లలిత పేరులో లాలిత్యం ఉంది కానీ ఆమె జీవితం అంత సుకుమారంగా ఏమీ సాగలేదు. వారిది చెన్నైలోని తెలుగు కుటుంబం. శుద్ధసంప్రదాయమైన కుటుంబం కూడా. ఏడుగురిలో ఐదో సంతానం. తండ్రి ఇంజనీర్. కొడుకులను కూడా ఇంజనీరింగ్ చదివించారు. కానీ ఆడపిల్లలను పదో తరగతి దాటనివ్వలేదు. లలితకు పదో తరగతితో చదువు అయిందనిపించి పదిహేనో ఏట పెళ్లి చేశారు. ఆ తరవాత రెండేళ్లకే ఆమె ఓ పాపాయికి తల్లయింది. కొద్ది నెలలకే భర్త పోయాడు. పద్దెనిమిదేళ్లకు వితంతువు అనే ముద్రకు తలవంచాల్సి వచ్చింది. సమాజం వేసిన ముద్ర కంటే కఠినమైన ముద్ర అత్తగారు వేశారు. ‘శాపగ్రస్తురాలు’ అనే ముద్ర అది! లలిత అనే పేరునే మర్చిపోయారు వాళ్లు.
నవ సమాజ నిర్మాణం
సమాజంలో వితంతువుకు ఎదురవుతున్న అవమానాలను తుడిచేయాలనుకున్నారు లలిత. ‘నేను చదువుకుంటాను’ అని పుట్టింటి వాళ్లతో చెప్పారు. తండ్రి ఆమెకు అండగా నిలిచాడు. డాక్టర్ కోర్సు చేయమని సలహా ఇచ్చారామెకి. మహిళలు ఇంజనీరింగ్ రంగంలో అడుగు పెట్టని రోజులవి. లలిత మాత్రం ఒకటే మాట చెప్పారు. ‘వివాహిత అలాంటి దుస్తులు ధరించాలి, వితంతువు ఇలాంటి దుస్తులు ధరించాలి... అంటూ మూఢత్వంలో మగ్గిపోతున్న సమాజంలో మార్పు రావాలి. కొత్త సమాజ నిర్మాణం జరగాలి. అది నాతోనే జరుగుతుంది. వితంతువు కూడా ఎవరికీ తీసిపోకుండా రాణిస్తుందని నిరూపిస్తాను’ అన్నదామె స్థిరంగా. ‘‘డాక్టర్ అయితే ఏ అర్ధరాత్రో కేసు వస్తే బిడ్డను ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఇంజనీర్ ఉద్యోగంలో అలాంటి ఇబ్బంది ఉండదు’’ అని తన తల్లిని సమాధాన పరిచింది లలిత.
అంతర్జాతీయ సదస్సులకు!
ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న తర్వాత లలిత సిమ్లా, కోల్‌కతాలలో ఉద్యోగం చేశారు. తండ్రి పరిశోధనల్లో సహాయం చేశారు. ఆయన జెలోక్టోమోనియమ్ అనే సంగీత పరికరాన్ని, ఎలక్ట్రిక్ ఫ్లేమ్ స్టవ్, పొగరాని స్టవ్‌లను కనిపెట్టారు. ఇంజనీర్‌గా లలిత సాధించిన విజయాలే ఆమెను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లాయి. అమెరికా, న్యూయార్క్‌లో 1964లో జరిగిన తొలి మహిళా ఇంజనీర్‌లు, సైంటిస్టుల సదస్సుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. యాభై ఐదేళ్లకే తుది శ్వాస వదిలిన లలిత... తన జీవితాన్ని కూతుర్ని పెంచుకోవడానికి, ఇంజనీరింగ్ పరిశోధనలకే అంకితం చేశారు. (లలిత కూతురు శ్యామల అమెరికాలో స్థరపడ్డారు. ఆమె తాజాగా ఇండియన్ మీడియాతో పంచుకున్న విషయాలివి)
– మంజీర
‘షీ’ సర్టిఫికేట్‌లు
లలిత తండ్రి సుబ్బారావు చెన్నైలోని గిండిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్‌లో ప్రొఫెసర్. ఆయనే లలితను కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇంజనీరింగ్‌లో చేరుతానని తొలిసారిగా ఒక మహిళ అడ్మిషన్ అడగడం వారికి కూడా ఆశ్చర్యమే. లలితకు సీటివ్వడంతోపాటు ఆమె కోసం హాస్టల్ భవనంలో మార్పులు కూడా చేయించారు ప్రిన్సిపల్. అలా కాలేజ్‌లో చేరారు లలిత. వందలాది మంది యువకుల మధ్య ఒక్క యువతి. కోర్సు పూర్తయిన తర్వాత ఆమెకు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మరో ధర్మసంకటం ఎదురైంది. అప్పటి వరకు కాలేజ్ సర్టిఫికేట్ ప్రొఫార్మాలో ‘హీ’ అని ఉండేది. లలిత కోసం సర్టిఫికేట్‌లలో ‘హీ/షీ’ అని కొత్తగా ముద్రించారు. లలిత ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత ఏడాది ఆ కాలేజ్ మహిళలకు కూడా ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఆమె ఇంజనీరింగ్ కోర్సులో ఉండగానే ఆ కాలేజ్‌లో మరో ఇద్దరు మహిళలు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment