మూడు రెట్ల వేగవంతమైన ట్యాబ్లెట్లు
గూగుల్, ఆపిల్‌లతో పోటీ పడే విధంగా సరికొత్త ట్యాబ్లెట్లతో దూసుకువచ్చింది అమెజాన్ సంస్థ. ప్రాసెసింగ్ స్పీడ్ విషయంలో మూడురెట్లు ఎక్కువ వేగవంతమైన కిండ్లేఫైర్ హెచ్‌డీఎక్స్ టాబ్లెట్‌ను అమెజాన్ ప్రవేశపెట్టింది. 7 ఇంచ్, 8.9 ఇంచ్‌ల వెర్షన్‌లో అందుబాటులో ఉంచింది. ప్రధానంగా లేటెస్ట్ ఐప్యాడ్‌తో పోటీ పడుతున్న ఈ ట్యాబ్లెట్లు షార్ప్‌నెస్ విషయంలో ఐప్యాడ్ కన్నా బెటర్. ఎక్కువ పిక్సల్స్ డిస్‌ప్లేతో ఉంటాయివి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయన్న పేరును తెచ్చుకున్నాయి. 7 ఇంచ్ మోడల్ 8జీబీ వెర్షన్‌లో ప్రారంభధర 229 డాలర్లు. 8.9 ఇంచెస్ టాబ్లెట్ ధర 379 డాలర్లు. ఇంకా భారత మార్కెట్‌లోకి రాలేదు. అమెరికాలో అందుబాటులో ఉన్నాయి.
41 మెగాపిక్సల్స్‌తో లూమియా
తాజాగా ఆవిష్కరించిన లూమియా 1020లో 41 మెగాపిక్సల్స్ కెమెరా ఉంటుందని ప్రకటించింది నోకియా. 8 ఎమ్‌పీ కెమెరాను చూస్తేనే ఆశ్చర్యపోతున్న దశలో ఏకంగా 41 ఎమ్‌పీ అంటే ఇంకెంత ఆశ్చర్యపోవాలో! స్మార్ట్‌ఫోన్‌లోనే ఉన్నత నాణ్యతతో ఉన్న కెమెరాలను కోరుకుంటున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని 41 మెగాపిక్సల్ కెమెరాను అందుబాటులోకి తీసుకొచ్చామని నోకియా పేర్కొంది. దీనిపై తమకు మంచి స్పందన వస్తోందని కూడా పేర్కొంది. అక్టోబర్ 11 నుంచి ఈ ఫోన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. ధర సుమారు రు. 48 వేలు ఉంటుందని అంచనా.
రేపటి తరం ట్యాబ్లెట్‌లు
మైక్రోసాఫ్ట్ సంస్థ సర్ఫేస్ 2, సర్ఫేస్ ప్రో 2 ట్యాబ్లెట్లను ఆవిష్కరించింది. నెక్ట్స్ జనరేషన్ ట్యాబ్లెట్లుగా పేరున్న ఇవి విండోస్ 8.1 ఓఎస్‌పై పనిచేస్తాయి. సర్ఫేస్ 2 ధర 359 డాలర్లు కాగా, ప్రో 2 ధర 719 డాలర్లు. ప్రీ ఆర్డర్స్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల 22 నుంచి ఇవి మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇదివరకూ వచ్చిన సర్ఫేస్ ట్యాబ్లెట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీని ఒకిత నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో చాలా మార్పులు తీసుకువచ్చి కొత్తసర్ఫేస్‌లను అందుబాటులోకి తీసుకవచ్చింది. పాత వాటితో పోలిస్తే బ్యాటరీ లైఫ్ విషయంలో 75 శాతం అభివృద్ధి పరిచామని, ప్రాసెసింగ్ స్పీడ్ విషయంలో 20 శాతం ఉన్నతిని సాధించామని మైక్రోసాఫ్ట్ ప్రకటించుకుంది.
4, 4ఎస్, 4జీ పోర్టబుల్ ఛార్జర్..
ఈ 1900 ఎమ్‌ఏహెచ్ ఛార్జింగ్ కేస్ కేవలం తెలుపు రంగులో మాత్రమే లభ్యమవుతుంది. లైట్ వెయిట్‌తో థిన్ డిజైన్‌తో ఉండే ఈ కేస్ కవర్ చేతికి మంచి గ్రిప్‌ను కూడా ఇస్తుంది. ఈ బాహ్యఛార్జర్‌లో బ్యాటరీ గురించి ముందస్తు అలర్ట్‌లుంటాయి. 25 శాతం బ్యాటరీ మిగిలి ఉందన్నప్పటి నుంచి అలర్ట్‌లుంటాయి. ధర ఆరు డాలర్లు అంటే సుమారు రు. 400
పోర్టబుల్ పవర్ ఛార్జింగ్ బ్యాకప్..
180 గంటల స్టాండ్ బై తో, ఏడు గంటల పాటు ఫోన్ మాట్లాడుకోవడానికి తగిన ఛార్జింగ్‌ను అందిస్తుంది ఈ కేస్‌కవర్. రెడ్, రోజ్ రెడ్, ఖాకీ, పింక్, లెమన్‌ఎల్లో, బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
1900 ఎమ్‌ఏహెచ్ ఐ-పవర్ బ్యాకప్ కేస్ కవర్ ధర ఏడు డాలర్లు.