
ఢిల్లీలో పొగ కాలుష్యం... స్కూళ్లకు సెలవు.. సరి బేసి విధానంలో వాహనాలు.. ఇలా నానా తంటాలు పడుతున్నామా? చైనా మాత్రం ఈ వాయు కాలుష్యం సమస్యకు తనదైన శైలిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా చైనాలోని షెన్‌జెన్‌లోని ప్రతి సిటీబస్సు విద్యుత్తుతో నడిచేదే అవనుంది! పారిశ్రామిక వాడలు బోలెడన్ని ఉన్న షెన్‌జెన్‌లో ఇప్పటికి దాదాపు 14000 విద్యుత్తు బస్సులను ఏర్పాటు చేయగా.. మిగిలిన డీజిల్ బస్సులను కూడా ఏడాది చివరలోగా మార్చేస్తామని అంటోంది చైనా. 2011 నుంచి విద్యుత్తు వాహనాలపై ప్రయోగాలు చేస్తోంది బీవైడీ అనే సంస్థ.
ఒకప్పుడు అనామకంగా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లోని 200 నగరాలకు విద్యుత్తు వాహనాలను సరఫరా చేస్తోంది. భూ తాపోన్నతి కారణంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రపంచంలోని పలు దేశాలిప్పుడు విద్యుత్తుతో నడిచే వాహనాలపై శ్రద్ధపెడుతున్న విషయం తెలిసిందే. భారత్ విషయాన్నే తీసుకుంటే అసోం రాష్ట్రంలో ఇటీవలే అక్కడి రవాణా సంస్థ టాటా మోటర్స్ అభివృద్ధి చేసిన విద్యుత్తు బస్సులను కొనుగోలు చేసింది.