కూల్ ప్యాక్
బ్యూటిప్స్
చలిపోయింది. ఎండలు పెరుగుతున్నాయి. ఈ సంధికాలంలో ఎదురయ్యే సమస్యల నుంచి చర్మాన్ని కాపాడేవే ఈ కూల్‌ప్యాక్‌లు. ఎండకు వాడిన చర్మానికి ఈ ప్యాక్‌లు వేస్తే తక్షణం సాంత్వన కలుగుతుంది. బంగాళాదుంపను తురిమి ముఖమంతా పరిచి అరగంట తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే సన్‌ట్యాన్‌ను అరికట్టవచ్చు. అలాగే ముఖం మీద మచ్చలు, గీతలు పోయి చర్మంకాంతులీనుతుంది. కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి పొడిచేసి ప్యాక్ తయారు చేసుకోవాలి. పొడి చర్మానికయితే ఒక టేబుల్‌స్పూన్ పౌడర్‌లో అంతే మోతాదులో పాలమీగడ లేదా తాజాపాలు లేదా పెరుగు కలిపి ప్యాక్ వేయాలి. జిడ్డు చర్మానికయితే తగినంత పన్నీరు కలిపి ప్యాక్ వేయాలి. ఈ ప్యాక్ వేసిన తర్వాత ఐదు నిమిషాల సేపు వలయాకారంగా మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది మేనిఛాయను మెరుగుపరుస్తుంది కూడ.
తాజా బత్తాయి రసాన్ని ముఖానికి రాసి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.రెండు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా పేస్టు చేయాలి. అందులో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే ముఖం మీద గుల్లలు, మచ్చలు, గీతలు కూడా పోతాయి. ఈ ప్యాక్ చర్మాన్ని తెల్లబరుస్తుంది కూడ.