
అతడొక బిచ్చగాడు. మతిస్థిమితం కూడా లేకుండా తిరుగుతాడు. అతడి పేరు మాత్రం రాజు అని ఆ చుట్టుపక్కల వాళ్లు అనుకుంటున్నారు. పది రోజుల క్రితం అటుగా వెళ్తున్న కొందరు అక్కడ జరుగుతున్న ఓ సంఘటన చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయారు. జరుగుతున్నదంతా వారి వీడియోలలో బంధించారు. రాజుగా పిలవబడుతున్న ఆ బిచ్చగాడు ఎర్రమట్టి, బురద మట్టిని మట్టిగా కాకుండా, వాటర్ కలర్స్‌గా భావించాడు. గడ్డిని కుంచెగా మలిచాడు. గోడను క్యాన్‌వాస్‌గా భావించాడు.అంతే అంతటి మతి స్థిమితం లేని ఆ వ్యక్తి మెదడులో ఏం ఆలోచన బయలుదేరిందో ఏమో కానీ, అందమైన పెయింటింగ్ వేయడం ప్రారంభించాడు.
పది నిమిషాలలో అద్భుతమైన పెద్ద పెయింటింగ్ సిద్ధమైపోయింది. విచిత్రమేమిటంటే తనొక చిత్రకారుడినని తనకు తెలియదు. అదే తెలిసి ఉంటే ఎం. ఎఫ్. హుస్సేన్ అంతటి వాడు అయి ఉండేవాడేమోనని ఆయన చిత్రాలను చూస్తున్నవారు భావిస్తున్నారు. అతడు పేజ్ త్రీ వ్యక్తి కూడా కాదు. కేవలం మట్టిమనిషి మాత్రమే. మట్టిలో మాణిక్యం దొరుకుతుందో లేదో తెలియదు కానీ, మట్టితో మాణిక్యాలను తయారుచేస్తున్నాడు ఈ బిచ్చ చిత్రకారుడు.
– వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment