
తల్లిదండ్రుల కళ్లకు పిల్లలు ఎప్పటికీ చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు. వారి వయసు ఐదు పదులు నిండినా, ఐదేళ్ల పసిపిల్లల్లాగే అనిపిస్తారు. అందుకే వాళ్ల చిన్నప్పటి ఫొటోలు చూసుకుని మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. బిగ్ బీ కూడా ఈ విషయంలో ఒక తండ్రిగానే కనిపిస్తారు. ఏడు పదులు దాటిన బిగ్ బి అమితాబ్ బచ్చన్... అభిషేక్ బచ్చన్, శ్వేత బచ్చన్ బాల్యస్మృతులను గుర్తుచేసుకుంటూ, వారి చిన్నప్పటి ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసి మురిసిపోతున్నారు. ‘‘బాల్యంలో ఉండే అమాయకత్వంలో దైవత్వం కనిపిస్తుంది. చిన్న నాటి ఫొటోలు చూసినప్పుడల్లా పిల్లలు ఎంత స్వచ్ఛమైనవారో గుర్తుకు వస్తుంది’’ అంటున్నారు అమితాబ్ బచ్చన్. తనకు అభిషేక్ బచ్చన్ రాసిన ఒక లేఖను కూడా ఇటీవలే ట్విటర్‌లో పోస్టు చేశారు అమితాబ్. ఎంత సెలబ్రిటీలయినా పిల్లలకు తల్లిదండ్రులే, పిల్లల ఆప్యాయతలకు బానిసలే. పిల్లల మురిపాలకు దాసులే.