భారత్ యువ దేశం.. మొత్తం జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వాళ్లే. సగటు వయస్సు 29 కంటే తక్కువ ఉన్నందున భారత్‌ను యువ దేశం అని పిలుస్తారు. దేశమయితే యువతది కానీ.. పరిపాలిస్తున్నవారు మాత్రం వయసు మల్లినవారు. గత 20 ఏళ్లలో ఎన్నికైన ఎంపీల సగటు వయసును పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.
ఇప్పటివరకూ 17 లోక్‌సభలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1999లో 13వ లోక్‌సభ నుంచి 2019లో 17వ లోక్‌సభ వరకూ ఎన్నికైన ఎంపీల సగటు వయసు 50 ఏళ్లు దాటింది. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీలైనవారి సగటు వయసు అయితే ఏకంగా 55 ఏళ్లకు చేరడం గమనార్హం. ఎంపీగా పోటీ చేయడానికి భారత రాజ్యాంగం నిర్దేశించిన వయసు 25 ఏళ్లే అయినా ఎన్నికవుతున్న ఎంపీల సగటు వయసు 55 ఏళ్లు తాకింది. ఎంత ఎక్కువ మంది వయసు మళ్లినవారు ఎంపీలుగా ఎన్నికవుతున్నారంటే అంత ఎక్కువగా యువత ప్రాతినిధ్యం తగ్గుతోందని అర్థం.
17వ లోక్‌సభకు ఎన్నికైన అత్యంత పెద్ద వయస్కుడైన ఎంపీ షఫీకర్ రెహ్మాన్ బార్క్. ఈయన ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక ఇదే లోక్‌సభలో అత్యంత పిన్నయస్కురాలైన ఎంపీ చంద్రాని ముర్ము. ఒడిశాలోని కియోంజార్ స్థానం నుంచి ఈమె గెలుపొందారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, భారతీయ జనాభాలో దాదాపు 11 శాతం మంది 25-30 ఏళ్ల వయస్సులో ఉన్నారు. 2019 లోక్‌సభలో, ఈ వయస్సులో 1.5 శాతం మంది ఎంపీలు కూడా లేరు. 2011 జనాభా గణన కూడా భారతీయ జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ మంది 25-40 ఏళ్ల వయస్సులో ఉన్నారని చెబుతోంది. అయితే ఈ ఏజ్ గ్రూపు 17వ లోక్‌సభలో కేవలం 12 శాతం మాత్రమే. ఈసారి 18వ లోక్‌సభలో అయినా యువత ప్రానిధ్యం మెరుగుపడుతుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment