
మనం వంటకాల్లో మిరపకాయను కారం కోసం వాడతాం. అయితే దాని కారం చాలా రకాల క్యాన్సర్లకు కూడా ఘాటుగానే పరిణమిస్తుందని అధ్యయనాల్లో తేలింది. అందుకే క్యాన్సర్ రోగులకు మిరప ఒక వరప్రదాయని. మిరపలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్లతో పోరాడతాయి. దాంతో పాటు మిరప వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి...
♦ మిరపకాయలలోని క్యాప్ససిన్ అనే పదార్థం వల్లనే దానికి ఆ కారపు రుచి వస్తుంది. ఈ కారపు ఘాటు తాకగానే ముక్కు, సైనస్‌లలోని మ్యూకస్ పలచబారి బయటకు వచ్చేస్తుంది. ఇలా మిరపకాయ జలుబునూ, సైనస్ ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గిస్తుంది.
♦ మిరపకాయలో పొటాషియమ్, మ్యాంగనీస్, ఐరన్, మెగ్నీషియం వంటి చాలా రకాల ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియమ్ మన రక్తపోటును నియంత్రిస్తుంది. మ్యాంగనీస్‌ను అనేక దేహం అనేక యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ తయారీలో ఉపయోగించుకుంటుంది.
♦ మిరప కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది.
♦ మిరపకాయలో విటమిన్–సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. వాటి కారణంగానే మిరపకాయలు తినేవారిలో వారిలో మేని నిగారింపు ఎక్కువ. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
♦ మిరపలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. చర్మంపై ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మిరపకాయలు తింటే అవి వేగంగా తగ్గుతాయి.
♦ మిరపలో విటమిన్–కె కూడా ఎక్కువే. అది గాయాలైనప్పుడు రక్తస్రావం అయ్యే ప్రమాదాలను అరికట్టడమే కాకుండా ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది.
♦ మిరప రక్తంలోని చక్కెర పాళ్లను గణనీయంగా నియంత్రిస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. అందుకే డయాబెటిస్ ఉన్న వారికి (తగిన మోతాదులో తింటే) మిరప మేలు చేస్తుంది. మిరప వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ... దానిలోని కారం గుణం కారణంగా దాన్ని పరిమితమైన మోతాదులోనే తీసుకోవాలి. ఈ మోతాదు తమ వ్యక్తిగత అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment