ఆట కోసం అన్నీ వదిలేశా!
మిథాలీరాజ్... భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో పుట్టిన ఈ అమ్మాయి పెరిగింది తెలుగు రాజధాని హైదరాబాద్‌లో. తండ్రి దొరైరాజ్ భారత విమానయాన రంగంలో ఉద్యోగం చేస్తూ ఎయిర్‌ఫోర్స్ తరఫున క్రికెట్ ఆడారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని క్రికెటర్‌గా రాణిస్తున్న మిథాలీరాజ్ 33వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఆమెతో కాసేపు...
మీ క్రీడాజీవితం ఎలా మొదలైంది?
చిన్నప్పుడు గ్రౌండ్‌లోనే నిద్రలేచేదాన్ని. నాన్నగారు ఉదయం 5.30 గంటలకే గ్రౌండ్‌కెళ్లేవారు. నిద్రపోతున్న నన్ను అలాగే తీసుకెళ్లేవారు. నిద్రలేపితే ఏడ్చేదాన్ని.
నాన్న మిమ్మల్ని క్రీడాకారిణిని చేయాలనుకున్నారా?
అన్నయ్యను క్రికెట్ స్టార్‌ని చేయాలని ఉండేది. నన్ను బద్దకం వదిలించి చురుగ్గా మార్చడానికి గ్రౌండ్‌కు తీసుకెళ్లేవారు. నాన్నకు క్రమశిక్షణ పాటించకపోతే నచ్చదు. నన్ను ఉదయాన్నే నిద్రలేపే ప్రయత్నమే అదంతా.
మీలో క్రీడాకారిణి ఉందని ఎవరు గుర్తించారు?
ఓ ఏడాది వేసవి సెలవుల్లో అన్నయ్యతోపాటు నన్ను కూడా కోచింగ్‌కి పంపించారు. ఆ కోచ్ జ్యోతిప్రసాద్‌గారే ప్రాక్టీస్ కొనసాగించమని నాన్నతో చెప్పారు.
భరతనాట్యం ఎందుకు మానేశారు?
నర్తకికి దేహలావణ్యం కూడా ముఖ్యమే. క్రికెట్ ప్రాక్టీస్‌తో చర్మం ఎండకు కమిలిపోతుంది. డాన్సులో కొనసాగాలంటే క్రికెట్ మానేయాలన్నారు డాన్స్ టీచర్.
కానీ మీరు డాన్సునే మానేశారు!
నిర్ణయాన్ని నాకే వదిలేశారు మా అమ్మానాన్న. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. భరతనాట్యం చాలా మంది చేస్తున్నారు, క్రికెట్ కొత్తగా ఛాలెంజింగ్‌గా ఉంది... అనిపించి క్రికెట్ ఆడతానని చెప్పాను.
డాన్సుని వదిలేసినందుకు బాధనిపించిందా?
ఆట కోసం డాన్సుకు మాత్రమే కాదు, సంగీతానికి కూడా దూరమయ్యాను. నాకు పియానో వచ్చు. భవిష్యత్తులో వాటిని నేర్చుకోవచ్చని సర్దిచెప్పుకుంటుంటాను.
మీలో స్థితప్రజ్ఞత చాలా ఎక్కువనిపిస్తుంది..!
మా సీనియర్ కోచ్ సంపత్‌కుమార్ శిక్షణ అది.‘ఫలితాన్ని నిర్ణయించేది ఆటలో నైపుణ్యమే. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఫలితాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మన బాధ్యత నిర్వర్తించామా లేదా అని మాత్రమే ఆలోచించాలి. చిత్తశుద్ధితో ఆడాలి. ప్రతి బంతినీ అంకితభావంతోనే ఎదుర్కోవాలి’ అని చెప్పేవారు.
ఏ దేశంతో ఆడేటప్పుడు ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది?
ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు కెప్టెన్‌గా కొంత ఎక్కువ మేధామథనం చేశాను. ఇంగ్లండ్‌తో కూడా...
ఏ టీమ్‌తో సులువుగా గెలిచారు?
ఒకప్పుడు పాకిస్థాన్, శ్రీలంకలతో ఆట చాలా సులువుగా ఉండేది. ఇప్పుడు వాళ్లు నైపుణ్యం పెంచుకున్నారు.
ఏ దేశంలో క్రికెట్ పర్యటన ఇబ్బందిగా సాగింది?
ఇబ్బంది ఆటకు కాదు, ఆహారానికే. ఇంగ్లండ్‌లో ఫుడ్ బాగాలేదన్నాను. అప్పుడు నాన్న ‘నువ్వు ఫుడ్ కోసం వెళ్లావా, ఆట కోసం వెళ్లావా? నీ దృష్టి ఆట మీద ఉంటే ఆహారంలో రుచి కోసం చూడవు’ అన్నారు. ఇక అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా ఏం తిన్నాం అని చూసుకోవట్లేదు.
మళ్లీ మళ్లీ ఆడాలనిపించిన దేశం, గ్రౌండ్ ఏది?
ఇంగ్లండ్ గ్రౌండ్‌లు బాగుంటాయి. దేశం పరంగా న్యూజిలాండ్ ఇష్టం.
రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలని...
మధ్యలో ఆపేసిన చదువును కొనసాగిస్తాను. ఎం.ఎ చేయాలనుకుంటున్నాను.
క్రికెట్ మిమ్మల్ని నిరుత్సాహపరచిన సందర్భం?
ప్రపంచ కప్‌కి ఎంపికయ్యేనాటికి నాకు 14 ఏళ్లు. ఆ వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడడానికి తగిన మానసిక పరిపక్వత ఉండదని ఆడనివ్వలేదు.
క్రికెట్ మానేయాలని ఎప్పుడైనా అనిపించిందా?
టీనేజ్‌లో ఉన్నప్పుడే ఓ సారి మ్యాచ్‌కోసం రైల్వే టీమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనిపించింది. టీమ్‌లో అందరూ పెద్దవాళ్లు. నన్ను కలుపుకోకపోవడంతో ‘ప్రాక్టీస్ మానేసి వచ్చేస్తా’నని అమ్మకు ఫోన్ చేశాను.
అప్పుడు అమ్మ ఏమన్నారు?
‘ఇప్పుడు పారిపోయి వస్తావు ఓకే. పెద్దయి పెళ్లయిన తర్వాత అత్తగారింట్లో ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడూ పారిపోయి వచ్చేస్తావా? ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలి’ - అని చెప్పింది. ‘నీతో ఎవరూ మాట్లాడకపోతే క్లాసు పుస్తకాలు తీసి మిస్ అయిన పాఠాలు చదువుకో’మని సూచించింది.
వివాహం ఎప్పుడు? క్రీడాకారుడితోనేనా?
వివాహం గురించి ఆలోచనే లేదు. ఇప్పుడు దృష్టంతా ఆట మీదనే. భాగస్వామి ఎలా ఉండాలనే ఆలోచన వచ్చిన తర్వాత చెప్తాను.
- వాకా మంజులారెడ్డి