బ్లాక్‌హెడ్స్ వస్తున్నాయా!
బ్యూటిప్స్
కనీసం వారానికొకసారయినా ఏదో ఒక రకం ఫేస్‌ప్యాక్ వేస్తుంటే చర్మం మీద బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటివి రావు. ప్రతిరోజూ మైల్డ్ స్క్రబ్ వాడుతుంటే మృతకణాలతోపాటు బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ ఏర్పడవు. నాణ్యమైన ఆస్ట్రింజెంట్ అప్లయ్ చేసి తర్వాత పన్నీటిని అద్దాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు వదిలి శుభ్రపడుతుంది. పన్నీటితో చర్మం సాంత్వన పొందుతుంది. దీంతో బ్లాక్‌హెడ్స్ రావడానికి అవకాశం ఉండదు.ఫేషియల్ క్రీమ్‌ల వాడకం కూడా బ్లాక్‌హెడ్స్ రావడానికి కారణమవుతుంటుంది. ముఖ్యంగా ఎండకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువవుతుంది. కాబట్టి జిడ్డుచర్మం ఉన్న వాళ్లు క్రీమ్‌లను పూర్తిగా మినహాయించాలి.
బ్లాక్‌హెడ్స్‌ను గోళ్లతో గిల్లడం కాని, నొక్కడం కాని చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో చర్మకణాలు సున్నితత్త్వాన్ని కోల్పోతాయి. దీంతో నునుపుదనం పోయి చర్మం గరుకుగా మారుతుంది. మచ్చలు, గీతలు పడడానికి అవకాశం ఎక్కువ. ముఖానికి ఆవిరి పట్టిన తర్వాత మునివేళ్లతో ముఖమంతటినీ లేదా బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ ఉన్న ప్రదేశాన్ని మునివేళ్లతో మెల్లగా నొక్కడం ద్వారా సులువుగా తొలగించవచ్చు.మార్కెట్‌లో దొరికే బ్లాక్‌హెడ్స్ రిమూవర్ వాడడం కూడా సులువైన మార్గమే. కాని వాటిని వాడినప్పుడు చర్మం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.