశికళ కన్నడ భాషను ఏ మేరకు నేర్చుకున్నారనేది నిర్ధారించడానికి అధికారులు ఇప్పటికే ఒక మౌఖిక కూడా నిర్వహించారు. అయితే ఆ రోజు శశికళ మౌనవ్రతంలో ఉండటంతో ఏ ప్రశ్నలకూ నోరు తెరిచి సమాధానం ఇవ్వలేదు. మౌఖికంగా సమాధానాలివ్వకపోయినా ఆమె కన్నడ అక్షరాలు, పదాలను చక్కగా రాస్తున్నారని, సిలబస్‌ను చక్కగా పూర్తి చేశారనే ఒక అంచనాకు రావడానికి అది సరిపోతుందని జైలు వర్గాలు అంటున్నాయి. అంటే.. ‘లిటరసీ ప్రోగ్రామ్’లో విజయవంతంగా పాల్గొన్నట్లు శశికళ చేతికి త్వరలోనే ఒక సర్టిఫికెట్ రాబోతోంది. శశికళతోపాటు అదే కేసులో శిక్షను అనుభవిస్తున్న ఆమె మరదలు ఇళవరసి కూడా కన్నడం నేర్చుకుంటున్నారు.
మహిళలకు లైబ్రరీ!
ఇప్పటి వరకు పరప్పన సెంట్రల్ జైలులో మహిళల విభాగంలో లైబ్రరీ లేదు. ఇప్పుడు శశికళ చొరవతో లైబ్రరీని విస్తరించి మరో రెండు విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి విచారణ ఖైదీలకు, మరొకటి మహిళా ఖైదీల కోసం. మహిళల లైబ్రరీ కోసం ముప్పై వేలు పెట్టి వార్తాపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు అన్నీ కలిపి 91 పత్రికలు తెప్పించడానికి రంగం సిద్ధమైంది. ర్యాక్‌లు రెడీ అవుతున్నాయి!
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment