దాచాలంటే దాగదులే! | big boss show starts this week in telugu host by jr.ntr | Sakshi
Sakshi News home page

దాచాలంటే దాగదులే!

Published Sat, Jul 15 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

దాచాలంటే దాగదులే!

దాచాలంటే దాగదులే!

నీ జీవితం నీది కాదు.
ఒకరు చూస్తున్నారు.

నువ్వేం చేస్తున్నా కనిపిస్తుంది.
ఇద్దరు చూస్తున్నారు.

దాగలేవు. దాచలేవు.
ముగ్గురు చూస్తున్నారు.

తిట్టినా తెలుస్తుంది. కొట్టినా తెలుస్తుంది.
నలుగురు చూస్తున్నారు.

నీ నిద్ర, నీ మెలకువ, నీ కసి, నీ మసి
ఐదుగురు చూస్తున్నారు.

నాలుగు గోడల సెట్‌లో బతుకు.
ఆరుగురు చూస్తున్నారు.

కెమెరా ఆకాశం కింద మనుగడ.
ఏడుగురు చూస్తున్నారు.

నీ అనుక్షణం నీ ప్రతి క్షణం నిఘా నీడలోనే.
బిగ్‌ బాస్‌.. రెండు రాష్ట్రాల కోట్లాది ప్రజలు చూడబోతున్నారు.

ఇంద్రుడికి ఒళ్లంతా కళ్లే. అందుకే అతణ్ణి సహస్రాక్షుడు అన్నారు. అతడు చూడవద్దన్నది కూడా చూడగలదు. చూడలేనివి కూడా చూడగలడు. మనిషి జీవితానికి మించిన కుతూహలం మరో మనిషికి లేదు. ప్రతి మనిషికి ఇంకో మనిషి జీవితంలోకి తొంగి చూడాలని ఉంటుంది. అది పబ్లిక్‌ లైఫ్‌ కానివ్వండి. ప్రయివేట్‌ లైఫ్‌ కానివ్వండి. తెలుసుకుంటే అతడికి ఆనందం. తన ప్రవర్తనే కాదు ఎదుటివారి ప్రవర్తన కూడా మనిషికి ‘న్యూస్‌’గా ఉంటుంది. నేనిలా ఎందుకు చేశాను, వారు ఇలా ఎందుకు చేశారు అని పరిశీలించడంలో అతనికి చాలా టైమ్‌ పాస్‌ ఉంది. సాటి మనిషి గురించి గాసిప్‌ మాట్లాడటంలో ఎవరైనా ఆసక్తి చూపేది అందుకే.

‘ఏకాంతంలో మనిషి ఏం చేస్తుంటాడు’ అని తెలుసుకోవడానికి తలుపులకు కన్నాలు వేసే స్వభావం మనిషికి వచ్చింది. అదేదో బహిరంగంగా చూపిస్తే మంచి షో అవుతుంది కదా అనే ఆలోచన నెదర్‌లాండ్స్‌ దేశానికి చెందిన టీవీ ప్రెజెంటర్‌ జాన్‌ మోల్‌కు వచ్చింది. కొంతమందిని పట్టుకుని వారిని ఊరవతల ఇంట్లో పడేసి వాళ్ల ప్రతి కదలికను కెమెరాలతో చూపి మనకు నచ్చిన వారికి బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన అతడికి వచ్చింది. అలా 1999లో ఆ దేశంలో పుట్టిన సంచలనాత్మక టెలివిజన్‌ షో ‘బిగ్‌ బ్రదర్‌’.

అతడు అంతా చూస్తున్నాడు...
దేవుడున్నాడు... అంతా చూస్తున్నాడు అంటాం. ఈ షోలో దేవుడి స్థానంలో బిగ్‌ బ్రదర్‌ ఉంటాడు. అంటే బిగ్‌ బ్రదర్‌ అంటూ ఒక మనిషి ఉండడు. కెమెరానే బిగ్‌ బ్రదర్‌. షో నిర్వాకులందరి ప్రతినిధిగా ఒక కంఠం వినిపిస్తూ ఉంటుంది. ఆ కంఠమే బిగ్‌ బ్రదర్‌. అతడు బిగ్‌ హౌస్‌లోని ప్రతి ఒక్కరి కదలికలను చూస్తుంటాడు. తద్వారా మనకు చూపిస్తూ ఉంటాడు. ఇక ఈ షోకు అనుసంధాన కర్త ఒకడుడుంటాడు. ఇతణ్ణి హోస్ట్‌ అంటారు. ఈ హోస్ట్‌ వారాంతంలో ఒకసారి వచ్చి షోలో జరిగిన ఘటనలను వ్యాఖ్యానించి బిగ్‌ హౌస్‌లో ఎక్కువ మందికి నచ్చని వ్యక్తిని ఎలిమినేట్‌ అంటే షో నుంచి బయటకు సాగనంపుతుంటాడు. బిగ్‌బ్రదర్‌ కనిపించని మనిషైతే ఈ హోస్ట్‌ కనిపించే మనిషి.

ఇండియాలో బిగ్‌ బాస్‌
నెదర్‌లాండ్స్‌లో పుట్టిన ‘బిగ్‌ బ్రదర్‌’ అతి తక్కువ కాలంలోనే 54 దేశాలలో పాకింది. అన్ని దేశాలలో కలిపి ఇప్పటికి దాదాపు 400 సీజన్ల బిగ్‌బ్రదర్‌ ఎపిసోడ్లు నడిచాయి. అమెరికాలో, బ్రిటన్‌లో ఇతర దేశాలలో దీనిని బిగ్‌ బ్రదర్‌ అంటున్నా ఇండియాలో మాత్రం ‘బిగ్‌ బాస్‌’ అన్నారు. 2006లో సోనీ టీవీలో మొదలైన బిగ్‌ బాస్‌ షో ఇప్పటికి 10 సీజన్లు ముగించుకుంది. బాలీవుడ్‌ నటులు అర్షద్‌ వర్సి, శిల్పా శెట్టి, అమితాబ్‌ బచ్చన్‌ వీటికి హోస్ట్‌లుగా వ్యవహరించారు. వీరి తర్వాత సల్మాన్‌ ఖాన్‌ సుదీర్ఘకాలంగా హోస్ట్‌గా ఉంటున్నాడు. తాజాగా దక్షిణ భారత భాషలలోకి వచ్చిన ఈ షోకు తమిళంలో కమలహాసన్, తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్, కన్నడలో సుదీప్‌ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు.

సెలబ్రిటీ – కాంట్రవర్సీ
హిందీ బిగ్‌ బాస్‌ ఇప్పటికి పది సీజన్లు గడిస్తే
ఆ పది సీజన్లలో ఎన్నో గొడవలయ్యాయి.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 1లో హౌస్‌ మేట్‌గా ఐటమ్‌ గర్ల్‌ రాఖీ సావంత్‌ను తీసుకున్నారు. ఆమెకు కౌంటర్‌గా ఇంకో వ్యాంప్‌ నటి కాశ్మీరా షాను తీసుకున్నారు. బిగ్‌ బాస్‌లో ఉన్నన్ని రోజులు వీళ్లిద్దరూ సిగపట్లు పట్టుకున్నారు. ఈ షోలో ట్రాన్స్‌ జెండర్‌లకు కూడా చోటివ్వాలి అని ట్రాన్స్‌ జెండర్‌ అయిన బాబీకి అవకాశం ఇస్తే హౌస్‌లో ఉన్న మగవాళ్లు, ఆడవాళ్లు కూడా బాబీని ఏడిపించి రెండు వారాల్లోనే హౌస్‌ నుంచి బయటకు గెంటేశారు.

చట్ట సంబంధమైన చిక్కుల్లో ఉన్న వారిని హౌస్‌ మేట్స్‌గా పిలవడం బిగ్‌ బాస్‌ నియమంగా పాటిస్తుంది. అందులో భాగంగా సీజన్‌ 2లో డ్రగ్స్‌ వ్యవహారంలో న్యూస్‌లోకి వచ్చిన రాహుల్‌ మహాజన్‌ను, అబూ సలేమ్‌ కేసులో శిక్ష అనుభవించిన మోనికా బేడీని హౌస్‌ మేట్స్‌గా పిలిచింది. మోనికా బేడీ ఈ సీజన్‌లో తన సత్ప్రవర్తనతో సానుభూతిని సంపాదించుకుంటే రాహుల్‌ మహాజన్‌ మరో హౌస్‌ మేట్‌ పాయల్‌ రోహత్గీతో బహిరంగ శృంగారం వరకూ వెళ్లి హల్‌చల్‌ చేశాడు. ఇతడు విజేతగా ఎంపికయ్యే అవకాశాలు ఉండగా బిగ్‌ హౌస్‌లో ఉండలేక గోడ దూకి పారిపోయాడు.

రోజుల తరబడి ఒకే చోట ఉండటం వల్ల ఆకర్షణ ఏర్పడటం సహజం. బిగ్‌ బాస్‌ సీజన్‌ 2లోనే భోజ్‌ పురి నటి సంభావన్‌ టీవీ నటుడు రాజా చౌదరి క్లోజ్‌ అయ్యారు. వీళ్లిద్దరూ షోలో పెదాల ముద్దు పెట్టుకోవడం సంచలనం అయ్యింది. అలాగే సీజన్‌ 4లో పాల్గొన్న పాకిస్తాన్‌ ఐటమ్‌ గర్ల్‌ వీణా మాలిక్‌ అదే హౌస్‌లో ఉన్న మరో నటుడు అష్మిత్‌ పటేల్‌కు ఎడతెగని ముద్దులు పెట్టింది. తమ కదలికలు కెమెరాలో రికార్డ్‌ అవుతున్న సంగతిని కూడా వీళ్లు పట్టించుకోలేదు. వీణా మాలిక్‌ వ్యవహారం చూసి ఇది ఇస్లాంకు వ్యతిరేకం అని ఆమె మీద పాకిస్తాన్‌లో కేసు నమోదైంది. ఇక కాజోల్‌ చెల్లెలు తనీషా ముఖర్జీ కూడా బిగ్‌ బాస్‌లో పాల్గొంది. సీజన్‌ 7లో ఈమె పాల్గొని మరో నటుడు ఆర్మాన్‌ కోహ్లీతో రాత్రి పూట ఒకే మంచం మీద పడుకుని కెమెరాలకు చిక్కింది.

అమెరికా పార్న్‌ స్టార్‌ సన్నిలియోన్‌ బిగ్‌ బాస్‌ సీజన్‌ 5లో హౌస్‌ మేట్‌గా ఉంది. భారతదేశంలో విడ్డూరంగా భావించే ఇటువంటి నటిని బిగ్‌ బాస్‌ షోనే ప్రేక్షకులకు దగ్గర చేసిందని చెప్పాలి. ఈ షోలో గెస్ట్‌గా పాల్గొన్న మహేశ్‌ భట్‌ ఆమె చేయి పట్టుకుని జరిగిందంతా మర్చిపో... కొత్త జీవితం జీవించు అని ఊరడించాడు. అంతేకాదు నీకు సినిమాల్లో అవకాశం ఇసాను అని బిగ్‌ బాస్‌ సాక్షిగా మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం  ‘జిస్మ్‌2’లో అవకాశం ఇచ్చి ఆమెను బాలీవుడ్‌లో స్థిరపడేలా చేశాడు.

జీవితం బందీఖానా
బిగ్‌ బాస్‌ షో కోసం ముంబై శివార్లలోని లోనావాలాలో సెట్‌ వేశారు. ఇందులో ఒక అధునాతనమైన భవంతిలో ఉండే ఏర్పాట్లన్నీ ఉంటాయి. బెడ్‌ రూమ్‌లు మాత్రం బహిరంగంగా డార్మెటరీలకు మల్లే ఎక్కువ బెడ్‌లతో ఉంటాయి. స్త్రీలకు ఒక బెడ్‌రూమ్‌ పురుషులకు ఒక బెడ్‌రూమ్‌ ఉన్నా ఇద్దరూ ఏ బెడ్‌రూములో అయినా అడ్జస్ట్‌ కావచ్చు. టాయిలెట్స్, బాత్‌రూములలో తప్ప మిగిలిన అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి. మొత్తం 11 మంది ‘హౌస్‌మేట్స్‌’ను ఆహ్వానిస్తారు. వీరు డెబ్బై రోజుల నుంచి 105 రోజుల వరకూ ఈ ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోవారం హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతూ ఉండగా ఎవరైతే ఆఖరున మిగులుతారో వారే విజేతగా నిలుస్తారు. అంటే పోటీలో నిలిచే కొద్దీ హౌస్‌లో గడిపే రోజులు పెరుగుతాయి.

బిగ్‌ బాస్‌ హౌస్‌లో టీవీ ఇంటర్‌నెట్‌ ఉండవు. పేపర్‌ పెన్నూ ఇవ్వరు. ఫోన్‌ అసలు ఉండదు. అంటే బయట లోకంలో ఏం జరుగుతున్నదో తెలిసే వీలే లేదన్న మాట. ఇలాంటి వాతావరణంలో ఉండటానికి శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలంగా ఉండాలి. గతంలో బిగ్‌ బాస్‌లో పాల్గొన్న బాలీవుడ్‌ నటుడు అమిత్‌ సద్‌ రెండు వారాలు గడిచాక మానసిక ఉద్వేగానికి లోనయ్యి టీవీ కెమెరా ఎదురుగా పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు.

కమల్‌ హాసన్‌–బిగ్‌ బాస్‌ కాంట్రవర్సీ
తమిళంలో టెలికాస్ట్‌ అవుతున్న బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా పని చేస్తున్న కమల్‌హాసన్‌ మీద అక్కడి హిందూ మక్కల్‌ కట్ఛి సంస్థ దాడి మొదలెట్టింది. కమల్‌హాసన్‌ ఈ ప్రొగ్రామ్‌ను హోస్ట్‌ చేయకూడదని డిమాండ్‌ చేస్తోంది. తమిళ ‘బిగ్‌ బాస్‌’ను ప్రసారం చేస్తోన్న విజయ్‌ టీవీ ఆఫీసు ముందు సుమారు రెండు వారాలు ధర్నాలు, గొడవలు చేసిన హిందూ మక్కల్‌ కట్ఛి సంస్థ ఈ నెల 12న చెన్నై కమిషనర్‌ను కలసి కంప్లైంట్‌ చేసింది. ‘బిగ్‌ బాస్‌’తో మీకు సమస్య ఏంటి? అని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన అర్జున్‌ సంపత్‌ను ప్రశ్నిస్తే... ‘కుటుంబ వ్యవస్థను నాశనం చేసేలా ‘బిగ్‌ బాస్‌’ కార్యక్రమం ఉంటోంది. అందులో కంటెస్టెంట్స్‌ వేసుకునే బట్టలు మన సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ‘బిగ్‌ బాస్‌’ మాత్రమే కాదు, టీవీ సీరియల్స్‌ అన్నీ కుటుంబ వ్యవస్థను నాశనం చేసేలా ఉన్నాయి. వాటన్నింటి కంటే ‘బిగ్‌ బాస్‌’ మరింత ప్రమాదకరం.

దీని ద్వారా వామపక్ష (లెఫ్టిస్ట్‌), ద్రావిడ (ద్రవిడియన్‌) భావజాలాలను ప్రమోట్‌ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘జల్లికట్టు సమయంలో జులైనా అనే మహిళ మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది. కావాలనే ఆమెను యాంటీ–మోడీ పర్సన్‌గా షోలోకి ఆహ్వానించారు’ అని అన్నారు. అంతేనా... ఏడాది పాటు పదవీకాలం పూర్తిచేసుకున్న కేరళ సీయంను అభినందించిన కమల్, మోడీని గానీ ఇతర బీజేపీ సీయంలను గానీ ఎప్పుడూ ఎందుకు అభినందించలేదు? అని ప్రశ్నించారు. ‘విశ్వరూపం టైమ్‌లో మేం కమల్‌కు మద్ధుతు ఇచ్చాం. కానీ, ఆయనెప్పుడూ హిందూ వ్యతిరేక సందేశాలు ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఈ షోను హోస్ట్‌ చేయకూడదని కోరుతున్నాం’ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

తెలుగే మాట్లాడాలి...
ఈ వారం మా టీవీలో మొదలు కానున్న తెలుగు బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనబోయే హౌస్‌మేట్స్‌ లిస్ట్‌ పూర్తిగా బయటకు రాలేదు. వారు ఎవరైనా సరే బిగ్‌ బాస్‌లో ఉన్నన్ని రోజులు స్థానిక ప్రేక్షకుల భాష అంటే తెలుగే మాట్లాడాలి. ఈ హౌస్‌ మేట్స్‌ మెడలో రిసీవర్‌ ఉంటుంది. బిగ్‌ బాస్‌ హౌస్‌లో కెమెరాలతో పాటు అడుగడుగునా మైక్‌లు ఉంటాయి. ఎవరు ఎక్కడ నిలబడి మాట్లాడినా ప్రేక్షకులకు వినిపించేలా మాట్లాడాలి. పరాయిభాషలో మాట్లాడటం, గుసగుసలు పోవడం చెల్లదు. హిందీ బిగ్‌ బాస్‌లో అందరూ హిందీయే మాట్లాడతారు.

బయటకు పంపండి
బిగ్‌ బాస్‌లో ఉన్న హౌస్‌ మేట్స్‌ ప్రతి ఒక్కరు బిగ్‌ బాస్‌ ఆదేశాలకు నిబద్ధులు. ప్రతి రోజూ వీరికి బిగ్‌ బాస్‌ నుంచి ఆదేశాలు అందుతాయి. హౌస్‌ మేట్స్‌లో ఫలానా వారు వంట చేయాలి, ఫలానా వారు హౌస్‌ క్లీన్‌ చేయాలి, ఫలానా టైములో సైరన్‌ మోగుతుంది వెంటనే అందరూ లాంజ్‌లోకి వచ్చి డాన్స్‌ చేయాలి... ఇలా బిగ్‌ బాస్‌ ఆదేశాలు ఇస్తాడు.  బిగ్‌ బాస్‌ తన హౌస్‌ మేట్స్‌ను ఒక్కొక్కరిని ‘కన్ఫెషన్‌ రూమ్‌’లోకి పిలిచి మాట్లాడుతుంటాడు (అంటే గొంతు మాత్రమే వినపడుతుంటుంది. మనిషి ఉండడు. దీనిని మనం నిర్వహకుల గొంతు అని అర్థం చేసుకోవాలి). టీమ్‌లో మనకు నచ్చని వ్యక్తి పేరు చెప్పి వాళ్లను బయటకు సాగనంపమని బిగ్‌ బాస్‌కు చెప్పాలి. ఒక వారంలో ఎక్కువ మంది ఎవరి పేరు చెప్తారో వారిని ఆ వారం బయటకు పంపుతారు.

తగాదాలు మొదలు...
బిగ్‌ బాస్‌లో పాల్గొనేవారు ఎవరు ఏ రంగంలో ప్రముఖులు అయినా వారంతా ప్రాథమికంగా మనుషులు. బిగ్‌ హౌస్‌లో ఎంటర్‌ అయ్యాక కొందరు కొందరికి నచ్చుతారు. కొందరు కొందరికి నచ్చరు. మొదటి రోజు నుంచే తగాదాలు మొదలవడానికి ఆస్కారం ఎక్కువ. బిగ్‌ హౌస్‌లో పని వాళ్లు ఉండరు. ఎవరి పని వారే చేసుకోవాలి. వంట చేసుకోవాలి. బట్టలు ఉతుక్కోవాలి. బిగ హౌస్‌లో స్థానం నిలబెట్టుకోవడానికి ప్రయాస పడాలి. ఈ క్రమంలోనే తగాదాలు వస్తూ ఉంటాయి. బిగ్‌ బాస్‌లో హౌస్‌ మేట్స్‌ కూర్పు కూడా తెలివిగా గొడవలకు ఆస్కారం ఇచ్చే విధంగా ఉంటుంది. ముక్కోపులను, వదర బోతులను, ఎచ్చులకోరులను కూడా బిగ్‌ హౌస్‌లో కావాలని చోటు కల్పిస్తారు. అప్పుడు షోలో మజా వస్తుందని నిర్వాహకుల భావన. – సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement