టొమాటో + పాలు= క్లెన్సర్
బ్యూటిప్స్
ముఖం, మెడ చర్మం జిడ్డుగా, నల్లగా అనిపిస్తుంటే ఇంట్లోనే సులభంగా క్లెన్సర్‌ని తయారుచేసుకుని ఉపయోగించవచ్చు. టొమాటో, పాలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ అలర్జీల నుంచి కాపాడటమే కాకుండా, మృతకణాలను తొలగించడంలోనూ సహకరిస్తాయి. టొమాటో, పాలు కలిపి తయారు చేసిన మిశ్రమం సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేయడమే కాదు... చర్మాన్ని నునుపుగానూ చేస్తుంది.
కావల్సినవి: పండిన పెద్ద టొమాటో ఒకటి, పచ్చిపాలు అరగ్లాసు, శుభ్రమైన నీళ్లు లీటర్
తయారీ: టొమాటోను మెత్తగా గుజ్జు చేయాలి. గుజ్జును పలుచని వస్త్రంలో వేసి గిన్నెలోకి వత్తాలి. ఇలా వచ్చిన టొమాటో జ్యూస్‌కి సమపాళ్లలో పాలు కలపాలి. దీనిని బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
ఉపయోగించే విధానం: ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు రోజుకు రెండుసార్లు ఉపయోగించాలి. మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం తాజా మెరుపును సంతరించుకుంటుంది.
గమనిక: సున్నితమైన, పొడి చర్మం గలవారు దీన్ని ఉపయోగించకపోవడమే మంచిది. ఈ మిశ్రమాన్ని రెండు రోజుల కంటే ఎక్కువగా నిల్వ చేయకూడదు.