నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ –భవతి భిక్షామ్ దేహి – అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి – చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది. ఒకామె సగం పాడయిపోయిన అరటిపండు వేసింది. మరొకామె ‘‘చూడడానికి దుక్కల్లా ఉన్నారు. పని చేసుకుని బతకలేరా?’ అంటూ ఒంటికాలిమీద లేచి తిట్టింది. శాపనార్థాలు పెట్టింది. ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు. పాడయిపోయిన భాగాన్ని తొలిగించి – బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు అరటిపండును తినిపించారు. ఆవు వారి చేతిని ప్రేమగా నాకింది. సన్యాసులందరూ మఠం చేరుకుని, వారి వారి పనుల్లో మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు గుమ్మానికి ఆనుకుని కూర్చుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం ఏమిటని అడిగాడు. ‘‘పొద్దున భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ఇంటావిడ తిట్టిన తిట్లు, పెట్టిన శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం నాకు పదే పదే గుర్తుకొచ్చి ముల్లులా గుచ్చుకుంటోంది. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను స్వామీ’’ – అన్నాడు. అతని కళ్ల నిండా నీరు.
వివేకానందుడు అతన్ని ‘‘పొద్దున మనకు భిక్షలో ఏమేమి వచ్చాయి?’’ అనడిగాడు. ‘‘సగం పాడయిపోయిన అరటి పండు, కొద్దిగా బియ్యం వచ్చాయి’’ – చెప్పాడతను. ‘‘అవును కదూ, వాటిలో మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం?’’ అడిగాడు మళ్లీ. బాగున్న అరటిపండును అవుకు పెట్టేసి, బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం’’‘‘మనం తెచ్చుకున్నవాటిలో తిట్లే లేవు కాబట్టి అవి నీవి కావు. నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు, బియ్యమే కానీ, తిట్లను తీసుకోలేదు – వాటిని ఇక్కడికి మోసుకురాలేదు. రానిదానికి – లేనిదానికి ఎందుకని బాధపడుతున్నావు?’’ అనునయంగా అడిగాడతన్ని. అతనిలో ఆవరించిన దిగులు ఏదో తొలగిపోయినట్లయి, ‘‘నిజమే స్వామీ!’’ అంటూ తలపంకించాడు సంతోషంగా.
– డి.వి.ఆర్.
వదిలేస్తున్నారా? వెంట తెచ్చుకుంటున్నారా?
Published Sat, Jul 14 2018 12:47 AM | Last Updated on Sat, Jul 14 2018 12:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment