డైవర్సీని పెళ్లాడే ముందు... | before the wedding divorce | Sakshi
Sakshi News home page

డైవర్సీని పెళ్లాడే ముందు...

Published Wed, Jul 2 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

డైవర్సీని పెళ్లాడే ముందు...

డైవర్సీని పెళ్లాడే ముందు...

విడాకులు ఈ దేశంలో ఒకప్పుడు నిషేధిత పదం. ఇపుడు మారుమూల పల్లెలకు కూడా పరిచయం.  సమంజసమైన కారణముంటే విడిపోవడం పాపం, నేరం కానేకాదు. అయితే, ప్రపంచీకరణ వల్ల కావచ్చు, మితిమీరిన ఆర్థిక స్వేచ్ఛ వల్ల కావచ్చు, లేదా మరేదైనా కారణం కావచ్చు కాని విడాకులు బాగా పెరిగిపోయాయి. విడాకుల అనంతరం జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడానికి దాదాపు ఎవరూ ఇష్టపడరు. మరి తప్పు పునరావృతం కాకూడదంటే ఏం చేయాలి? విడాకులు తీసుకున్న మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అసలు చేసుకోవచ్చా?
 
విడాకులు తీసుకోవడం అంటే మానసిక బంధాన్ని అధికారికంగా విడగొట్టడమే. కానీ, 498ఎ, గృహహింస చట్టాలు వచ్చాక వీటిని దుర్వినియోగం చేసే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో  విడాకులు తీసుకున్న వారికి మళ్లీ పెళ్లి అనేక ఆటంకాలతో కూడినది. ప్రతి అమ్మాయినీ అనుమానిస్తున్నారు. అయితే, తెలుసుకోకుండా నిందలేయొద్దు.  నిజానిజాలు తెలుసుకుంటే డైవర్సీని పెళ్లి చేసుకున్నా హాయిగా జీవితం గడపొచ్చు. విడాకులకు గొడవ కారణం కావచ్చు,  చెడు ప్రవర్తన, మర్యాద లేకపోవడం, దుబారా మనిషి కావడం, భాగస్వామిని సరిగా చూసుకోకపోవడం వంటి కారణాలెన్నో ఉంటాయి.

వీటిలో కొన్ని కారణాలతో విడిపోయిన వారిని మళ్లీ చేసుకుంటే ఆ కుటుంబంలో కూడా మళ్లీ కలతలు, విడాకులకే అవకాశం ఉంటుంది. మరలాంటపుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. విడిపోయిన జంటల్లో ఎక్కువగా ఒకరిమీద ఒకరు అబాంఢాలు వేస్తుంటారు. ఎవరిది నిజమనేది కొత్తవారికి తెలియదు కాబట్టి ఎవరికి అనుకూలంగా వారు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి డైవర్సీ మహిళ చెప్పే బాధాతప్త కథనానికి కరిగిపోయి పెళ్లికి ఓకే చెప్పకుండా... కాస్త ఆలోచించాలి. కోర్టు విడాకుల పత్రాలను పరిశీలించాలి. విడిపోవడానికి కారణాలు ఆ పత్రాల ద్వారానో, లాయర్ ద్వారానో ఏదో విధంగా తెలుసుకోవాలి.
 
కోర్టులో చెప్పిన కారణం నిర్ధారణ చేసుకున్న తర్వాత చేసుకోబోయే అమ్మాయిని రెండు మూడు సార్లు కలవాలి. ఆమెలో పాత జ్ఞాపకాలు ఎక్కువగా ఉంటే కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే అవి కొత్త సంసారాన్ని పాడు చేసే అవకాశం ఎక్కువ. అమ్మాయి కూడా ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాకుండా రెండో పెళ్లికి సిద్ధం కావడం మంచిది కాదు.మ్యూచువల్ డైవర్స్ అని చెబితే వెంటనే నమ్మాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకసారి విడాకుల కేసు ఫైలయ్యాక యువతి కుటుంబంపై అనేకమంది ప్రభావం ఉంటుంది. వారి మాట విని ఎక్కువ కాలం కేసును వాయిదా వేయించడం, లాగడం ద్వారా ‘ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్’ కోసం చూస్తారు. అంటే ప్రతి  మ్యూచువల్ డైవర్స్ ఇద్దరి పరస్పర సహకారం వల్లే అయిందని నమ్మకూడదు. కొన్ని పరస్పర ‘ఆర్థిక’ ఒప్పందాలతో రాజీ వల్ల జరిగినవి కూడా ఇక్కడ మ్యూచువల్ కిందే పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ అమ్మాయి గతంలో ఆర్థిక వేధింపులకు పాల్పడింటే అది తెలుసుకోవడం ముఖ్యం.
 
ఎంత టైంలో విడాకులు మంజూరయ్యాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఎలాంటి లిటిగేషన్లు లేని విడాకుల కేసు ఏడాదిలోపే సెటిలవుతుంది. అంతకంటే ఎక్కువ సమయం పడితే కాస్త అనుమానించాల్సిందే. అయితే, అది అబ్బాయి తప్పా-అమ్మాయి తప్పా తేల్చుకోవాలి. అమ్మాయి తప్పయితే ఆ సంబంధం జోలికి వెళ్లొద్దు. అదే పునరావృతం కాదని గ్యారంటీ ఏంటి?
 ఇండియాలో నమోదవుతున్న గృహహింస, వరకట్న కేసుల్లో అత్యధిక కేసులు తప్పుడు కేసులని అనేక ప్రభుత్వ రిపోర్టులు స్పష్టంచేశాయి. భార్య మీద కేసులు పెట్టేందుకు భర్తల కోసం ఇండియాలో ఏ ప్రత్యేక సెక్షను లేదు. కానీ భార్యలకు పదమూడు రకాల ఐపీసీ సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విడాకులు తీసుకున్న మహిళ తన పూర్వపు భాగస్వామిపై ఎన్ని కేసులు ఫైల్ చేసిందో తెలుసుకోవాలి. వీలైతే ఆ పోలీస్ స్టేషన్లో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ కేసుల్లో డబ్బులు లాగాలని చూసిన వారికి దూరంగా ఉండటం మంచిది.
 
 పెళ్లి చేసుకున్నాక....!
- పాత జ్ఞాపకాలు ప్రస్తుత భాగస్వామి వద్ద ప్రస్తావించడం సమంజసం కాదు.
- మునుపటి భాగస్వామితో పోలిక అతిపెద్ద ముప్పు.
- వ్యక్తులు వేర్వేరు అయినపుడు అలాంటి అవే లక్షణాలు, సహకారం కోరుకోవడం తప్పు.
- పాత అనుభవాలతో అయినా పరస్పర సహకారం, గౌరవం కలిగి ఉండాలి.
- పిల్లలకు తెలివొచ్చాక రెండో పెళ్లి చేసుకుంటే కొత్త వ్యక్తిని పిల్లలు పేరెంట్‌గా స్వీకరించడం దాదాపు కష్టం. కాబట్టి వారిని అర్థం చేసుకుని కొన్ని భరించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement