నలుపు.. తెలుపు.. రంగులే.. కాని మనిషి పుట్టుకనే పరిహసిస్తూ సైన్స్‌నే సవాలు చేశాయి జీవితాలను తలకిందులు చేశాయి.. సమాజాలను శాసించాయి ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ అనే ఒక్క మాట చాలదా? పైనవన్నీ నిజం అని నమ్మడానికి!
తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు కాకుండా నలుపు,తెలుపులే మన సక్సెస్‌ను నిర్దేశిస్తాయి, నిర్ధారిస్తాయి అని చెబితే మెదడు వంచి ‘తెలుపు’ను ఒంటబట్టించుకునే ప్రయత్నం మొదలుపెట్టాం. ఈ క్రీమ్ మార్కెట్‌లో (కాస్మొటిక్స్‌కు సంబంధించి) 70 శాతం వాటాను కలిగి ఉందంటే నలుపును చీదరించుకునే ప్రక్రియ అమలవుతున్నట్టే కదా! వ్యాపారం క్రియేట్ చేసిన వివక్ష కాదిది. మన బలహీనత వ్యాపారంగా మారిన విజయం. చాలా యేళ్ల తర్వాత అమెరికాలో అడుగున ఉన్న బ్లాక్ డిస్‌క్రిమినేషన్ బయటకు కనపడింది జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో. ఉలిక్కిపడ్డ ఆ సమాజపు ఆవేశం ఉవ్వెత్తున లేచింది ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ కదలికగా. రంగుపేరు మీద జరిగే మానసిక హత్యలు మన దగ్గరా నిత్యకృత్యమే. సాహిత్యం, సినిమాలు, ప్రకటనలు తెలుపు మీద మోహాన్ని రగిలించాయి. ఆ రంగుకు డిమాండ్ సృష్టించాయి. మిల్కీ, వీటిష్, డస్కీ, బ్లాక్ బ్యూటీ అంటూ విశేషణాలు చేరుస్తూ కలర్‌ను ఒక అబ్సెషన్‌గా మార్చాయి. (ఇక నుంచి ‘గ్లో అండ్ లవ్లీ’)
అందుకే పురిట్లో పిల్ల ఒంటి రంగు ఇంట్లో చర్చనీయాంశమవుతుంది. కొత్త ప్రాణి వచ్చిందన్న ఆనందం కన్నా! ఆ క్షణం నుంచే ఆ వర్ణాన్ని తూచే కట్నం కాసులను జమ చేసేందుకు సిద్ధపడతారు తల్లిదండ్రులు. మ్యాట్రిమోనీలూ రిక్వైర్డ్ కాలమ్‌లో ‘కాంప్లెక్షన్’ను చేరుస్తాయి.ఫ్రెండ్‌షిప్ చేయడానికి, ఆటల్లో గెలుపుకి, కాంపిటీటివ్ స్పిరిట్‌కి, ఉద్యోగానికి, బస్సులో సీట్ ఆఫర్ చేయడానికి, ప్రేమ చిగురించడానికి.. అన్నిటికీ కలరే ఇంపార్టెంట్ అవుతుంది. కలర్ లేకపోవడం కాంప్లికేషన్‌గా కనపడుతుంది. (నల్లజాతి లేడీ జస్టిస్)
ఇవన్నీ మానసికంగా మనుషులను చంపేసేవే. అందం ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింప చేస్తుంది అన్నది ఎంత అబద్ధమో తెలుపే అందం అన్న అభిప్రాయమూ అంతే అసంబద్ధమైనది. కమర్షియల్ యాడ్స్‌లలో చూపించినట్టు తెల్లగా ఉన్న అమ్మాయి ప్రపంచాన్ని జయించదు. అంతెందుకు బ్యూటీనే క్వాలిటీ అయిన గ్లామర్ వరల్డ్‌లోనూ తెలుపు ప్రధాన అర్హత కాదు. ఇందుకు స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, నందితా దాస్, బిపాసా బసు వంటి ఉత్తరాది తారలతోపాటు దక్షిణాది తరాలు ఎంతో మంది ఉదాహరణలు. వీళ్లంతా నటనతోనే అభిమాన తారలయ్యారు. అలాగని వర్ణ వివక్షకు గురికాలేదని కాదు. కాని తెలుపును ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మలచుకోలేదు. ‘బీయింగ్ మై సెల్ఫ్’గానే నిలబడ్డారు. దాన్నే సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌గా డెవలప్ చేసుకున్నారు.
‘డస్కీ అనే మాట నాకు విశేషణంగా మారిపోయింది. డస్కీ చైల్డ్, డస్కీ మోడల్, డస్కీ హీరోయిన్ ఇలా. దాన్ని నేనెప్పుడూ పట్టించుకోలేదు’ అంటుంది బిపాసా. నందితా దాస్‌దీ ఇలాంటి అనుభవమే. ‘మీడియా డార్క్ అండ్ డస్కీగానే వర్ణిస్తుంది. ఆ వర్ణనలకు నేనంత విలువివ్వను. కాలేజ్‌గర్ల్స్ చాలామంది నన్ను అడిగారు.. నల్లగా ఉన్నా అంత కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండగలుగుతున్నారు అని. అంటే ఫెయిర్ కలర్ అనేది వాళ్లనెలా కుంగదీస్తుందో అర్థమవుతోంది కదా’ అని చెప్తుంది నందితా. ఈ వివక్ష మీద 2009లోనే ఒక క్యాంపెయిన్ మొదలైంది ‘బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్’ పేరుతో.దానికి నందితా దాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు 2013 నుంచి.
ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా ఎందుకు?
మన దగ్గరా బ్లాక్ లైవ్స్ మ్యాటరే. తెల్లరంగును ప్రమోట్ చేసుకుంటూ ఫెయిర్‌నెస్ క్రీములు అమ్ముకుంటున్న కంపెనీలకు ఆ సెగ తాకింది. ఆమెరికా బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌తో స్ఫూర్తి పొందిన 22 ఏళ్ల ముంబై యువతి చందనా హిరణ్ ‘చేంజ్ డాట్ ఓఆర్‌జీ’లో ఓ పిటిషన్ పెట్టింది. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ క్రీమ్ పేరు మార్చాలని. ఆ పిటిషన్‌ను సపోర్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా 15 వేలమంది సంతకాలు చేశారు. సోషల్‌మీడియాలోనూ నిరసన వెల్లువెత్తింది. దాంతో రెండువారాల్లోనే హిందుస్తాన్ యూనిలీవర్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. తన ప్రొడక్ట్‌లోని ‘ఫెయిర్’ను తొలగిస్తున్నట్టు. అంతకుముందే జాన్సన్ అండ్ జాన్సన్ తన ఫెయిర్ నెస్ క్రీములనే ఉపసంహరించేసుకుంది. రంగు అభిజాత్యం నాగరికత వెల్లివిరిసిన నాటి నుంచీ ఉంది. అది జెనెటికల్ డిఫెక్ట్‌గా మారింది. కాబట్టి ‘ఫెయిర్ అండ్ లవ్లీ’లోంచి ఫెయిర్‌ను తీసేసినంత మాత్రాన ఒరిగేదేముంది? ఫెయిర్‌నెస్ క్రీముల పుట్టుపూర్వపు సంగతి వదిలేసినా అవి పుట్టినప్పటి నుంచి వాటి వ్యాపార ప్రకటనలు నాటిన తెలుపు రంగు బీజాలైతే మహా వృక్షాలై నిలబడ్డాయి కదా మన మెదళ్లలో! గ్లో అనో, గ్లో అండ్ లవ్లీ అనో.. ఇంకోటో ఆ వృక్షాలను కూకటి వేళ్లతో పెకిలించగలదా? అందానికి రంగుకి, ఆత్మవిశ్వాసానికి అందానికి ఏమాత్రం సంబంధం లేదని తన వ్యాపార ప్రకటనలతో ప్రచారం చేయగలదా!!
ఇమామి మూల్యం చెల్లించింది
ఇది 2015 నాటి ముచ్చట. ‘ఇమామి’ వాళ్ల బ్యూటీ ప్రొడక్ట్ ‘ఫెయిర్ అండ్ హ్యాండ్‌సమ్’ క్రీమ్ వాడాలనే ఆశ పుట్టింది ఢిల్లీకి చెందిన నిఖిల్ జైన్ అనే యువకుడికి. ‘మా ఫెయిర్ అండ్ హ్యాండ్‌సమ్ క్రీమ్ వాడితే కేవలం నాలుగు వారాల్లో మీ మొహం రంగు తేలి.. కాంతులీనుతుంది’ అనే వ్యాపార ప్రకటనలు చూసి చూసి. క్రమం తప్పకుండా నాలుగు వారాలు మొహానికి అప్లయ్ చేసుకున్నాడు. అంతకు ముందు ఎలా ఉందో వాడిన తర్వాతా అలాగే ఉంది తన మొహం. పిసరంతైనా తెల్లబడలేదు. మెరుపూ లేదు. డీలా పడిపోయాడు గురుడు. ఆత్మన్యూనత పెరిగింది. తమ్ముడి పరిస్థితి చూసి చలించిపోయాడు లా స్టూడెంట్ అయిన అన్న పారస్ జైన్. ఢిల్లీ స్టేట్ కన్సూ్యమర్ కోర్టులో కేసు వేశాడు ఇమామీ పెద్ద అబద్ధాల కోరు అంటూ. ‘అబద్ధాల కోరును కాదు’ అని నిరూపించుకోలేకపోయింది ఇమామి. దాంతో ఆ కంపెనీ నిఖిల్ జైన్‌కు పదివేల రూపాయల పరిహారం చెల్లించాలని కన్సూ్యమర్ కోర్ట్ తీర్పునిచ్చింది. అబద్ధాలతో నిఖిల్ జైన్‌ను మభ్య పెట్టి, అతని మానసిక ఆందోళనకు ఆ కంపెనీ ప్రకటన కారణమైందున. పదిహేను లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అక్కడితో ఆగలేదు.. అలాంటి ఫెయిర్ అండ్ హ్యాండ్‌సమ్ ప్రకటన మీద నిషేధమూ పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment