
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్ర శేఖర్ ఆజాద్ తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల 18వ లోక్‌సభలో నగీనా ఎంపీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎంపీగా రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసిన తర్వాత ‘జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై మండల్, జై జోహార్, జై జవాన్, జై కిసాన్’ అని నినాదాలు చేశారు. అయితే తాజాగా ఆయన ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రమాణ స్వీకారం తర్వాత నినాదాలు చేయటానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ‘‘ఆ నినాదాలు గొప్ప వ్యక్తులతో ముడిపడి ఉన్నాయి. 'జై భీమ్', 'జై భారత్' మా గుర్తింపును తెలియజేస్తాయి. మండల్ కమిషన్ అమలులోకి వచ్చాక వెనుకబడిన వర్గాలకు పలు అవకాశాలు లభించాయి. ఆయన వల్లే వెనకడిన వర్గాలు ముందుకు సాగుతున్నాయి.
భారత ప్రజాస్వామ్యానికి, ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే నేను లోక్‌సభలో ప్రమాణం చేసిన సమయంలో ఓ ఎంపీ అది నచ్చక ఈరోజే మొత్తం స్పీచ్ ఇస్తావా అంటూ వెక్కిరించారు. నేను ఇక్కడికి స్పీచ్ ఇవ్వడానికే వచ్చానని బదులు ఇచ్చా. నేను మాట్లాడటానికి వచ్చాను. మీరు వినాల్సి ఉంటుందన్నా’’ అని ఆజాద్ తెలిపారు.
తమ హక్కులను లాగేసుకున్నవారు లోక్‌సభలో మత గళాన్ని వినడం అలవాటు చేసుకోవాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ 1,51,473 ఓట్ల మెజార్టీతో బీజేపీకి చెందిన ఓం కుమార్‌పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment