ఆర్తులను చూస్తే ఆగిపోతాడు!
కష్టాల్లో ఉన్నవాళ్లను చూసి అయ్యోపాపం అనడం జాలి. ఏదైనా సాయం చేస్తే బాగుంటుందేమో అని ఆలోచించడం మంచితనం. తనంత తానుగా వెళ్లి సాయం చేయడం మానవత్వం. కానీ అన్నీ తానుగా మారి, ప్రతిక్షణం కళ్లల్లో పెట్టుకుని కాపాడి, సొంతవాళ్లు కూడా చూపించనంత ప్రేమను ఎల్లవేళలా చూపిండాన్ని ఏమనాలి?
రిచర్‌డ్సని ఈ ప్రశ్న అడిగితే నవ్వుతాడు. ఎందుకంటే అది తనని ఉద్దేశించే అడిగామని అతడికి అర్థమవుతుంది కనుక. వర్ణించడానికి కూడా మాటలు చాలని తన గొప్పదనాన్ని మనం గుర్తించాలని కోరుకోడు కనుక!
ముంబై ప్రధాన రహదారి మీద ఇరవయ్యేళ్ల రిచర్‌డ్స మెల్లగా నడచుకుంటూ పోతున్నాడు. ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. కానీ అంత ఆలోచనలోనూ తను దాటి వెళ్లిపోయిన ఓ దృశ్యం అతడి కాళ్లకు బంధనాలు వేసింది. ఒక్కసాగి ఆగి వెనక్కి చూశాడు. రోడ్డు పక్కన ఓ వ్యక్తి గోనెసంచీ మీద కూచుని ఉన్నాడు. చాలా జాలిగా ఉన్నాడు. అనుకోకుండా అతడి కాలివైపు చూశాడు రిచర్‌డ్స. ఆ వ్యక్తి కాలు సగానికే ఉంది. పైగా పుండు పడి వికృతంగా తయారైంది. రసి కారి ఈగలు ముసురుతున్నాయి. మనసంతా ఏదోలా అయిపోయింది రిచర్‌డ్సకి. అసహ్యంతో కాదు... దయతో, బాధతో.
మెల్లగా అతడి దగ్గరకు వెళ్లాడు. గాయం వల్ల అతడి దగ్గర వాసన వేస్తోంది. అయినా రిచర్‌డ్స పట్టించుకోలేదు. అతడి పేరు అజిత్ అని తెలుసుకున్నాడు. అతడి గాయాన్ని పరిశీలించాడు. ఇన్ఫెక్షన్ అజిత్ కాలిని తినేస్తోంది. అలాగే వదిలేస్తే కాలు పూర్తిగా పాడైపోతుంది. మిగతా భాగాలకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. కొద్ది క్షణాల్లోనే ఇవన్నీ అంచనా వేసుకున్న రిచర్‌డ్స వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. వికలాంగుల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థకి ఫోన్ చేశాడు. వాళ్లతో అతడిని పంపించాడు. అంతటితో వదిలేయలేదు.
తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. వాళ్లతో కలిసి కొన్ని విరాళాలు సేకరించాడు. ఆ డబ్బుతో అజిత్‌కి మంచి డాక్టర్ దగ్గర వైద్యం చేయించాడు. అతడి పుణ్యమా అని ఈ రోజు అజిత్ పెద్ద ప్రమాదం నుండి బయటపడి ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇప్పటికీ రిచర్‌డ్స అజిత్‌ని కలుస్తూనే ఉంటాడు. అతడి మంచి చెడ్డలు చూస్తూనే ఉంటాడు. అతడనే కాదు... రిచర్‌డ్స మంచితనానికి మచ్చుతునకలుగా చెప్పుకోదగ్గ జీవితాలు ముంబైలో చాలానే ఉన్నాయి!
అలా మొదలైంది...
ఇతరులను ప్రేమించమన్న మాటను చిన్ననాటి నుంచీ వింటూనే ఉన్నాడు రిచర్‌డ్స. ఆ వాక్యం అతడి మనసును పదే పదే తట్టి లేపేది. నీకొక ప్రత్యేక బాధ్యత ఉంది అని చెబుతున్నట్టుగా అనిపించేది. ఆ బాధ్యత తెలుసుకునే రోజు రానే వచ్చింది.2011లో థానే రోడ్డుమీద పోతున్నప్పుడు ఓ వృద్ధుడిని చూశాడు రిచర్‌డ్స. దిక్కులేని అతడికి సాయం చేసేందుకు పోలీసులను, ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసే తన స్నేహితుడిని ఆశ్రయించాడు. అందరూ కలిసి ఓ వృద్ధుడిని ఓ ఎన్జీవో చెంతకు చేర్చారు. నాటి నుంచీ సాయపడటంలోని తృప్తి కోసం రిచర్‌డ్స మనసు పరితపించసాగింది.
ఎక్కడ దిక్కులేని వాళ్లు కనిపించినా వెంటనే వాళ్లను ఒక సురక్షితమైన చోటికి చేర్చేవరకూ నిద్రపోయేవాడు. మత్తు మందులకు, మద్యానికి బానిసైన వాళ్లని రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి మామూలు మనుషుల్ని చేస్తాడు. వాళ్లు మారాం చేసినా, మీద పడి కొట్టినా కూడా ఓపిగ్గా తీసుకెళ్తాడు. కుష్ఠు రోగులు, అవ యవాలు లేని అజిత్ లాంటివాళ్లనయితే అస్సలు విడిచిపెట్టడు రిచర్‌డ్స. ఆస్పత్రుల్లో చేరుస్తాడు. విరాళాలు సేకరించి వైద్యం చేయిస్తాడు. వాళ్లకిక ఏ ప్రమాదమూ లేదు అనుకున్న తర్వాతే ఊపిరి పీల్చుకుంటాడు.
రిచర్‌డ్సలో ఉన్న మరో గొప్పదనం. ఏ ఒక్కరినీ మర్చిపోక పోవడం. తన పని అయిపోయిందని చేతులు దులిపేసు కోవడం అతనికి చేతగాదు. వాళ్లతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాడు. వాళ్ల అవసరాలు తీరుస్తూ ఉంటాడు. ఓ పక్క సివిల్ ఇంజినీరింగ్ చదువుతూనే, మరోపక్క అవసరంలో ఉన్నవాళ్ల కోసం ఆరాటపడుతుంటాడు. ఈ వయసులో ఇంత ఎలా చేయగలుగుతున్నావ్ అని ఎవరైనా అడిగితే... ‘‘సాయం చేయడానికి వయసు కాదు, మనసు ఉండాలి, ప్రతి ఒక్కరూ ఒక్కరికైనా సాయం చేస్తే, రోడ్డు పక్కన ఎవ్వరూ దీనంగా కనిపించరు, దిక్కులేనివాళ్లంటూ ఎవరూ ఉండరు’’ అంటాడు రిచర్‌డ్స. నిజమే. అందరూ రిచర్‌డ్సలా ఉంటే ఎంత బాగుంటుంది!