ఇంచుమించు స్టారే | Almost stars | Sakshi
Sakshi News home page

ఇంచుమించు స్టారే

Published Wed, Apr 6 2016 10:16 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

ఇంచుమించు స్టారే

ఇంచుమించు స్టారే

ఈ సర్జరీ చేయించుకుంటే మహా అయితే మూడు ఇంచులు పెరుగుతాం. అంటే ఆకాశంలో ఉన్న తారలకు మూడు ఇంచులు దగ్గర అవుతాం. ‘ఈ మూడు ఇంచులకు ఇన్ని ముప్పు తిప్పలా!’ అని కొట్టిపారేయకండి. స్టార్ ఇమేజ్ అండీ... స్టార్ ఇమేజీ! అదే.. ఆరడుగుల బుల్లెట్‌లాగా, ఆజానుబాహుడిలాగా... మేట్రిమోనియల్ కాలమ్‌లో సిక్స్ ఫీట్ వరుడిలాగా... ఉంటేగానీ వర్కవుట్ కాదనుకునే వాళ్లు ఎన్ని తిప్పలైనా పడతారు. మెన్న నిఖిల్ చేయించుకున్న ‘హైట్’ సర్జరీ కూడా ఇలాంటిదే!  అసలు ఈ సర్జరీ ఏమిటి? ఫలితాలేమిటి? పర్యవసానాలు ఏమిటి?



మనం యుక్తవయసుకు వచ్చాక (అంటే మగ పిల్లల్లో 16 - 18 ఏళ్లు, ఆడపిల్లల్లో 14- 16 ఏళ్లు) సాధారణంగా మన ఎముకల పెరుగుదల ఆగిపోతోంది. అప్పటివరకూ ఎముకలలోని చివరి భాగాలు పెరుగుతూ ఉంటాయి. యుక్తవయసుకు వచ్చాక ఎముకల చివరి భాగాల్లో ఉండే ‘గ్రోత్ ప్లేట్స్’ స్తంభించి పోతాయి. దాంతో వయసు పెరుగుతున్నప్పటికీ ఎముకలు పెరగడం ఆగిపోతుంది. అంటే మగపిల్లలు 18 ఏళ్లు దాటాక, ఆడపిల్లలైతే 16 ఏళ్లు నిండాక ఇక పొడవు పెరగడం దాదాపు అసాధ్యం.

 

మూడు ముఖ్యాంశాలు

ఎవరైనా ఎంత ఎత్తు పెరుగుతారనే నిర్ణయం జన్యుపరంగా జరుగుతుంది. ఎత్తును నిర్ణయించడంలో ఇది మొదటి అంశం. ఎత్తు పెరగకపోవడం జరిగే క్రమంలో పోషకాహారంలోపం అన్నది రెండో ప్రధాన అంశం. ఇక మూడో అంశం చిన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్. బాల్యంలో ఇచ్చే ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రభావంతోనూ ఎత్తు పెరగకపోవచ్చు.

 

మరి పొడవు పెంచేందుకు  వైద్యపరంగా అవకాశాలున్నాయా?
ఎముక పెరిగేలా చేసే శస్త్రచికిత్సలతో ఎముక పొడవు పెంచడానికి అవకాశాలున్నాయి.   ఈ ప్రక్రియలో మోకాళ్ల కింది భాగంలో ఎముకను కట్ చేస్తారు. ఇలా కట్ చేయడం ద్వారా ఎముకల మధ్య గ్యాప్ వచ్చేలా చేస్తారు. ఇక ‘లింబ్ రీకన్‌స్ట్రక్షన్ సిస్టమ్’ ద్వారా లేదా  ‘ఇలిజరోవ్ ఫిక్సేటర్స్’ అనే ప్రత్యేకమైన పరికరాలు అమర్చి గానీ హైట్ పెంచుతారు. కట్ చేసిన ఎముకల మధ్య ఉన్న గ్యాప్ భర్తీ అయ్యేలా ఎముకను పెంచుతుంటారు. ఇలా దాదాపు 3 అంగుళాలు (75 మిల్లీ మీటర్లు) వరకు ఎత్తు పెరిగేలా చేయవచ్చు. అయితే ఇలా ఎత్తు పెంచేందుకు చేసే శస్త్రచికిత్స కోసం రెండు రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత రోగికి అవసరమనుకుంటే హాస్పిటల్‌కు కూడా రావచ్చు. అయితే ఇలా ఎత్తు పెంచేందుకు కాలి చుట్టూ గుండ్రగా ఉండే చట్రం (ఫ్రేమ్)లా ఉండే ‘ఇలిజరోవ్ ఫిక్సేటర్స్’లోని స్క్రూలను రోజుకు ఒక మిల్లీ మీటర్ చొప్పున తిప్పాల్సి ఉంటుంది. ఇలా మూడు అంగుళాల పొడవు పెరిగే వరకు చేస్తుంటారు. ఎముక పెరుగుతున్న కొద్దీ దాని చుట్టూ అవసరమైన కండ, నరాలు, రక్తనాళాలు అన్నీ పెరుగుతూ పోతాయి.

 

ఇది చట్టబద్ధమేనా..!
ఈ శస్త్రచికిత్స చట్టబద్ధమైనదే. అయితే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది... తాను తగినంత ఎత్తు లేననే కారణం వల్ల ఒకవేళ రోగికి కొన్ని మానసిక సమస్యలూ, న్యూనతలు కలుగుతున్నప్పుడు అతడి సమస్య పరిష్కరించడానికి డాక్టర్లు ఈ శస్త్రచికిత్స చేయడం చట్టబద్ధమే. ఇక రెండోది కొన్ని పనులు, దైనందిన వ్యవహారాలు నిర్వహించడానికి అతడి ఎత్తు ఒక ప్రతిబంధకంగా మారుతున్నప్పుడు అతడి ఎత్తు పెంచడానికి ఈ ప్రక్రియను నిర్వహించవచ్చు. ఇక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎమ్‌సీఐ) నిబంధనల విషయానికి వస్తే, నిర్దిష్టంగా ఈ శస్త్రచికిత్సకు అంటూ ఎలాంటి నియమ నిబంధనలూ లేవు.

 

తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం ఉందా..!
సాధారణంగా ఇది ఎదుగుదల పూర్తి అయ్యాక, యుక్తవయసుకు చేరాక నిర్వహించే శస్త్రచికిత్స ప్రక్రియ. ఒకవేళ రోగికి పద్ధెనిమిదేళ్లు నిండి, మానసికంగా అన్నివిధాలా ఆరోగ్యవంతుడైతే (మెంటల్లీ సౌండ్) అయితే తల్లితండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదు. పైగా తన విషయాన్ని రోగి ఇతరులకు తెలపవద్దని కోరినప్పుడు వారు కుటుంబ సభ్యులైనా లేదా దగ్గరి మిత్రులైనా వారికి డాక్టర్ చెప్పడం సరికాదు. కాకపోతే పేషెంటే స్వయంగా చెప్పుకోవచ్చు. కానీ ‘బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ’ అనే అంశాన్ని పాటించాల్సిన డాక్టర్ చెప్పకూడదు.

 

ఎవరికి చేస్తారు ?
కొంతమందికి పుట్టుకతో కొన్ని లోపాలు వస్తాయి. ఉదాహరణకు అకాండ్రోప్లేసియా అనే కండిషన్‌లో కాళ్లు చేతులు తగినంత పొడవు పెరగవు. అలాగే కొన్ని సందర్భాల్లో కొందరు యాక్సిడెంట్‌కు గురైతే శస్త్రచికిత్స ప్రక్రియలో అతడు కొంత ఎముకను కోల్పోవచ్చు. అలాంటప్పుడు ఒక్కోసారి కాలు తొలగించాలని కూడా డాక్టర్లు చెప్పవచ్చు. అలాంటి సందర్భాల్లో కాలు తొలగించడానికి బదులు ఆ ఎముకను కట్ చేసి, తిరిగి పెరిగేలా చేయడం ద్వారా చేస్తారు.

 

ఎలా చేస్తుంటారు?
సాధారణంగా యాక్సిడెంట్ లేదా పుట్టుకతో వచ్చిన లోపాల వంటి  ఏదైనా కారణాల వల్ల ఒక కాలు పొడవు, మరో కాలు పొట్టి... ఇలా రెండు కాళ్ల నిడివిలో తేడాలు ఉన్నవారికి ‘స్టాండింగ్ లాంగ్ లెగ్’ అనే ప్రత్యేకమైన ‘ఎక్స్-రే’ తీస్తారు. పొట్టిగా ఉన్న కాలిని ఎలా సరిచేయాలి, ఇలా సరిచేసే ప్రక్రియలో దాన్ని ఎంతవరకు కట్ చేయాలి, మొత్తం సరికావడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలన్నింటినీ బేరీజు వేసి, పొట్టిగా మారిన కాలిని సరిచేయడానికి ఉన్న వివిధ రకాల ఆపరేషన్లను పేషెంట్‌కు వివరిస్తారు. ఈ ఎత్తును పెంచే ఆపరేషన్లలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి...

 

1. ఇలిజరోవ్ పద్ధతి : ఈ ప్రక్రియలో చిన్నగా ఉన్న ఎముకను  మొదటి స్థితికి (అంటే  పూర్వపు అలైన్‌మెంట్‌కు) తీసుకువచ్చాక, కాలిని మునుపటి పొడవునకు తీసుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.



2. లింబ్ రీకన్‌స్ట్రక్షన్ సిస్టమ్ :ఇందులో ఎముకకు ఒక వైపు మాత్రమే ఫ్రేమ్ పెడతారు. ఇందులో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉపకరణాన్ని తిప్పుకుంటూ వెళ్తారు. దాంతో క్రమంగా ఎముకను పెంచుతారు. కానీ ఒంపును సరిచేయలేరు.


3. టీఎస్‌ఎఫ్ : టేలర్ స్పేషియల్ ఫ్రేమ్ (టీఎస్‌ఎఫ్) అనే అత్యాధునికమైన పద్ధతి ద్వారా ఎముకను సరిచేయడంతో పాటు, తగ్గినంత మేరకు ఎముక పొడవు పెంచడం కూడా సాధ్యమవుతుంది.

 

ఒక డాక్టర్‌గా...
అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నవారు ఇలాంటి శస్త్రచికిత్స చేయించుకోవడం వల్ల కొన్నిసార్లు తీవ్రమైన కాంప్లికేషన్స్‌కు లోనై మరింత ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధారణం ఇలాంటి ఈ ప్రక్రియలను డాక్టర్లు సిఫార్సు చేయరు. ఒక డాక్టర్‌గా ప్రత్యేకంగా సలహా ఇవ్వాల్సి వస్తే ఎత్తు అన్నది జన్యుపరంగా ప్రకృతి నిర్దేశించే అంశం అని చెబుతారు. అంతగా ఎత్తు లేకపోయినా అనేక అంశాల్లో విజయం సాధించిన వారి స్ఫూర్తిమంతమైన కథలు, గాథలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తీవ్రమైన ప్రమాదాలకు లోనైన వారు, ఇతరత్రా మరీ అత్యవసరమైన వారు, కాలే తొలగించాల్సి రావాల్సిన సందర్భాల్లో దాని కంటే దానితో పోలిస్తే, కాలు కట్ చేసి పెంచడమే మేలు కాబట్టి, వారికి మినహాయించి మిగతావారికి డాక్టర్లు ఈ ప్రక్రియను సాధారణంగా సూచించరు.

 

ఎంత కాలం పడుతుంది?
రోగి రెండు రోజుల పాటు హాస్పిటల్‌లో ఉన్నా మొత్తం ప్రక్రియ పూర్తి కవడానికి కనీసం 90 రోజుల వ్యవధి అవసరం. ఇక నొప్పులన్నీ తగ్గిపోయి, పూర్తిగా కోలుకోవడానికి ఆర్నెల్లు కూడా పడుతుంది.

 

దుష్ర్పభావాలు
ఈ ఎత్తును పెంచే శస్త్రచికిత్సలలో భాగంగా చేసే రోజూ ఫిక్సేటర్‌ను తిప్పడం వంటి సమయాల్లో తీవ్రమైన నొప్పి వంటి దుష్ర్పభావాలు కనిపించవచ్చు. కొద్ది మందిలో ఒక్కోసారి కాంప్లికేషన్లు చాలా తీవ్రంగా కూడా ఉండవచ్చు.

 

డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,
హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement