అమెరికాలో మన ‘మెరికలు’ | America the 'grout' | Sakshi
Sakshi News home page

అమెరికాలో మన ‘మెరికలు’

Published Fri, Apr 18 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM

అమెరికాలో మన ‘మెరికలు’

అమెరికాలో మన ‘మెరికలు’

బేస్‌బాల్ పేరు కూడా వినిపించని దేశంలో.. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబంలో జన్మించిన యువకులు.. ప్రొఫెషనల్ బేస్‌బాల్ ఆటగాళ్లవుతారని, అమెరికాలో బేస్‌బాల్ లీగ్‌లో ఆడతారని ఊహించగలమా! కానీ.. ఊహకు కూడా అందని విషయాన్ని ఇద్దరు భారత యువకులు నిజం చేసి చూపించారు.
 
అమెరికాలో 2009లో జరిగిన గల్ఫ్ కోస్ట్ లీగ్ (జీసీఎల్)లో ఇద్దరు భారత ఆటగాళ్లు తొలిసారిగా బేస్‌బాల్ క్రీడలో పాల్గొన్నారు. అదీ.. పేరున్న పిట్స్‌బర్గ్ పైరేట్స్ వంటి క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. దీంతో వారి నేపథ్యమేంటని అంతా ఆరా తీస్తే అప్పుడు తెలిసింది.. వారు భారత్‌లో జావెలిన్ త్రో ఆటగాళ్లని, బేస్‌బాల్ గురించి కనీస అవగాహన కూడా లేని స్థాయి నుంచి వచ్చారని, అన్నింటికన్నా ముఖ్యంగా కడు బీద కుటుంబాలకు చెందినవారని. వారే.. రింకూ సింగ్, దినేశ్ పటేల్.

రియాలిటీ షో రూపంలో నిర్వహించిన టాలెంట్ హంట్ ద్వారా ఎంపికై, అమెరికాలో బేస్‌బాల్ శిక్షణ పొంది, అక్కడి లీగ్‌లో సత్తా చాటారు. వీరిలో రింకూ సింగ్ ఇప్పటికే పలు మేజర్ బేస్‌బాల్ లీగ్‌లలో రాణించి మున్ముందు మరిన్ని సంచలనాలు సృష్టించాలన్న పట్టుదలతో ఉండగా, దినేశ్ పటేల్ మాత్రం జావెలిన్ త్రోపై మక్కువను వదులుకోలేక తిరిగి స్వదేశానికి వచ్చాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడు.  
     
రియాలిటీ షో ద్వారా..
 
బేస్‌బాల్ క్రీడకు భారత్‌లోనూ ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఇక్కడి యువతలో ఆసక్తి గల వారిని వెతికి పట్టుకొని, వారికి శిక్షణనిచ్చేందుకు జె.బి.బెర్న్‌స్టీన్ అనే అమెరికా స్పోర్ట్స్ ఏజెంట్ 2008లో ‘ద మిలియన్ డాలర్స్ ఆర్మ్’ పేరిట ఓ టెలివిజన్ రియాలిటీ షో రూపంలో టాలెంట్ హంట్ నిర్వహించాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో 37 వేల మందికి పైగా యువకులు పాల్గొన్నారు. లక్ష డాలర్ల ప్రైజ్‌మనీ కలిగిన ఈ షోలో రింకూ సింగ్.. గంటకు 88 మైళ్ల వేగంతో బంతిని విసిరి విజేతగా నిలిచాడు. దినేశ్ పటేల్ రెండో స్థానం సాధించాడు. లక్నో సమీపంలోని హోలేపూర్ గ్రామానికి చెందిన రింకూ సింగ్.. బీద కుటుంబంలో పుట్టి పెరిగాడు.

సాధారణ ట్రక్కు డ్రైవర్ కుమారుడు రింకూ. వారణాసి సమీపంలోని ఖాన్‌పూర్ గ్రామానికి చెందిన దినేశ్‌ది కూడా పేదకుటుంబం.  వీరిద్దరికీ అంతకుముందెప్పుడూ బేస్‌బాల్‌ను కనీసం తాకిన అనుభవం కూడా లేకపోవడం విశేషం. వీరిద్దరిని లాస్ ఏంజెల్స్‌కు తీసుకెళ్లిన నిర్వాహకులు అక్కడే శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత పిట్స్‌బర్గ్ పైరేట్స్ క్లబ్ జట్టులో సభ్యులుగా మారిన రింకూ, దినేశ్... జూన్, 2009లో పైరేట్స్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకొని అమెరికా బేస్‌బాల్ క్లబ్‌కు సంతకం చేసిన తొలి భారతీయులుగా రికార్డు సృష్టించారు.

ఆ ఏడాది జరిగిన జీసీఎల్‌లో పైరేట్స్ క్లబ్ తరపున ఆడి రాణించారు. దీంతో రింకూకు ‘ఎ’ లెవల్ లీగ్‌కు ప్రమోషన్ రాగా, 2010, 2011లలో మేజర్ లీగ్‌లలో పాల్గొన్నాడు. ఇప్పటికి 84 గేమ్‌లు ఆడిన రింకూసింగ్.. గాయం కావడంతో ప్రస్తుతం స్వదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
     
సినిమాగా రింకూ, దినేశ్‌ల కెరీర్..
 
రింకూ సింగ్, దినేశ్ పటేల్‌ల జీవితం వెండితెరకెక్కనుంది. వారు వెలుగులోకి వచ్చిన రియాలిటీ షో ‘మిలియన్ డాలర్స్ ఆర్మ్’ పేరుతోనే ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ.. ఓ క్రీడా నేపథ్య చిత్రాన్ని రూపొందిస్తోంది. హాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్రశ్రేణి నటులు నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.                     
- కంచర్ల శ్యాంసుందర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement