
రెట్టింపు కానున్న వృద్ధుల జనాభా
పరిపరి శోధన
ఆధునిక వైద్య పరిశోధనల పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆయుఃప్రమాణం రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా దాదాపు అన్ని దేశాల్లోనూ వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది. మరో ముప్పయ్యేళ్లలో వృద్ధుల జనాభా రెట్టింపు కాగలదని అంతర్జాతీయ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య దాదాపు 60 కోట్ల వరకు ఉంది. వృద్ధుల సంఖ్య ఏటా 8.5 శాతం మేరకు పెరుగుతూ వస్తోంది. అయితే, 2050 నాటికి వృద్ధుల జనాభా 160 కోట్లకు చేరుకోగలదని, వృద్ధుల జనాభా పెరుగుదల వేగం ఏడాదికి 17 శాతానికి చేరుకోగలదని అమెరికా సెన్సస్ బ్యూరో తన తాజా నివేదికలో ప్రకటించింది.