మధ్యలో ఉన్నవే.. ఆదీ అంతం | bad thing to go for a life to go for life | Sakshi
Sakshi News home page

మధ్యలో ఉన్నవే.. ఆదీ అంతం

Published Wed, Feb 7 2018 12:13 AM | Last Updated on Wed, Feb 7 2018 12:13 AM

 bad thing to go for a life to go for life - Sakshi

జీవితాన్ని మధ్యలోనుంచైనా మొదలు పెట్టేందుకు సిద్ధమై ఉన్నప్పుడు  ఎలా ఆరంభించాలి? ఎలా ముగించాలి  అనే నిస్పృహే తలెత్తదు. 

‘‘నేనొక పుస్తకాన్ని రాయాలని సంకల్పించిన ప్రతిసారీ.. ప్రారంభంలో, ముగింపులో నిస్పృహకు లోనవుతున్నాను. ఎందుకిలా అవుతోంది?’’ అని ఒక రచయిత.. ఆచార్య రజనీశ్‌ని అడిగాడు.  ‘‘ప్రారంభం, ముగింపు.. ఈ రెండూ అతి కష్టమైన విషయాలు. మధ్యలోనిది ఒకటే తేలికైనది. అందులోంచే ఆ రెండిటినీ మనం స్వీకరించాలి’’ అన్నారు రజనీశ్‌.  జీవితంలో కూడా ప్రారంభం, ముగింపు రెండూ మనిషి చేతిలో లేనివే. అందుకే వాటి కోసం మనం అన్వేషించాలి. తిప్పలు పడాలి. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించే ముందు మనం పడే ఘర్షణ ఈ ప్రాథమిక సృష్టి తత్వం కారణంగా జరిగేదే. ముగింపు కూడా అంతే. దాని కోసం ముందుగా ప్రణాళిక వెయ్యలేం. ఈ సందిగ్ధతను తొలగించుకోవాలంటే..  మధ్యలో ఏదైతే ఉందో దాన్నుంచే ఒక ప్రారంభాన్ని, ఒక ముగింపును ఎంచుకోవాలి. అంటే ఎక్కడి నుంచైనా ప్రారంభించి, ఎక్కడైనా ముగించవచ్చు.

అప్పుడు ఎలా మొదలు పెడితే అదే ప్రారంభం, ఎక్కడ ఆగిపోతే అదే ముగింపు అవుతుంది. ఆద్యంతాల కోసం జీవితాన్ని తవ్వుకుంటూ వెళ్లే బాధ తప్పుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి. ముహూర్తాలతో అకస్మాత్తుగా కొత్త జీవితం మొదలు కాదు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచే, మనం ఎలా ఉన్నామో అలా, ఆ క్షణం నుంచే ఒక పనిని సంకల్పించినప్పుడు అదే ముహూర్తం అవుతుంది. సంకల్పసిద్ధి జరిగినప్పుడు ప్రారంభానికి కాక, ముగింపునకు ప్రాధాన్యం వస్తుంది. ప్రత్యేకంగా అంతిమత్వం కోసం శ్రమించనక్కర్లేదు. జీవితాన్ని ఏ విధంగానైనా మొదలు పెట్టేందుకు, ఏ విధమైన జీవితాన్నయినా దర్శించేందుకు సిద్ధమై ఉన్నప్పుడు ఎలా ఆరంభించాలి? ఎలా ముగించాలి అనే నిస్పృహే తలెత్తదు. మధ్యలో ఏదైతే ఉందో అదే మనం. మొదటిది చివరిది ఎప్పటికీ మనది కాదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement