ధారవిలో సినిమా కలలు | Baburao Laad Saheb Acting School Famous In Dharavi | Sakshi
Sakshi News home page

ధారవిలో సినిమా కలలు

Published Wed, Sep 18 2019 1:07 AM | Last Updated on Wed, Sep 18 2019 1:07 AM

Baburao Laad Saheb Acting School Famous In Dharavi - Sakshi

ముంబైలో పెద్ద పెద్ద యాక్టింగ్‌ స్కూల్స్‌ ఉన్నాయి. చాలా మంది డబ్బున్న పిల్లలు అక్కడకు వెళ్లి యాక్టింగ్‌ నేర్చుకుంటారు. కాని ఆసియాలోనే అతి పెద్ద మురికివాడైన ధారవిలో కూడా ఒక యాక్టింగ్‌ స్కూల్‌ ఉంది. ముప్పై ఏళ్లుగా అక్కడ ఒక వ్యక్తి యాక్టింగ్‌ గురువుగా పరిశ్రమిస్తున్నాడు. విద్యార్థులను తయారు చేస్తున్నాడు. కలలు ఎవరైనా కనవచ్చు. దాని కోసం ప్రయత్నించనూ వచ్చు అనడానికి ఇదో గొప్ప ఉదాహరణ.

ధారవిలో బాగా లోపలిగా ఉండే శాస్త్రి నగర్‌లో బాబూరావు లాడ్‌సాహెబ్‌ అంటే తెలియని ఞవారు ఉండరు. అతని యాక్టింగ్‌ స్కూల్‌ ఇంటర్నెట్‌ పుణ్యమా అని దేశంలోనే చాలామందికి తెలుసు. 30 అడుగుల కిటికీ లేని గదిలో నడిచే ఆ యాక్టింగ్‌ స్కూల్‌ పేరు ‘ఫైవ్‌ స్టార్‌ యాక్టింగ్‌ డాన్సింగ్‌ స్కూల్‌’. దాని బయట ‘నటన, డాన్స్, గుర్రపుస్వారీ, కత్తి యుద్ధం, హైజంప్, షార్ట్‌ జంపింగ్, ఫైట్‌ చేస్తూ డైలాగ్‌ చెప్పడం ఎలా నేర్పబడును’ అని ఉంటుంది. లోపల ప్రవేశిస్తే చెమటలు కక్కుతూ యాభై ఏళ్ల లాడ్‌సాహెబ్‌ తన విద్యార్థులకు ఆడియో సెట్‌లో వినిపించే తాజా బాలీవుడ్‌ పాటకు డాన్స్‌ నేర్పుతూ కనపడతాడు. ‘ఊ.. ఎగరండి.. బాగా ఎగరండి’ అని అరుస్తూ ఉంటాడు.

‘నేను మరాఠి, భోజ్‌పురి సినిమాలలో గ్రూప్‌ డాన్సర్‌గా పని చేశాను. కాని నాకు బాలీవుడ్‌లోకి ఎలా ప్రవేశించాలో తెలియలేదు. నాకే కాదు నాలాంటి వాళ్లందరికీ ఒక గురువు కావాలి. అది నేనే అయ్యాను’ అంటాడతడు. ధారవిలో సినిమా కలలు కనే అమ్మాయిలు, అబ్బాయిలు చాలామందే ఉన్నారు. కాని వారంతా నిరుపేదల కిందే చెప్పాలి. అలాంటి వారి పాలిట లాడ్‌సాహెబ్‌ పెద్ద మార్గదర్శి కిందే లెక్క. ప్రతి ఆదివారం రెండు గంటల లెక్కన నాలుగు వారాలకు కలిపి అంటే నెలకు 500 రూపాయలు లాడ్‌సాహెబ్‌ తన ఫీజుగా తీసుకుంటాడు. ‘ఒక హీరో తయారు కావాలంటే కనీసం ఐదేళ్లు శిక్షణ తీసుకోవాలి. కాని ఇవాళ చాలామంది దగ్గర టైమ్‌ లేదు. అందుకే మూడు నెలలు, ఆరు నెలల కోర్సులు ఎక్కువగా ఇస్తుంటాను’ అంటాడు లాడ్‌సాహెబ్‌.

పెద్ద పెద్ద బాలీవుడ్‌ సినిమాల కాస్టింగ్‌ డైరెక్టర్లు జూనియర్స్‌ కోసం తరచూ లాడ్‌సాహెబ్‌ను కాంటాక్ట్‌ చేస్తూ ఉంటారు. ఆస్పత్రిలో రోగులు, రైలు ప్రమాదంలో క్షతగాత్రులు తదితర పాత్రలకు ఇక్కడి నుంచే మనుషులను సరఫరా చేస్తుంటాడు లాడ్‌సాహెబ్‌. అతని యాక్టింగ్‌ స్కూల్‌కు ఆ ప్రాంతంలో ఆదరణ ఉంది. సినిమా రంగంలో వెలగాలని వచ్చి కార్పెంటర్లుగా, కూలీలుగా పని చేస్తున్న ధారవి వాసులు కొందరు తమ పిల్లల ద్వారా అయినా తమ కలలు నెరవేర్చుకోవాలని వాళ్లను పట్టుకొచ్చి లాడ్‌సాహెబ్‌కు అప్పజెబుతుంటారు. ‘క్లాసికల్‌ డాన్సులు నేర్పించొద్దు. అంతా మాస్‌ మసాలా డాన్స్‌ నేర్పించండి’ అని ఒక తండ్రి తన కుమారుడి విషయంలో దగ్గరుండి మరీ తాకీదు ఇవ్వడం అక్కడ చూడొచ్చు.

దారుణమైన జీవన పరిస్థితుల్లో ఉండి కూడా, బతకడానికి ఎంతో శ్రమ చేయాల్సినా కూడా మనుషులు చిన్న చిన్న కలలు కనవచ్చని, పెద్ద పెద్ద లక్ష్యాలను చేరవచ్చని ఇలాంటి ప్రయత్నాలు చెబుతూ ఉంటాయి. వెతికితే ప్రతి శిష్యుడకీ ఒక గురువు దొరుకుతాడని లాడ్‌ సాహెబ్‌ లాంటి వాళ్లు తార్కాణంగా నిలుస్తూ ఉంటారు. ఇలాంటి పని ఎక్కడ జరుగుతున్నా మనం చెప్పట్లు కొట్టాల్సిందే. అన్నట్టు ప్రఖ్యాత కమెడియన్‌ జానీలివర్‌ ధారవిలోని కింగ్‌ సర్కిల్‌ నుంచే సినిమా స్టార్‌గా ఎదిగాడు. సూపర్‌స్టార్‌ కమెడియన్‌ అయ్యాడు. అలాంటి సక్సెస్‌ ప్రతిభ ఉన్న ప్రతి ధారవి స్టార్‌కూ దక్కాలని కోరుకుందాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement