ప్రకృతి సేద్యంతో సరికొత్త జీవితం!
* సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి..
ప్రకృతి సేద్యం చేస్తున్న ఇద్దరు కేరళ యువకులు
* రైతులకు మార్గదర్శనం చేసే దశకు ఎదిగిన వైనం
ధనాశతో పరుగెత్తే మనిషి సహజ జీవితం సాగించలేడంటారు తాత్వికులు. ఢిల్లీ మహానగరపు కాంక్రీట్ కీకారణ్యంలో డబ్బు యావతో పరుగులు పెట్టే యాంత్రిక మనుషులను చూసి ఆరు పదులు సాగే జీవితం మూడు పదులతో ముగుస్తుందని నిశ్చయానికొచ్చాడో యువ ఇంజనీరు. తన మిత్రులతో కలిసి తొలుత కొంత కాలం సేంద్రియ భోజనశాల నడిపి.. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంలో స్థిరపడ్డాడు. మూడేళ్లలోనే వందలాది మంది రైతులకు మార్గదర్శకుడిగా నిలిచాడు.
త్రిసూర్(కేరళ)కు చెందిన తిబిన్ పరక్కల్ గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిపెరిగాడు. వసంతం నుంచి గ్రీష్మం వరకు ప్రతి సంధ్యలో కొత్తరూపు సంతరించుకుంటూ మారాకు వేసే కాలంతో పాటు లేగదూడలా గంతులేస్తూ గడిపాడు. దేవుడి నెలవని పిలిచే కేరళ రాష్ట్రంలో పైరు పచ్చని కలల మధ్య పెరిగి కళాశాల విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కంప్యూటర్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యాడు. కోరి ఎంపిక చేసుకొని భారీ వేతనంతో ఓ బహుళజాతి సంస్థ ఢిల్లీ మహానగరంలో ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచే ఉరుకులు పరుగులు పెట్టే మర యంత్రాల్లా పరుగులు పెట్టే జీవితం అతన్ని కలవరపెట్టింది. ‘ప్రకృతి ఒడిలో ఓలలాడిన నాకు ఈ కాంక్రీట్ మహారణ్యంలో ఊపిరి ఆగిపోతున్నట్లనిపించింది. నా చుట్టూ నాకు మనుషులెవ్వరూ కనిపించలేదు.
డబ్బు కట్టల కోసం పరుగులు తీస్తున్న జీవమున్న యంత్రాలనిపించారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న నన్ను తిరిగి ప్రకృతి చేరబిలిచినట్లనిపించింది. అందుకే మళ్లీ పల్లెకు చేరుకున్నాను’ అంటాడు తిబిన్. అష్టకష్టాలు పడి తల్లిదండ్రులను ఒప్పించి.. ఇద్దరు మిత్రులతో కలిసి రూ. లక్ష పెట్టుబడితో త్రిసూర్‌లో సేంద్రియ భోజనశాలను ప్రారంభించాడు. మీడియాలో మంచి ప్రచారం రావడంతో ఆరంభమే అదిరింది. వందలాది మంది బారులు తీరారు. దాని పక్కనే ఓ నిర్మాణ సంస్థ భారీ కట్టడం పనులు ప్రారంభించడంతో వీరి హోటల్‌ను తరలించాల్సివచ్చింది. అందుబాటు ధరలో మరోచోట స్థలం దొరక్కపోవడంతో హోటల్ కొద్ది నెలలకే మూతపడింది. అటువంటి గడ్డు పరిస్థితుల్లోనూ తిబిన్ కుంగిపోలేదు. ‘రైతుగా బతకాలన్నది నా చిరకాల కోరిక.
అందుకే ప్రకృతి సేద్యం చేపట్టాలని నిర్ణయించుకున్నా’ అని తిబిన్ తల్లిదండ్రులతో చెప్పాడు. అదే సమయంలో మిత్రుడు జార్జ్ కె జోస్ బెంగళూరు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వదిలి వచ్చి తిబిన్‌తో జత కలిశాడు. వీరిద్దరూ మహారాష్ట్ర వెళ్లి సుభాష్ పాలేకర్ వద్ద ప్రకృతి వ్యవసాయంలో 5 రోజుల శిక్షణ పొందారు. ‘పాలేకర్ వ్యవసాయ విధానం మాకు బాగా నచ్చింది. పులకరించిన ప్రకృతి పలకరించినట్లు అనిపించింది. ఈ శిక్షణా శిబిరం కొత్త జీవిత నిర్వచనాన్ని కండ్లకు కట్టి చూపింది’ అన్నాడు తిబిన్. ఎకరా భూమి ఇస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తానని తండ్రిని అడిగాడు.
అందుకు ససేమిరా అన్నాడాయన. ‘మేం మూర్ఖులమనుకుంటున్నావా? వేలకు వేలు పెట్టుబడి పెట్టి అందీపొందని ఆదాయంతో తిప్పలు పడుతున్నాం. ఎరువులు, పురుగు మందుల్లేకుండా వ్యవసాయమా?’ అని ఎద్దేవా చేశాడు. కాళ్లా వేళ్లా పడిన తర్వాత తన కంటే ఎక్కువ దిగుబడి తీయాలన్న షరతుతో ఎట్టకేలకు 10 సెంట్ల స్థలం ఇచ్చాడు.
‘మా వద్ద ఆవు లేదు. పొరుగు రైతు వద్ద నుంచి పేడ, మూత్రం తెచ్చి జీవామృతం తయారు చేసి వాడాం. కురువై అనే దేశవాళీ వరి వంగడాన్ని పండించాం. మా నాన్న చేనులో కంటే మా పొలంలోనే దిగుబడి ఎక్కువొచ్చింది.
చుట్టుపక్కల పొలాలు చీడపీడలతో దెబ్బతిన్నా మా చేను చెక్కుచెదరలేదు. మా నాన్న ఆశ్చర్యానికి అంతులేదు. అంత దిగుబడి ఎప్పుడు చూడలేదని ఒప్పుకున్నారు. ఆయన కూడా ఇప్పుడు కురువై వరినే పండిస్తున్నారు. రెండో ఏడాది రెండెకరాలు సాగుచేసి రూ. 50 వేల లాభం సాధించాం..’ అని తిబిన్ వివరించాడు. మూడేళ్లలో తిబిన్, జార్జ్ ప్రకృతి వ్యవసాయం 25 ఎకరాలకు విస్తరించింది.
ఇప్పటికే వందలాది మంది రైతులకు ఆప్తులుగా నిలిచిన తిబిన్, జార్జ్.. కేరళ వ్యవసాయ శాఖకూ తమ సేవలందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పాఠశాల ప్రారం భించబోతున్నారు. ‘జీవించడమంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాద’ని వీరు చాటారు. యువతరం చేపట్టదగిన వృత్తుల్లో ప్రకృతి వ్యవసాయం ఉత్తమమైనదంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. వివరాలకు.. జార్జ్(09020590555, 09496119055)తో ఇంగ్లిష్/మలయాళంలో మాట్లాడవచ్చు.
- జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్