ఆండ్రాయిడ్ లాలీపాప్ ముచ్చట్లు! | Best And Worst Things About Android 5.0 Lollipop | Sakshi
Sakshi News home page

ఆండ్రాయిడ్ లాలీపాప్ ముచ్చట్లు!

Published Tue, Nov 11 2014 10:30 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

ఆండ్రాయిడ్ లాలీపాప్ ముచ్చట్లు! - Sakshi

ఆండ్రాయిడ్ లాలీపాప్ ముచ్చట్లు!

పొందికైన ఈ మెయిల్, మెరుగైన భద్రత, పొదుపైన బ్యాటరీ వాడకం..! ఇవీ ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ లాలీపాప్ విశేషాలు. ఇటీవలే నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్, నెక్సస్ 9 టాబ్లెట్లలోకి చేరి సందడి చేస్తున్న ఈ తాజా ఓఎస్ త్వరలోనే స్మార్ట్‌ఫోన్లన్నింటికీ విస్తరించనున్న నేపథ్యంలో ఇందులో ఉన్న కొత్త ఫీచర్లు ఏమిటో ఒకసారి చూసేద్దామా...?

జీమెయిల్ ఇన్‌బాక్స్ ఆప్
లాలీపాప్ ఓఎస్‌లో జీమెయిల్ అప్లికేషన్ సరికొత్త రూపు సంతరించుకుంది. డిజైన్‌తోపాటు కొన్ని అదనపు ఫీచర్లు కూడా వచ్చి చేరాయి. గతంలో మాదిరిగా కంపోజ్ ఆప్షన్ మెనూలో ఒకవైపున కాకుండా స్క్రీన్ అడుగున కుడివైపు ఫ్లోటింగ్ ఐకాన్‌లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జీమెయిల్, గూగుల్ క్యాలెండర్లను సింక్ చేసేందుకు ఇన్‌బాక్స్ పేరుతో మరో ఆప్‌ను విడుదల చేశారు. ఫలితంగా మెయిల్ సమాచారం ఆధారంగా మీకు రిమైండర్లు అందే వీలేర్పడింది. ఉదాహరణకు మీ ఫ్లైట్ టికెట్ మెయిల్ ఆధారంగా మీ ప్రయాణపు తేదీ ముందురోజు మీకు అలర్ట్ వస్తుందన్నమాట.

బ్యాటరీ వాడకం తక్కువే
ఎన్ని మంచి ఫీచర్లున్నా తగిన బ్యాటరీ బ్యాకప్ లేకపోతే అంతే సంగతులు. కానీ కిట్‌క్యాట్ ఓఎస్ ద్వారా బ్యాటరీ మేనేజ్‌మెంట్‌లో కొన్ని కొత్త మెలకువలు చేర్చిన ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోనూ ఆ పంథాను కొనసాగించింది. ఈ కొత్త ఓఎస్‌లోని బ్యాటరీ సేవర్ కనీసం 90 నిమిషాల బ్యాటరీ సమయాన్ని ఆదా చేస్తుందని అంచనా.

సెట్టింగ్స్ మార్పులూ సులువే!
మీరు తరచూ ఉపయోగించే సెట్టింగ్స్‌ను మార్చుకోవడం కూడా లాలీపాప్ ఓఎస్‌లో సులువు. కేవలం స్క్రీన్‌ను కిందివైపునకు స్వైప్ చేస్తే చాలు ఇవి ప్రత్యక్షమవుతాయి. వైఫై, బ్యాటరీ ఐకాన్, బ్లూటూత్, లొకేషన్ వంటివన్నీ దీంట్లో ఉంటాయి. పరిసరాలకు తగ్గట్టుగా స్క్రీన్ ప్రకాశాన్ని మాన్యువల్‌గా మార్చుకునే సౌలభ్యమూ ఉండటం మరో విశేషం.

మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లు
వైరస్‌లు, మాల్‌వేర్‌ల నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉంచేందుకు లాలీపాప్‌లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. సమాచారం మొత్తాన్ని ఎన్‌క్రిప్ట్ చేసే అవకాశముండటం వీటిల్లో ఒకటి.  ఫోన్ పోగొట్టుకుపోయినా లేదా ఎవరైనా దొంగిలించినా మొత్తం డేటా, అప్లికేషన్లు ఎన్‌క్రిప్ట్ అయిపోతాయి. ఇతరులు ఈ డేటాను అసలు చూసే అవకాశముండదు. సామ్‌సంగ్ సిద్ధం చేసిన నాక్స్ టెక్నాలజీలోని ఓ కీలకమైన అంశాన్ని లాలీపాప్ ఓఎస్‌లో చేర్చడం ద్వారా ఇది వీలైంది.

అదనంగా 15 భాషలు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో స్థానిక భాషల వాడకం కొత్త కాకపోయినప్పటికీ లాలీపాప్‌తో ఈ భాషల  జాబితాలోకి మరో 15 కొత్తగా చేరాయి. తెలుగు, బెంగాలీ, కన్నడలతోపాటు కొన్ని విదేశీ భాషలు ఉన్నాయి. అంతేకాదు... ఈ సరికొత్త ఓఎస్‌లోని ఆడియో, వీడియో ఫీచర్లలోనూ చెప్పుకోదగ్గ మార్పులు జరిగాయి. 5.1, 7.1 ఛానెల్ ఆడియోలను సపోర్ట్ చేయడంతోపాటు యూఎస్‌బీ ఆడియో సపోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. కెమెరా ఫుల్ రెజల్యూషన్‌తో సెకనుకు 30 ఫ్రేములను బంధించగలదు. ప్రతి ఫ్రేమ్ తాలూకూ సెట్టింగ్స్‌లో వేర్వేరుగా మార్పులు చేసుకోగలగడం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement