చుట్టిన కొద్దీ అందం
కొన్ని వస్తువులు సాదా సీదాగా కనపడితే చూడ్డానికి అంత బాగుండవు. ఇక అవి గనుక గాజు సీసాలైతే పొరపాటున జారితే పగిలిపోతాయేమో అని భయం ఉంటుంది. అదే పురికొసతో, పల్చటి నారతోనూ, ఊలు దారాలతో ఇలా చుట్టేశారనుకోండి. పట్టుకుంటే బాటిళ్లు గ్రిప్ కోల్పోవు. జారి పడతాయేమో అనే భయం ఉండదు. పైగా సీసాలు ఇలా అందంగా కనువిందు చేస్తాయి. సింపుల్‌గా అనిపిస్తూ, సూపర్బ్ లుక్‌తో ఆకట్టుకునే ఈ ఐడియాను అమలులో పెట్టడానికి ఎందుకు ఆలస్యం. ‘చుట్టూ చుట్టూ.. చుట్టూ చుట్టూ చుట్టూ నన్నే చుట్టూ...’ అంటూ ఓ పాటందుకొని ఊలుదారంతో, లేదంటే పురికొసతోనూ సీసాలను, డబ్బాలను ఇలా చకాచకా చుట్టేయండి. చుట్టే ముందు కలర్ కాంబినేషన్స్ చూసుకోండి. అందమైన అలంకరణ వస్తువులుగా మార్చేయండి.
ఇందుకు కావలసినవి : ఊలు లేదా పురికొస; అతికించడానికి గమ్; కత్తెర; గ్లౌజ్ (చేతులకు వేసుకోవడానికి)
తయారీ: బాటిల్ అడుగున గమ్ రాసి, ఊలు దారం అతికించాలి. ఆ తర్వాత గమ్ పూస్తూ, ఒక్కో వరస దారం అతికిస్తూ బాటిల్ చుట్టూ చుట్టాలి. ఇలా చేస్తే దారం వదులుగా అవడం, బయటకు రావడం వంటివి లేకుండా నీట్‌గా కనిపిస్తుంది. ఇలా పూర్తిగా గమ్ పూస్తూ ఊలును, పురికొసను చుడుతూ అతికించిన తర్వాత, మిగిలిన దారాలను కత్తిరించి, ఒక రాత్రి మొత్తం అలాగే ఉంచాలి. గమ్ ఆరిన తర్వాత వాడుకోవడానికి వీలుగా ఉంటుంది.