భువనేశ్వర్: రాష్ట్రంలో పూరీ పార్లమెంటరీ నియోజకవర్గం బీజేపీ, బీజేడీకి ప్రతిష్టాత్మకం. ఈ నియోజకవర్గం విషయంలోనే రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు వివాదాస్పదమైనట్లు సమాచారం. శ్రీజగన్నాథ క్షేత్రం ప్రాధాన్యతతో పూరీ లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించుకోవాలని అధికార బీజేడీ గత కొన్ని సంవత్సరాల నుంచే వ్యూహాత్మకంగా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇంతలో పొత్తు వ్యవహారం వచ్చింది. అయితే ఈ స్థానం తాము సొంతం చేసుకోవాలని చేసిన వ్యూహ రచన అంచనా మేరకు ఫలప్రదం కాలేదు. దీంతో ఇప్పుడు ఒంటరి పోరులోనైనా పూరీ లోక్‌సభ స్థానం చేజిక్కించుకోవాలని ఉభయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా పరిగణించడంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పూరీ లోక్‌సభ స్థానం ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం బీజేడీకి చెందిన పినాకి మిశ్రా పూరీ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. 2019లో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రోపై 12,000 ఓట్ల ఆధిక్యంతో గెలిపొందారు. అయితే పినాకి మిశ్రా ఈసారి పోటీ చేయడానికి ఆసక్తి కనబరచడం లేదు. అదే సమయంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన సంబిత్ పాత్రో పూరీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబిత్ పాత్రోకు ధీటైన పోటీనిచ్చే అభ్యర్థి కోసం అధికార బిజూ జనతా దళ్ లోతుగా ఆలోచిస్తోంది.
బీజేడీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్..?
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి, చురుకై న నాయకుడు అరుప్ పట్నాయక్‌ని పూరీ లోక్‌సభకు పినాకి మిశ్రా స్థానంలో బరిలోకి దింపేందుకు బీజేడీ వ్యూహ రచన చేస్తోంది. అలాగే నయాగడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ కుమార్ సాహు, కందమాల్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ అచ్యుత్ సామంత్ అభ్యర్థిత్వాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో, 5 స్థానాల్లో బీజేడీ బలం కొనసాగుతోంది. వీరిలో ఒక ఎమ్మెల్యే ఇటీవల బీజేపీలో చేరడంతో బీజేడీ ఉనికి బీటలు వారింది. 2022లో బిజూ జనతా దళ్ నుంచి బహిష్కరణకు గురైన పూరీ జిల్లా చిలికా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత జగదేవ్ ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు.
వివాదాస్పదంగా సత్యబాది
ఈ జిల్లాలో సత్యబాది శాసనసభ నియోజకవర్గం వివాదాస్పదం అయింది. ఈ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే సంజయ్ దాస్ బర్మా ఖరారైనట్లు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. దీంతో బీజేడీ సంక్లిష్ట పరిస్థితిని ఎదురీదాల్సి వచ్చింది. సిటింగ్ ఎమ్మెల్యే ఉమాకాంత సామంతరాయ్‌తో సమావేశాన్ని నిర్వహించి తాత్కాలికంగా సర్దుబాటు చేసింది. సంజయ్ దాస్ బర్మా 2 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో బ్రహ్మగిరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లలితేందు బిద్యాధర్ మహాపాత్రోతో తలపడి సంజయ్ దాస్ బర్మా ఓటిమి పాలయ్యారు. దీంతో ఆయన పరపతి కొంతవరకు మసకబారింది.
సత్యబాదిలో ఉమాకాంత సామంతరాయ్‌కు బలమైన ప్రజా నాయకుడుగా గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో ఖాతా తెరుచుకోలేని బిజూ జనతా దళ్ 2019లో ఉమాకాంత సామంతరాయ్ పా ర్టీలో చేరిన తర్వాత విజయం సాధించడం తార్కాణంగా నిలిచిపోయింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజేతగా నిలిచారు. అటువంటి నాయకుడి చేరికతో పూరీ జిల్లాలో బీజేడీ క్రమంగా బలం కూడగట్టుకుంది.
నయాగడ్‌లో గట్టిపోటి
పూరీ జిల్లా నయాగడ్ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఈసారి గట్టిపోటీ ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా డాక్టర్ అరుణ్ కుమార్ సాహు గెలిచారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రత్యూష రాజేశ్వరి సింగ్‌ని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈమె కందమాల్ మాజీ ఎంపీ దివంగత హేమేంద్ర చంద్ర సింగ్ భార్య.
ప్రత్యూష నయాగడ్ రాణీ మాతగా ప్రాచుర్యం సాధించింది. అలాగే బీజేపీకి చెందిన జయంత్ షడంగి ప్రాతినిథ్యం వహిస్తున్న పూరీ సదర్ సీటుని కై వసం చేసుకోవాలని బీజేడీ ఉరకలేస్తుంది. ఈ అవకాశాన్ని సానుకూలంగా మలచుకుని బీజేడీ టికెటుతో పోటీకి బరిలోకి దిగేందుకు సుభాశిష్ ఖుంటియా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశలో ఆశలు నేరవేరే అవకాశం అంతంతమాత్రమే. పూరీ సదరు నియోజకవర్గం నుంచి దివంగత మాజీ మంత్రి, దీర్ఘకాల బీజేడీ ఎమ్మెల్యే మహేశ్వర్ మహంతి కుమారుడు సునీల్ మహంతిని బరిలోకి దింపి మాజీ నాయకునిపై సానుభూతితో తాజా ఎన్నికల్లో ఘన విజయంతో బీజేపీ చేతిలోని పూరీ సదరు స్థానం కై వసం కోసం అధిష్టానం జిత్తులతో సమీక్షిస్తోంది. ఈ నిర్ణయంపై అసంతృప్తి తలెత్తకుండా బీజేడీ అధిష్టానం ముందస్తుంగా సుభాశిష్ ఖుంటియాని రాజ్యసభకు పంపినట్లు తాజా పరిస్థితుల్లో తేటతెల్లమైన విషయం జటిలమైన పరిస్థితిని ప్రేరేపించింది.
Comments
Please login to add a commentAdd a comment