ఈ ఖండంలోనే అత్యంత హెల్దీ దేశాలు
ప్రపంచ టాప్–3లో సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా
34వ ర్యాంకులో బ్రిటన్, 69వ ర్యాంకులో అమెరికా
112వ ర్యాంకులో భారత్
ఆయుర్దాయంలోనూ సింగపూర్‌దే అగ్రస్థానం
గ్లోబల్ హెల్త్ ఇండెక్స్–2024 నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఆసియా దేశాల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. చిన్న దేశాల్లోనూ ఉత్తమ ఆహార అలవాట్లు, వ్యాయామ విధానాలతో ప్రజలు జీవన ప్రమాణాలను పెంచుకుంటున్నారు. ఎంతో అభివృద్ధి చెందినట్టు భావిస్తున్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతున్నట్టు గుర్తించారు. ప్రపంచంలోని 200 దేశాల్లో ఆహార అలవాట్లు, ఆరోగ్య శ్రద్ధపై చేసిన సర్వే నివేదిక ‘బ్లూమ్‌బర్గ్, గ్లోబల్ హెల్త్ ఇండెక్స్–2024’ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలో టాప్–3 హెల్త్ ర్యాంకులు ఆసియా దేశాలైన సింగపూర్, జపాన్, దక్షిణ కొరియావే. తొలి స్థానం సింగపూర్‌ది కాగా.. జపాన్, దక్షిణ కొరియా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.
నాలుగో స్థానంలో తైవాన్ ఉంది. భారత దేశం 112వ స్థానంలో నిలిచింది. బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ దేశ ప్రజల వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలను అన్ని కోణాల నుంచి అధ్యయనం చేయగా, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ సంస్థ ప్రజల వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యాలపై అధ్యయనం చేసింది. ఈ రెండు సంస్థలుసంయుక్తంగా గ్లోబల్ హెల్త్ ఇండెక్స్–2024 నివేదికను విడుదల చేశాయి.
ఆరోగ్య ప్రగతికి ప్రత్యేక కొలమానం
ఒక దేశ ఆరోగ్యాన్ని కొలవడానికి ప్రత్యేకంగా రూపొందించిన మెట్రిక్ విధానాన్ని బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ వినియోగించింది. దేశ ప్రజల్లో పొగాకు వినియోగం, అధిక రక్తపోటు, ఊబకాయం, స్వచ్ఛమైన నీటి లభ్యత, సగటు ఆయుర్దాయం, పోషకాహార లోపం, మరణానికి కారణాలను ప్రామాణికంగా తీసుకుంది. తీవ్రమైన రోగాలు ప్రబలినప్పుడు ఆ దేశంలో చేపట్టే నివారణ చర్యలు, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకునే విధానాలపై గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ నివేదిక రూపొందించింది.
ఇందులో వ్యాధి నివారణ చర్యలు, అంతర్జాతీయ అంటు వ్యాధులను ముందస్తుగా గుర్తించి నిరోధించడం, వ్యా«ధులు వ్యాప్తి చెందకుండా వేగంగా చర్యలు చేపట్టడం (ర్యాపిడ్ రెస్పాన్స్), ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ, అంతర్జాతీయ నిబంధనల అమలు వంటి అంశాల ఆధారంగా నివేదిక తయారు చేసింది. 2019 ర్యాంకింగ్ ప్రకారం స్పెయిన్ 92.75 స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన దేశంగా ఉండగా, అప్పట్లో 4వ స్థానంలో ఉన్న సింగపూర్ 2024లో 95.3 స్కోర్‌తో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. జపాన్ 95.1 స్కోరుతో రెండో స్థానంలో, 94.3 స్కోరుతో దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచాయి.
అభివృద్ధి చెందిన దేశాలు వెనుకే..
అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకొంటున్న యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్) 88.8 స్కోరుతో 34వ ర్యాంకులో ఉంది. అమెరికాది 2019లో 35వ ర్యాంక్ కాగా, ఇప్పుడు 69కు పడిపోయింది. ఇక మన పక్కనున్న పాకిస్తాన్ 61.3 స్కోరుతో 124వ ర్యాంకు, చైనా 46.3 స్కోరుతో 163వ ర్యాంక్ పొందాయి. భారతదేశం 61.5 స్కోరుతో 112వ ర్యాంకులో ఉంది. కాగా, కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2021లో ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని, అయినప్పటికీ భవిష్యత్‌లో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైతే మహమ్మారిని నిరోధించడానికి ఏ దేశమూ తగిన చర్యలు తీసుకోలేదని నివేదిక పేర్కొంది.
ఆరోగ్యం, ఆయుర్దాయంలో సింగపూర్ టాప్
ఆరోగ్యం, ఆయుర్దాయంలో సింగపూర్‌దే అగ్రస్థానమని నివేదిక తెలిపింది. అక్కడి ప్రభుత్వం ప్రత్యేక సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, పెద్దలు, పిల్లల కోసం పలు రకాల ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొంది. ఈ దేశ జనాభాలో 14 శాతం మందే ధూమపానం చేస్తున్నట్టు గుర్తించింది. ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం 84.8సంవత్సరాలతో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ 84 సంవత్సరాలతో రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం స్పెయిన్ ప్రజల సగటు ఆయుర్దాయం 83.5 సంవత్సరాలు కాగా, ఇది 2040 నాటికి 85.8కి పెరిగి ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం గల దేశంగా నిలుస్తుందని నివేదిక పేర్కొంది. ఇక్కడి ప్రజలు మాంసాహారం కంటే ఆరోగ్యకరమైన కొవ్వులు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటారని, తక్కువ మొత్తంలో రెడ్ మీట్, ప్రాసెస్‌డ్ పదార్థాలు తింటున్నట్టు వివరించింది. ఐరోపాలోనే స్పెయిన్‌లో అత్యధిక శాతం వాకర్లు ఉన్నారని, ఇక్కడ 37 శాతం మంది ఉద్యోగాలకు నడిచే వెళతారని పేర్కొంది. అందుకు భిన్నంగా అమెరికాలో 6 శాతం మంది మాత్రమే పనికి నడిచివెళుతున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment