
భక్తి శ్రద్ధలు
ఆత్మీయం
భగవన్నామంలోని శ్రద్ధాభక్తులు మనుషుల చేత అద్భుతకార్యాలను చేయిస్తాయి. అయితే ఆ నామస్మరణలో భక్తిశ్రద్ధలు ముఖ్యం. అవి లేకుండా పవిత్ర నామాల్ని ఎన్నిసార్లు స్మరించినా కలిగే ఫలితం నిష్ఫలం. సాయినాథుడు తన భక్తులనుంచి శ్రద్ధ, భక్తి, విశ్వాసాన్ని దక్షిణగా కోరాడు. అవి తనకిస్తే బతుకుల్ని తీయబరుస్తానని అభయమిచ్చారు. మనం చేసే పనిలో కూడా మనం చూపే భక్తిశ్రద్ధలే ఆ పనిలో రాణించేలా చేస్తాయి. భక్తి, శ్రద్ధ– సబూరి...ఇవి రెండూ కలిస్తే కలిగేది మేలిమి విశ్వాసం.
ఇవే మనల్ని భగవంతునికి దగ్గర చేసే సాధనాలు. ఇందులో ఎటువంటి అనుమానానికి, అపోహలకు ఆస్కారం లేదు. ఉన్నదంతా విశ్వాసమే. ఇటువంటి శ్రద్ధాభక్తులు ఎవరికైతే ఉంటాయో, వారే మహనీయులుగా మారతారు. శ్రీ సాయి సచ్చరిత్రలో బాబా చెప్పినట్లు ... ఈ శరీరాన్ని ధర్మకార్యాచరణకే వినియోగించాలి. సత్కర్మలు ఆచరించాలి. పరమాత్మకోసం ఆరాటపడాలి. అదే నిజమైన భక్తి. అదే నిజమైన ఆధ్యాత్మిక దృక్పథం. అది అలవడాలంటే భక్తి, శ్రద్ధలను కలిగి ఉండాలి.