దీర్ఘకాలికమైనవి బెటర్..
సెలబ్రిటీ ఇన్వెస్ట్‌మెంట్స్..
దేశీయంగా మహిళల క్రికెట్‌కి ప్రాచుర్యం తెచ్చిపెట్టిన వారిలో అంజుమ్ చోప్రా కూడా ఒకరు. ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారామె. క్రికెట్‌లో తనదైన శైలిలో రాణించిన అంజుమ్ చోప్రా.. పెట్టుబడుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పెట్టుబడులకు సంబంధించి అందరికీ ఒకే ఫార్ములా పనిచేయదనే అంజుమ్ చోప్రా మాటల్లోనే మరిన్ని వివరాలు..
పొదుపు, పెట్టుబడులకు నేను అత్యంత ప్రాధాన్యమిస్తాను. అత్యవసర పరిస్థితుల్లోనూ, ఇతరత్రా అవసరాల్లోనూ ఆదుకునేవి ఇవే. నా వ్యక్తిగత విషయాల్లో క్రమశిక్షణగానే ఉంటాను. పెట్టుబడుల అంశాల్లోనూ అలాగే ఉంటానా లేదా అన్నది చెప్పలేను కానీ.. ఒక పద్ధతి మాత్రం పాటిస్తుంటాను. ప్రతి నెలా, ఆర్నెల్లకి ఒకసారి కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలని పెట్టుకోను. ప్రత్యేకంగా దీర్ఘకాలికమైన వాటిపై ఎక్కువగా దృష్టి పెడుతుంటాను. ఏదైనా పెట్టుబడి పెట్టతగినదని లేదా దీర్ఘకాలికంగా మంచిది అనిపిస్తే తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తాను.
ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో దూకుడుగా ఉండను. చాలా మటుకు ఆచి తూచి ఇన్వెస్ట్ చేస్తుంటాను. నేను ఎక్కువగా ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతుంటాను. అది కూడా స్థలం మీదే. అందులోనూ బంజరు భూమి దొరికితే మరీ మంచిది. లేకపోతే.. నిర్మించిన లేదా నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ అయినా కొనేందుకు మొగ్గు చూపుతాను. ఇవేవీ సాధ్యం కాకపోతే.. సురక్షితమైన ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు చేతిలో ఉన్నట్లుంటుంది. ఇందులో కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. కొంత మొత్తం మాత్రం ఫిక్సిడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాను.
రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్లలో ఒకోసారి ఆశించిన ఫలితాలు రాలేదు. అలాగని, అవి కొట్టిపారేయతగ్గ ప్రాపర్టీలు కావు. ఉదాహరణకు ఏడెనిమిదేళ్ల క్రితం ఒక సిటీలో ఒక ప్రాపర్టీ తీసుకున్నాం. ఆ ఏరియాలో భారీగా అభివృద్ధి జరుగుతుందని, ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగిపోతాయని అంతా భావించారు. కానీ మేం అంచనా వేసిన స్థాయిలో దాని విలువ పెరగలేదు. విలువ పెరగడం అంటే.. మరీ వందరెట్లు స్థాయిలో పెరగడమని కాదు.. కనీసం ఒక మోస్తరుగానైనా పెరగాలి కదా. కానీ అది జరగలేదు. అయితే అదృష్టవశాత్తు.. ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడులలో దేనిలోనూ చేదు అనుభవం ఏదీ ఎదురుకాలేదు.
ఇక పెట్టుబడుల విషయంలో సలహాలంటే.. ఎవరికి వారు తమ తమ సామర్ధ్యాన్ని బట్టే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కొందరు సంపాదించినదంతా ఖర్చు పెట్టేస్తుంటారు. మరికొందరు సంపాదించే దాంట్లో కొంత మాత్రమే ఖర్చు చేస్తారు. ఏదేమైనా చేతిలో కాస్త డబ్బు ఉంటేనే, కాస్త రిస్కు తీసుకోగలం అనుకుంటేనే ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన వస్తుంది. నన్నడిగితే ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయాల్సిందే. అయితే, ఇది వారి వ్యక్తిగత రిస్కు సామర్ధ్యాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే సూత్రం పనిచేయదు. మీకు ఎంత ఆదాయం వస్తోంది, ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత రిస్కు చేయగలరు అన్న దానిపై పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం ఆధారపడి ఉంటుంది.