శరీర బరువు ఇలా కూడా పెరుగుతుంది!
సెల్ఫ్‌చెక్
వ్యాయామాలు చేయకపోవటం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని అధికంగా తీసుకోవటం వంటివి బరువు పెంచే సాధారణ కారణాలు. కానీ, మనం చేసే ప్రతి పని శరీర బరువును ప్రభావితం చేస్తుంది.
తగినంత నిద్ర లేకపోవటం : నిద్రలేమి శరీర బరువుపై ప్రభావం చూపుతుంది. తగినంత నిద్రలేకపోవడంతో శరీరంలో హార్మోన్‌ల స్థాయిలో మార్పులు కలగటం వలన ఆకలి పెరిగి, అధికంగా తిని బరువు పెరుగుతారు.
మానసిక ఒత్తిడి... మందుల ప్రభావం: మానసిక ఒత్తిడికి గురైన సమయంలో అనాలోచితంగా జంక్ ఫుడ్ లేదా అధిక క్యాలోరీలను అందించే ఆహారాలను తీసుకుంటా . అదేవిధంగా దీర్ఘకాలికంగా ‘యాంటీ డిప్రెసెంట్’లను తీసుకోవడం వలన కూడా శరీర బరువు పెరగవచ్చు.
థైరాయిడ్: థైరాయిడ్ గ్రంథి నుండి సరిపోయేంత స్థాయిలో హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల జీవక్రియ ఆలస్యం అవుతుంది. ఫలితంగా శరీర బరువు పెరుగుతుంది.
మెనోపాజ్ : మెనోపాజ్ సమయంలో హార్మన్‌ల అసమతౌల్యం వల్ల బరువు పెరగవచ్చు. దాంతో వయసు పెరిగిన కొద్దీ జీవక్రియలు మందగిస్తాయి. కండరాల ద్రవ్యరాశి తగ్గుతుంది. ఫలితంగా నడుము చుట్టూ, తొడల ప్రాంతంలో కొవ్వు పేరుకుపోయి లావవుతారు.
ధూమపానం మానేయటం : పొగ తాగటాన్ని ఆపేయటం! అవును, నిజమే. సిగరెట్‌లో ఉండే నికోటిన్ ఆకలిని తగ్గించి వేస్తుంది. సిగరెట్ మానేయటం వలన ఆకలి పెరిగి, అధికంగా తినే అవకాశం ఉంది. అంతేకాకుండా రుచి గ్రాహకాల పనితీరులో లోపాలు ఏర్పడే అవకాశమూ ఉంది. ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం, సిగరెట్ మానటం వలన 4 నుండి 5 కిలోల బరువు పెరుగుతారని వెల్లడించారు. అలాగని స్మోకింగ్ మానడాన్ని మానకండి.