పుస్తకాలను వినేయండి!
పుస్తకం హస్త భూషణం అని నానుడి!
సినిమా, టెలివిజన్ల పుణ్యమా అని...
చేతిలో పుస్తకంతో కనిపించే వారు అరుదైపోయారు!
కానీ మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందా?
అయితే మీరు ఎంచక్కా పుస్తకాలను ఆస్వాదించవచ్చు!
ఈ బుక్‌ల రూపంలో మాత్రమే కాదు...
ఆడియోబుక్స్‌తో కూడా!
స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్లు చేతిలో ఉంటే ఈబుక్ రీడర్ల సాయంతో ఎంచక్కా పుస్తకాలు చదువుకోవచ్చునని చాలామందికి తెలుసు. కానీ చదివే ఓపిక లేనివారి కోసం ఆడియో రూపంలో పుస్తకాలున్నాయన్న విషయం తక్కువమందికి మాత్రమే తెలుసు. ఇటీవలి కాలంలో లెక్కకు మించిన ఆడియోబుక్ ప్లేయర్లు గూగుల్ ప్లేలో దర్శనమిస్తూండటాన్నిబట్టి చూస్తే పదాల్లో కాకుండా మాటల్లో ఉండే పుస్తకాలకూ ఆదరణ పెరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మీకు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఆడియోబుక్ ప్లేయర్లు ఎమిటి? వాటిలోని ఫీచర్లేమిటి అన్నది చూస్తే...
1. ఆడిబుల్
అమెజాన్ కంపెనీ అభివద్ధి చేసిన అప్లికేషన్ ఇది. నిన్నమొన్నటి వరకూ కేవలం విండోస్, ఆపిల్ ఐఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్‌లో అకౌంట్‌తోపాటు వచ్చే ఈ ఆడియోబుక్ స్టోర్‌లో దాదాపు లక్షా యాభై వేల పుస్తకాలున్నాయి. మీకు నచ్చిన వేగంతో పుస్తకాన్ని చదువుకునేందుకు, అవసరమైతే కొద్దికొద్దిగా ఫాస్ట్‌ఫార్వర్డ్ చేసుకునేందుకు కూడా దీంట్లో ఆప్షన్లున్నాయి.
2. లైబ్రివాక్స్
దాదాపు 15 వేల పుస్తకాలు ఉచితంగా లభించే ఆడియోబుక్ స్టోర్ ఇది. వందలాది మంది కార్యకర్తలు ఎప్పటికప్పుడు పుస్తకాల ఆడియోలను రికార్డ్, ఎడిట్ చేస్తూండటం వల్ల తాము ఉచిత సేవలు అందించగలుగుతున్నామని కంపెనీ చెబుతోంది. లైబ్రివాక్స్ ఆప్ ప్రత్యేకత దాని సెర్చ్ ఆప్షన్స్. రచయిత మొదలుకొని అనేక రకాల ఆప్షన్స్‌తో పుస్తకాలను వెతుక్కోవచ్చు. నవలలతోపాటు చారిత్రక పుస్తకాలు, ఆటోబయోగ్రఫీలు కూడా దీంట్లో ఉన్నాయి.
3. అకింబో
అందుబాటులో ఉన్న ఆడియోబుక్ అప్లికేషన్లలో అకింబో మెరుగైనదని నిపుణుల అంచనా. దాదాపు అన్ని రకాల ఆడియోబుక్ ఫార్మాట్స్ (ఎం4ఏ, ఎం4బీ, ఎంపీ3)తో పనిచేయగలదు. బుక్‌మార్కింగ్ స్లీప్ టైమర్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.