నియోనేటాలజీ : కొత్త బంగారాలకు కొండంత అండ!
మీరు కొన్ని కార్ల వెనక రాసి ఉండే కామెంట్లు చదివే ఉంటారు. అప్పటివరకూ అది మామూలు కారు. కానీ పొత్తిళ్ల బిడ్డ ఎక్కగానే అది పూలతేరు. అలాగ మారిన ఆ తీరు చూసీ, వెనక ‘బి కేర్‌ఫుల్... బేబీ ఆన్ బోర్డ్’ లాంటి బోర్డులు చూసీ ఇక చేసేదేమీ లేక మురిపెంగా, ఆనందంగా విసుక్కుంటూ బుజ్జి వీఐపీగారికి దారినిస్తాం. అలాంటి చిన్నారులకూ వైద్యపరమైన అవసరాలు వస్తూ ఉంటాయి. ఇలా పుట్టీ పుట్టగానే కేర్‌కేర్‌మంటూ సదరు బుజ్జాయి చేసే మెడికల్ డిమాండ్లను తీర్చే వైద్యవిభాగమే నియోనేటల్ కేర్.
ఎందుకీ నియోనేటల్ కేర్...?
కొందరు బుజ్జాయిలు తల్లి కడుపులో ఉన్నప్పట్నుంచే... పుట్టీ పుట్టగానే తమకు అవసరమైన వైద్యసహాయాన్ని కోరతారు. ఉదాహరణకు... సాధారణంగా తల్లికి హైబీపీ ఉన్నప్పుడు బిడ్డ చాలా తక్కువ సైజుతో పుట్టవచ్చు. ఈ బిడ్డను ఐయూజీఆర్ బేబీ అంటారు. ఒకవేళ తల్లికి షుగర్ ఉంటే పుట్టబోయే బిడ్డ మరీ చిన్నగానైనా ఉండవచ్చు లేదా చాలా భారీగానైనా ఉండవచ్చు. ఇలాంటి భారీ పరిమాణంలో ఉండే బిడ్డను మ్యాక్రోజోమిక్ బేబీ అంటారు. అందరూ అనుకున్నదానికి భిన్నమైన పరిణామం ఏమిటంటే... షుగర్ ఉన్న తల్లికి పుట్టిన బిడ్డలో చక్కెరపాళ్లు చాలా తక్కువగా ఉండవచ్చు. ఇలాంటి పిల్లలకు పుట్టగానే వైద్యుల పర్యవేక్షణ, వైద్యం చేసేందుకు ప్రత్యేక ప్రదేశం కావాలి.
ఆ ప్రదేశమే లెవెల్-త్రీ నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇక్కడ అప్పుడే పుట్టిన పిల్లలు మొదలుకొని, వాళ్లకు 28 రోజుల వయసు వచ్చే వరకు వచ్చే వైద్య సమస్యలకు చికిత్స చేసే డాక్టర్లను నియోనేటాలజిస్టులు అంటారు. ఇందుకు అభివృద్ధి చెందిన వైద్యశాస్త్రమే నియోనేటాలజీ. దీని ప్రాధాన్యం ఏమిటంటే... సంభవించే శిశుమరణాలలో మూడోవంతు బిడ్డ పుట్టిన మొదటిరోజే జరుగుతుంటాయి. వాటిని నివారించడం చాలా అవసరం. ఇవి మన దేశంలో మరింత అవసరం. ఎందుకంటే... ప్రపంచవ్యాప్తంగా... పుట్టిన నాలుగు వారాల్లోపే చనిపోయే నలుగురు శిశువుల్లో ఒకరు మనదేశానికి చెందినవారే.
పుట్టగానే బిడ్డకు అవసరమైన చర్యలూ, సపర్యలూ...
పుట్టిన బిడ్డకు ఆహారం ఇవ్వడంలో భాగంగా రొమ్ముపాలు పట్టించడం అవసరం. సాధారణ ప్రసవం అయితే బిడ్డ పుట్టిన అరగంటకు రొమ్ముపాలు పట్టించాలి. శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీస్తే (సిజేరియన్ అయితే) గంట తర్వాత బిడ్డకు రొమ్ముపాలు ఇవ్వాలి. ఇలా రొమ్ము పాలు ఇవ్వడమే గొప్పచికిత్స. ఎందుకంటే ఈ పాలలో ఎన్నో రకాల అలర్జీలను, ఆస్తమాను, వైరస్‌లను, బ్యాక్టీరియాలను, ఎన్నెన్నో జబ్బులను, రుగ్మతలను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. కొందరు బిడ్డలు కారణం లేకుండానే మరణిస్తుంటారు. ఈ కండిషన్‌ను ‘సడన్ ఇన్‌ఫేంట్ డెత్ సిండ్రోమ్’ (ఎస్‌ఐడీఎస్-సిడ్స్) అంటారు. రొమ్ముపాలు పట్టించడం బిడ్డకు ఆహారం కోసం మాత్రమే కాదు... ఈ రుగ్మతను ఎదుర్కోడానికి కూడా! కాకపోతే పుట్టినబిడ్డకు తల్లి రొమ్ము పట్టించడంలో ఇటు తల్లికీ, అటు బిడ్డకూ కొంత శిక్షణ అవసరం. విచిత్రం ఏమిటంటే... తల్లికంటే బిడ్డ కాస్త త్వరగా నేర్చుకుంటుంది.
బిడ్డ ఎదుర్కొనే మొదటి వైద్య సమస్య... జాండీస్
అసలే బంగారుకొండ... దాన్ని మరింత స్వర్ణమయం చేయడానికి, మొదటి గండం పసుపు వర్ణంతో వచ్చి బిడ్డను అలదుకుంటుంది. దాన్నే మనం పుట్టుకామెర్లు అంటుంటాం. ఇంగ్లిష్‌లో జాండిస్ అని పిలిచే ఇవి... పుట్టిన ఒకటి రెండు రోజుల్లో దాదాపు 60 శాతం బిడ్డల్లో కనిపిస్తుంటాయి. బిడ్డ పుట్టగానే ఎదురయ్యే మొట్టమొదటి వైద్య సమస్య కావడంతో కొత్తగా తల్లులైన వారు బిడ్డకు వచ్చిన ఈ పరిస్థితితో బెంబేలెత్తుతారు. చిన్నారులందరికీ దాదాపుగా వచ్చే ఈ వ్యాధి పట్ల మనలో చాలామందికి అనేక అపోహలున్నాయి. వాటి కారణంగా మనం చేసే కొన్ని గృహవైద్యాలు, చిట్కావైద్యాలు ఒక్కోసారి వికటించి, చిన్నారులకు ప్రమాదంగా పరిణమించవచ్చు. అందుకే ఈ తొలివ్యాధి, దానికి సంబంధించిన అపోహలు, వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకీ పుట్టుకామెర్లు: ‘అసలు అప్పుడే పుట్టినబిడ్డకు ఎందుకిలాంటి సమస్య రావాలి?’ అన్నది చాలామందిలో మెదిలే సందేహం. బిడ్డ అప్పుడే పుట్టడం వల్ల ఆ చిన్నారి కాలేయానికి బిడ్డలో స్రవించే బిలురుబిన్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఇంకా అలవడదు. దాంతో అది చిన్నారుల రక్తంలో కలుస్తుంది. అందుకే ఇవి కనిపిస్తాయి. అయితే సమయం గడుస్తున్న కొద్దీ కాలేయం తన పనితీరును, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలా కనిపించిన కామెర్లు ఒకటి, రెండువారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. సాధారణంగా ఈ పుట్టుకామెర్లు బిడ్డ పుట్టిన మూడోరోజున కనిపించి, ఐదో రోజున ఉద్ధృతంగా ఉండి, ఏడోరోజు నుంచి క్రమంగా తగ్గడం మొదలవుతాయి.
పుట్టుకామెర్లకు చికిత్స : నిజానికి జీవకార్యకలాపాల్లో కొద్దిపాటి సామర్థ్యలోపం వల్ల వచ్చే ఈ కామెర్ల (ఫిజియలాజికల్ జాండీస్)కు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. అయితే కొద్ది మందిలో ఈ పరిస్థితి విషమించవచ్చు. ఇలాంటి కామెర్లను పాథలాజికల్ / ఎగ్జాగరేటెడ్ జాండీస్‌గా చెబుతారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి... పుట్టిన బిడ్డకు ఉన్న బ్లడ్‌గ్రూప్‌కీ, రక్తంలోకి స్రవించిన బిలురుబిన్‌కీ సయోధ్య కుదరకపోవడం (బ్లడ్ గ్రూప్ ఇన్‌కంపాటబిలిటీ), తల్లులు బిడ్డలకు సరైన రీతిలో పాలు పట్టకపోవడం కారణంగా బిడ్డల్లో ద్రవాల, ఖనిజ లవణాల లోపం రావడం (డీ-హైడ్రేషన్), బిడ్డలో స్రవించే జీ6పీడీ అనే ఎంజైమ్ లోపించడం కారణంగా కామెర్లు మరింత ముమ్మరం కావచ్చు.
పై పరిస్థితికి చికిత్స చాలా సులభం. బిడ్డలో స్రవించే అదనపు బిలురుబిన్‌ను తొలగిస్తే చాలు. దీనికి చేయాల్సింది కూడా చాలా సులువు. బిడ్డలో తగినంతగా ద్రవాలు నింపగలిగితే చాలు. అంటే బిడ్డకు కడుపునిండా పాలుపట్టడమే మంచి చికిత్స అవుతుందన్నమాట. ఇక దీనికితోడుగా బిడ్డను కొన్నిరకాల కాంతిపుంజాలకు ఎక్స్‌పోజ్ చేసే ఫోటోథెరపీతోనూ మంచి ప్రయోజనం ఉంటుంది. పరిస్థితి మరింత తీవ్రం అయినప్పుడు బిడ్డకు రక్తమార్పిడి (బ్లడ్ ఎక్స్ఛేంజ్ ట్రాన్స్‌ఫ్యూజన్) చికిత్స చేస్తారు. ఇంత సులభంగా పరిష్కరించగల ఈ సమస్యను కొందరు తమ అపోహలతో, మూఢనమ్మకాలతో జటిలం చేస్తుంటారు. ఆ అపోహలు, వాస్తవాలు ఈ పక్కనున్న పట్టికల్లో...
1. అపోహ: తల్లి పాలతో బిడ్డలో కామెర్లు మరింతగా పెరుగుతాయి.
వాస్తవం: నిజానికి తల్లిపాలతో ఎలాంటి హానీ ఉండదు. పైగా బిడ్డకు తగినన్ని ద్రవాలు సమకూరి, జాండీస్ తగ్గడానికి ఉపకరిస్తుంది. అందుకే తల్లి మరింతగా ద్రవాహారం తీసుకుంటూ, రొమ్ముపాల ద్వారా బిడ్డకు అవసరమైన ద్రవాలు అందేలా చూడాలి.
2. అపోహ: బిడ్డకు నీళ్లు / కొన్ని ద్రవాల మిశ్రమాన్ని పట్టించడం ద్వారా కామెర్లకు చికిత్స చేయవచ్చు.
వాస్తవం: నవజాత శిశువులకు తల్లిపాలకు మించిన ఆహారం లేదు. కృత్రిమ ఆహారాలు, ఫార్ములా మిల్క్‌లు తల్లిపాలకు సాటిరావు. కాబట్టి నీళ్లు పట్టించడం, ఏవైనా ద్రవాల మిశ్రమాలు నవజాత శిశువుకు ఇవ్వడం ఏవిధంగానూ మంచిది కాదు.
3. అపోహ: లేత ఎండ కాంతి పుట్టుకామెర్లకు మంచి చికిత్స.
వాస్తవం: ఇది కొద్ది మేరకే సత్యం. నిజానికి చికిత్స అవసరమైన తీవ్రతతో జాండీస్ ఉన్నప్పుడు ఇది ఉపకరించదు. స్వాభావికంగా లభ్యమయ్యే లేతఎండ ద్వారా చర్మం గ్రహించే కాంతితోనే పని జరగదు. అందుకే జాండీస్ తగ్గించేందుకు అవసరమైనంతగా ప్రభావితం చేయగల ఫొటో థెరపీని బిడ్డకు అందించాలి. దీనికి బదులు బిడ్డను ఎండకు చూపిస్తూ ఉండటం వల్ల ఒక్కోసారి బిడ్డకు ఎండవల్ల చర్మం కమిలిపోవడం (సన్‌బర్న్స్)తో పాటు డీ-హైడ్రేషన్ సంభవించవచ్చు.
4. అపోహ: కొందరు తల్లులు ఆసుపత్రిలో ఇచ్చే కాంతి పుంజాల వంటి చికిత్సను తమ ఇంటిలోని ట్యూబ్‌లైట్ కాంతితోనూ చేయవచ్చని అనుకుంటారు.
వాస్తవం : నిజానికి చూడటానికి ఆసుపత్రిలో చికిత్సకు ఉపయోగించే లైట్... మన ఇంట్లోని ట్యూబ్‌లైట్ ఒకేలా అనిపించినా, ఆ కాంతి తాలూకు తరంగాల దైర్ఘ్యం వేరుగా ఉంటుంది. అందుకే సరైన తరంగదైర్ఘ్యం (వేవ్‌లెంగ్త్) ఉన్న కాంతితో ఈ చికిత్స చేయడం వల్లనే అది బిడ్డపై మంచి ప్రభావం చూపుతుంది.
5. అపోహ: పుట్టుకామెర్ల వల్ల బిడ్డల మెదడు దెబ్బతింటుంది.
వాస్తవం: ఇది ఎంత మాత్రమూ నిజం కాదు. ఇది కేవలం జీవక్రియలకు సంబంధించిన చిన్న అంశం. పైగా పుట్టుకామెర్లు అన్న స్థితి చాలా తాత్కాలికం. కాబట్టి పిల్లల మెదడు దెబ్బతినడం అన్న ప్రసక్తి ఉండదు. కాకపోతే చాలా కొద్దిమంది పిల్లల్లో బిలురుబిన్ పాళ్లు చాలా ఎక్కువగా ఉండటం, ఆ సమస్యకు చికిత్స జరగకపోవడం వంటి అరుదైన సందర్భాల్లో ఈ పరిస్థితి కొందరిలోనే రావచ్చు.
మినహాయింపు ఆ ఒక్కసారే...
కొందరిలో చాలా చాలా అరుదుగా తల్లిపాల వల్లనే కామెర్లు ముమ్మరం అవుతాయి. తల్లిపాలలో ఉండే ఒక పోషకం బిలురుబిన్ చక్కగా ప్రాసెస్ అవడానికి అవరోధమవుతుంది. అలాంటి చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే బిడ్డకు పాలు పట్టించ వద్దంటూ డాక్టర్లు సలహా ఇస్తారు. అయితే ఇది ఇలా జరిగాక కూడా తల్లిపాల వల్ల జరిగే మిగతా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తల్లి పాలు పట్టడం తప్పక కొనసాగించాలని డాక్టర్లు చెబుతారు.
మన ప్రపంచంలోకి మరో ప్రాణి వచ్చీ రాగానే... ఆ చిన్నారి కాస్తా అందరికీ ప్రత్యేకం అయిపోతుంది. అప్పటివరకూ పెద్దాయన కేకేస్తేనే మనమంతా హడలిచచ్చేవాళ్లం...అంతటి ఆయనే ఇప్పుడు కొత్త బుజ్జాయికి కట్టుబానిసవుతాడు. అంతవరకూ నానమ్మ అడుగులకు మనం మడుగులొత్తుతామా... అలాంటిది ఆమే పూనుకుని బుడతడికి ఊడిగం చేస్తుంది. అంతటి బుడుగులు మనింటికి వేంచేసి, మురిపించబోతున్నప్పుడు వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన సపర్యలూ తెలిపే నియోనేటాలజీ గురించి తెలుసుకుందాం...
డాక్టర్ టి.పి. కార్తీక్
పీడియాట్రిషియన్ - నియోనేటాలజిస్ట్
యశోదా హాస్పిటల్స్, సికింద్రాబాద్.