ఆమలకం అత్యుత్తమం | Amla Is Rich In Vitamins | Sakshi
Sakshi News home page

ఆమలకం అత్యుత్తమం

Published Sat, Nov 9 2019 4:06 AM | Last Updated on Sat, Nov 9 2019 4:06 AM

Amla Is Rich In Vitamins - Sakshi

ప్రాణికోటి సమస్తం ఆరు ఋతువుల ధర్మాలకు అనుగుణంగా నడచుకోవటం ఆరోగ్యానికి అవసరం. శరదృతువులో వచ్చే కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసే ఉత్సవం వన భోజనం. ఈ కాలంలో లభించే ఉసిరికాయ క్రమంగా ఫలంగా మారి బలీయమైన గుణధర్మాలు కలిగి ఉంటుంది. సంస్కృతంలో ఆమలకీ, అమృతఫల, శ్రీఫల, శివ మొదలైన  పేర్లతో పిలుస్తారు.

గుణధర్మాలు: దీని రుచి షడ్రసాలలో ఉప్పు మినహా తక్కిన ఐదు (తీపి, పులుపు, కటు, తిక్త, కషాయ రసాలు) కలిగి ఉంటుంది. ప్రధానంగా నోటికి తగిలేది పులుపు, తీపి, వగరు, త్రిదోష (వాత, పిత్త, కఫ) శ్యామకం.

వివిధ ఔషధ రూపాలు: పచ్చిగా రసం తీసినా, ఎండబెట్టి వరుగులు చేసినా, గింజలు తీసేసి, ఎండిన వరుగులను చూర్ణం చేసినా, మురబ్బా చేసినా, రోటి పచ్చడి చేసినా నిల్వ ఉండే ఊరగాయగా మలచినా, కొంచెం వేడి చేసినా, దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయి.

విశిష్ట ఔషధ ప్రయోగాలు: వయస్థాపకం (ముసలితనాన్ని రానీయదు), వృష్యం (శుక్ర కరం), రసాయనం. (సప్త ధాతు పుష్టికరం): ప్రతిదినం రెండు చెంచాల ఉసిరిక రసం ఒక చెంచా తేనెతో సేవించాలి. ఇది మెదడుకి పదును పెట్టి తెలివితేటలు పెంచుతుంది.

జ్వరాలు: ఉసిరికాయల రసాన్ని నేతితో వేడి చేసి సేవించాలి. ఆకలి కలగడానికి: ఉసిరికాయలకు నెయ్యి, జీలకర్ర, ఇంగువ చేర్చి, నేతితో ఉడికించి తినాలి.

అర్శస్‌ (పైల్స్‌/మూల శంక): మజ్జిగలో తిప్ప తీగ, ఉసిరిక రసాలను కలిపి తాగాలి. ఉసిరిక చూర్ణానికి కరక్కాయ, తానికాయ చూర్ణాలను కూడా కలిపి సేవించాలి (త్రిఫల చూర్ణం)

కామెర్లు (జాండిస్‌): ఉసిరిక రసం + ద్రాక్ష రసం ముక్కులోంచి రక్తస్రావం (ఎపిన్‌టాక్సిన్‌): ఉసిరి కాయల ముద్దను నేతితో కలిపి వేడి చేసి తలపై పట్టించాలి.

బొంగురు గొంతు: ఉసిరిక రసం + పాలు ఎక్కిళ్లు (హిక్క): ఉసిరిక రసం + వెలగ కాయ, పిప్పళ్ల చూర్ణం + తేనె

దగ్గు: ఆమలకీ చూర్ణం + పాలు, నెయ్యి

మూర్ఛ: ఉసిరిక చూర్ణ కషాయం + తేనె

హృదయ రోగాలు: చ్యవనప్రాశ, అగస్త్య లేహ్యాలు (వీటిలో – ఆమలకీ ప్రధాన ద్రవ్యం)

వాంతులు: పెసరపప్పుతో జావ కాచి, చల్లార్చి, ఉసిరిక రసం కలిపి సేవించాలి.

ఉసిరి వలన తగ్గే ఇతర రోగాలు: దద్దుర్లు, దురదలు, మచ్చల వంటి అనేక చర్మరోగాలు; తెల్లబట్ట వంటి స్త్రీ రోగాలు, మూత్ర రోగాలు (ప్రమేహ): శృంగార సమస్యలను తొలగించే వాజీకరణం కూడా. శిరోజాలకు
మంచిది. కంటి చూపునకు చాలా మంచిది.

ఆధునిక శాస్త్రం రీత్యా పోషక విలువలు: పీచు అధికంగా ఉండి శక్తి వర్ధక పోషకాలు కలిగి ఉంటుంది. విటమిన్‌ సి ప్రధానంగా అన్ని విటమినులూ ఉంటాయి. క్యాల్షియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, మాంగనీసు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్‌ వంటి లవణాలన్నీ పుష్కలంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు అతి తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంటుగా పనిచేసి క్యాన్సరును దూరం చేస్తుంది.

అతి ముఖ్య సారాంశం... అధిక పుష్టినొసగు అన్ని యంగములకు సర్వరోగ హరము వయస్థాపకంబు అన్ని వయసుల వారికిన్‌ అమృత సమము ఉత్తమోత్తమ ద్రవ్యంబు ఉసిరి ఫలము.
డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి,
ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement