సెలబ్రిటీలంటే ఎడాపెడా సంపాదిస్తారు కనుక వారి ఇన్వెస్ట్‌మెంట్లు కూడా అలాగే ఉంటాయనుకుంటాం. కానీ కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి ప్రతి పైసాను చాలా జాగ్రత్తగా చూసుకుంటామంటున్న సెలబ్రిటీల కథలివి...
బెంగాలీ బాబు.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీపై క్రికెట్ అభిమానులకున్న ఇష్టం అంతా ఇంతా కాదు. అందుకే ఆటగాడిగానే కాక కెప్టెన్‌గా కూడా సుదీర్ఘ ఇన్సింగ్స్ ఆడాడు గంగూలీ. మరి పెట్టుబడుల గురించి గంగూలీ ఏమంటారు? తనైతే ఏం చేస్తారు? ఆయన అభిప్రాయమేంటి? ఆయన మాటల్లోనే చూద్దాం..
నా ఉద్దేశంలో ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. మనకు ఏ రంగమైతే బాగా తెలుసో, ఎక్కడైతే మనకు అనుభవం ఉందో అక్కడే పెట్టుబడి పెట్టాలి. అంతేతప్ప మనకు తెలియని, అనుభవం లేని రంగం ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నా దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడి మనకు నష్టాలు మిగల్చదన్న నమ్మకం మొదట మనకు కలగాలి.
నా వరకూ మాత్రం నేను సురక్షితమైన పెట్టుబడులనే ఆశ్రయిస్తాను. ఏ మాత్రం రిస్కున్నా దూరంగా ఉంటాను. నాకు అనుభవం లేని, నాకు తెలియని రంగాల వైపు చూడనే చూడను. ఎక్కువగా ప్రభుత్వ మద్దతున్న రంగాలు, ఇన్వెస్ట్‌మెంట్లనే ఆశ్రయిస్తాను. పైవేటు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయను. ఇంకా చెప్పాలంటే ప్రైవేటు బ్యాంకులను కూడా పెద్దగా నమ్మను. ప్రభుత్వ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేస్తా. దానివల్ల నేను, నా ఇన్వెస్ట్‌మమెంట్లు సేఫ్‌గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి పైసా మనం కష్టపడి సంపాదించిందే. పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించటం కష్టం.
అయితే వ్యాపారాలు చేసేవారు కూడా ఇలా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్లు చేద్దామనుకుంటే కుదరదు. వ్యాపారంలో రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నచోటే లాభం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వారు ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందో, ఎక్కడ వృద్ధికి అవకాశం ఉందో అక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఇక్కడ మనం గమనించాల్సిందొకటి ఉంది. జీవితానికి గ్యారంటీ లేదు. రేపు ఏం జరుగుతుందో తెలీదు. అందుకే మనకు అనుభవం, నైపుణ్యం ఉండి... మన అదుపులో ఉండేచోటే ఇన్వెస్ట్ చేయాలన్నది ఎవరికైనా నేను చెప్పే సలహా.
సర్కారీ పథకాలే బెస్ట్: గంగూలీ
Published Fri, Mar 14 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement
Advertisement