అయ్యో... పాపం!
కోపం
మనుషులకు కోపం సహజ గుణం. అయితే కోపం ఎంత మానవ సహజ గుణమైనా, దీనిని అవలక్షణంగానే పరిగణించారు పెద్దలు. ‘తన కోపమె తన శత్రువు... తన శాంతమె తనకు రక్ష...’ అన్నాడు శతకకారుడు. కోపాన్నే సంస్కృతంలో క్రోధం అంటారు. దీనిని అరిషడ్వర్గాలలో ఒకటిగా పరిగణించాయి పురాణాలు. ‘శతకాలు, పురాణాలు ఎన్ని చెబితేనేం..? మా స్వభావం ఇంతే... మేమింతే’ అంటూ నిరంతరం ధుమధుమలాడుతూ కనిపించే అపర దుర్వాసులు లోకంలో తక్కువేమీ కాదు. కోపం ఆరోగ్యానికి హానికరం అంటూ ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు. కోపం వల్ల రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే గుండెకు ముప్పు వాటిల్లుతుంది. గుండె గుటుక్కుమన్నాక ఇక సాధించేది ఏముంటుంది? అలాగే కోపంతో కూడా...
‘పాపము శమించు గాక...’ అని అంటారు గానీ, ‘కోపము శమించు గాక’ అనాలి. నిజానికి లోకంలో చాలా పాపాలు అదుపు తప్పిన కోపం వల్లనే అసంకల్పితంగా జరిగిపోతూ ఉంటాయి. అందువల్ల... కోపము శమించు గాక... కోపం గురించి చెప్పుకునేటప్పుడు కొన్ని వాస్తవాలు కూడా తెలుసుకోవాలి. లోకంలోని కోపిష్టులందరూ పాపిష్టులు కాదు. చాలామందికి కోపం ఒక బలహీనత. కొందరిలో అది ఏదైనా ఒక వ్యాధి లక్షణం కూడా కావచ్చు. కొందరి కోపం తాటాకు మంటలాంటిది. ఎగసిపడినంత వేగంగానే చప్పున చల్లారిపోతుంది. ఇలాంటి కోపంతో ఎలాంటి డేంజర్ ఉండదు. ఇంకొందరి కోపం నిద్రాణమైన అగ్నిపర్వతంలాంటిది. లోలోపల సలసల కాగుతూ ఉంటుంది. ఒత్తిడి తారస్థాయికి చేరుకున్న స్థితిలో అది ఒక్కసారిగా పేలుతుంది. ఇలాంటిది కొంచెం డేంజరస్ కోపం. చాలాసార్లు ఎదుటి వారికి ప్రమాదకరం కూడా. ఇలాంటి కోపం వల్లే ఒక్కోసారి హత్యలు, హత్యాయత్నాల వంటి ఘోరనేరాలు జరిగిపోతూ ఉంటాయి. ఇంతటి పెనుకోపం అనర్థదాయకం. దాని నియంత్రణకు సత్వర చర్యలు ఎంతైనా అవసరం. స్వీయ ప్రయత్నంతో కోపాన్ని అదుపు చేసుకోవడం సాధ్యం కాకుంటే మానసిక వైద్యాన్ని ఆశ్రయించక తప్పదు.
క్రోధపురాణం...
కోపానికి ఎవరూ అతీతులు కాదు. చివరకు మన దేవుళ్లు, పురాణపాత్రలు కూడా. కోపమే విశేషణంగా పేరుపొందిన దేవతలు, దేవుళ్లు మనకు లేకపోలేదు. హిరణ్యకశిపుడిని సంహరించిన ఉగ్రనరసింహుడు, దక్షయజ్ఞాన్ని ధ్వంసంచేసి రుద్రతాండవమాడిన శివుడు, మహిషాసురుడిని సంహరించిన దుర్గమ్మ... ఇందుకు కొన్ని ఉదాహరణలు. ముముక్షువులుగా పేరుపొందిన మహర్షులలోనూ కోపిష్టులు లేకపోలేదు. మహర్షులలో పరమకోపిష్టిగా దుర్వాసుడి పేరు జగద్విదితం. ఆయనకు ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే, ఆయన రాక గురించిన సమాచారం అందితేనే చాలు... దేవతలు, దేవుళ్లు కూడా భయంతో వణికిపోయేవారు. కోపం వస్తే మానవమాత్రులెవరైనా ఎదుటి వారిని చడామడా తిట్టడమో, కాస్త చేయిజోరు ఉంటే కొట్టడమో చేస్తారు. దుర్వాసుడు మహర్షి కదా! కోపం వస్తే తిట్టడమో కొట్టడమో గాక, శపించే వాడు. కోపానికి గురైన వారు తప్పు తెలుసుకుని లెంపలేసుకుని వేడుకుంటే, శాపానికి విరుగుడు కూడా చెప్పేవాడనుకోండి. అయితే, దుర్వాసుడి కోపజనిత శాపాల పర్యవసానంగా లోకకల్యాణమే జరిగేది. అది వేరే విషయం. ఇక శ్రీకృష్ణ పరమాత్ముల వారి అన్నయ్య బలరాముడు కూడా ముక్కోపిగా ప్రసిద్ధుడు. ఆయనగారు ముక్కోపి మాత్రమే కాదు, మదిరోన్మత్తుడు కూడా. తప్పతాగిన బలరాముడికి తనకు దారి ఇవ్వని యమునా నదిపై ఒకసారి కోపం వచ్చింది. అసలే హలాయుధుడు. కోపం ఆపుకోలేక, చేతిలోని హలాయుధానికి పని చెప్పాడు. యమునా నది ప్రవాహ గతినే మార్చి పారేశాడు. లోకంలోని క్షత్రియులను పలుమార్లు తెగటార్చిన పరశురాముడు, ఆదమరచి నిద్రిస్తున్న ఉపపాండవులను, ధృష్టద్యుమ్నుడిని తెగటార్చిన అశ్వత్థామ కూడా పురాణ పురుషుల్లో పరమ కోపిష్టులుగా పేరుమోసిన వారే.
కారణాలు కోటాను కోట్లు
కోపానికి కారణాలేంటని అడిగితే ఎన్నని చెప్పగలం? కోటాను కోట్ల కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు చిన్న చిన్నవిగానే కనిపిస్తాయి. అలాంటి చిన్నా చితకా చిల్లర కారణాలు కూడా కొందరికి పెనుకోపం తెప్పిస్తాయి. నానా అనర్థాలకు దారితీస్తాయి. కోపం వల్ల వాటిల్లే అతిపెద్ద అనర్థం మనశ్శాంతి లోపించడం. కోప్పడిన వారే కాదు, కోపానికి గురైన వారు కూడా మనశ్శాంతిని కోల్పోతారు. కోపాన్ని అమితంగా ఇష్టపడే కోపిష్టులను ఎవరూ ఇష్టపడరు. కోపంతో అందరినీ భయాందోళనలకు గురిచేయడం ద్వారా క్రమశిక్షణను చెక్కుచెదరకుండా కాపాడగలం అనుకుంటారు కొందరు. అది కేవలం భ్రమ మాత్రమే. క్రమశిక్షణ పేరుతో ఆఫీసుల్లో ధుమధుమలాడే బాస్‌లను చూసి ఉద్యోగులు భయపడితే భయపడవచ్చు గాక... వాళ్లను ఇష్టపడటం మాత్రం కల్ల. అలాంటి బాస్‌లను మనసులో ద్వేషిస్తూనే ఉంటారు. ఈ కోపం వర్సెస్ ద్వేషం ఈక్వేషన్ ఆఫీసులో మొత్తం పని వాతావరణాన్నే దెబ్బతీస్తుంది. ఇంట్లో కోపిష్టి యజమాని ఉంటే, ఇంట్లో ఆయన ఉన్నంతసేపు ఇల్లాలు, పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటూనే ఉంటారు. ఎదుటి వాళ్లు తమను చూసి భయపడుతున్నంత సేపు వాళ్లు తమను గౌరవిస్తున్నారనే భ్రమలో ఉంటారు కొందరు. అలాంటి భ్రమలో ఉన్నవాళ్లే తరచు కోపతాపాలు ప్రదర్శిస్తూ, కోపిష్టులుగా ముద్రపడతారు. కోపిష్టులు మనశ్శాంతిని మాత్రమే కాదు, అయిన వారి ప్రేమాభిమానాలనూ కోల్పోతారు. ఇలాంటి వాళ్లు ‘తన కోపమె తన శత్రువు...’ అనే హితోక్తిని మననం చేసుకుంటూ, కోపాన్ని అదుపు చేసుకునేందుకు ప్రయత్నించాలి.
శాంతమే శరణ్యం
కోపానికి విరుగుడు శాంతి మాత్రమే. ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అన్నాడు త్యాగరాజు. అందువల్ల చిత్తశాంతి కోరుకునే వారు శాంతమే శరణ్యం అనక తప్పదు. కోపిష్టులు దేశ నాయకులైతే, ప్రపంచంలో యుద్ధాలకు కరువుండదు. అలాంటి కోపిష్టి నేతలను ద్వేషించే జనాభాకూ కరువుండదు. శాంతిదూతలుగా పేరుపొందిన వారి వెంట జనాలు స్వచ్ఛందంగా నడుస్తారు. కోపిష్టుల వెంట కొంతకాలం అనివార్యంగా నడిచినా, అదను దొరికితే వాళ్లను అంతం చేయడానికైనా వెనుకాడరు. అలవిమాలిన కోపం కూడా ఆత్మవిధ్వంసక హేతువు కాగలదు. అందువల్ల ఎంతటి వారైనా కోపానికి శీఘ్రమే స్వస్తి పలకడం క్షేమం.
- పన్యాల జగన్నాథ దాసు