కరోనా భయం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఒక్క తుమ్ము వినిపిస్తే చాలు. ఆ తుమ్మును తుమ్మిన వాళ్లు భయం భయంగా చుట్టూ చూస్తున్నారు. ‘ఇది కరోనా తుమ్ము కాదు’ అని చెప్పాలని ఉన్నా ఆ మాట గొంతులోనే మింగేయాల్సి వస్తోంది. తమను నేరస్థులుగా చూస్తున్న పొరుగువారి చూపులు ఆ తుమ్ము తుమ్మిన వారిని రోజులపాటు వెంటాడుతూనే ఉంటున్నాయి. తుమ్మును విన్నవాళ్లు, పదడుగులు కాదు ఇరవై అడుగుల దూరాన ఉన్నా సరే... పక్కన అణుబాంబు పేలినట్లు భయకంపితులవుతున్నారు. ఆ క్షణంలోనే ఒక అదృశ్య శక్తి ఏదో వచ్చి, ఇతరులెవ్వవరికీ కనిపించని రక్షణ వలయాన్ని తమ చుట్టూ ఏర్పాటు చేస్తే బావుణ్నని దేవుళ్లకు దణ్నాలు పెట్టుకుంటున్నారు. భయం మనిషిని భయకంపితులను చేయడానికి కాదు, జాగ్రత్తలు పాటించడం కోసమే భయం ఉండాలి. దేహంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచుకోగలిగితే... అదే మనకు మనంగా ఏర్పరుచుకునే ఒక రక్షణ వలయం.
♦ గ్రీన్ టీ, బ్లాక్ టీలు దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. వీటిలో ఉండే పాలీఫెనోల్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్‌లు దేహంలోని ఫ్రీ రాడికల్స్(ఈ ఫ్రీరాడికల్స్ దేహంలోని ఆరోగ్యకరమైన కణాలను నశింపచేస్తుంటాయి)ను నియంత్రిస్తాయి.
♦ క్యాబేజ్, పాలకూర, ఇతర ఆకు కూరల్లో ‘ఏ.సి, ఈ’ విటమిన్‌లతోపాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్‌లు కూడా ఉంటాయి. ఇవన్నీ దేహంలో వ్యాధినిరోధక శక్తిని పెంచేవే. కాబట్టి వీటిని సమృద్ధిగా తీసుకోవాలి. వండే ముందు ఆకు కూరలను వేడినీటిలో ముంచి కడగడం మంచిది.
♦ డ్రై ఫ్రూట్స్, నట్స్‌లో విటమిన్‌లు, ఖనిజలవణాలుంటాయి. ఇవి దేహ నిర్మాణానికి దోహదం చేస్తాయి. సహజమైన చక్కెరలు, ప్రోటీన్‌లు దేహానికి శక్తినిస్తాయి. స్వచ్ఛమైన పుల్లటి పెరుగు కూడా దేహంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.
♦ మన ఆహారంలో ఉపయోగించే పసుపు, ఆవాలు, ఇంగువ, ధనియాలు, మెంతులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు మంచి ఔషధాలు. ఇవి దేహంలో నిల్వ చేరిన వ్యర్థాలను, విషాలను విసర్జింపచేస్తాయి. కాబట్టి దేహం ఎప్పటికప్పుడు పరిశుభ్రమవుతుంటుంది. దాంతో వ్యాధి నిరోధకత కూడా సమర్థంగా పని చేస్తుంది. కాబట్టి రోజూ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి.
♦ కరోనా భయంతో మాంసాహారం మీద భయం పట్టుకున్న మాట వాస్తవమే. కానీ ఆరోగ్యకరంగా వండిన మాంసాహారాన్ని తినవచ్చు. మాంసాహారంలో ఉండే ప్రోటీన్‌లు, జింక్, ఐరన్, ఒమేగా–3 తోపాటు ఇతర పోషకాలు దేహానికి అవసరం. మాంసాహారంలో ఔషధగుణాలున్న సుగంధద్రవ్యాలను వాడడం మంచిది.
♦ ఈ జాగ్రత్తలన్నీ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికే. దేహం ఆరోగ్యంగా ఉన్నంత కాలం బయటి నుంచి ఎదురయ్యే అనేక వైరస్‌లకు వ్యతిరేకంగా తనంతట తానే పోరాడేశక్తిని కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment