
‘సార్.. బెంజి కారు తెచ్చాం’‘ఐసా నహీ’ ‘సార్.. లీచీ, బాదాం, కాజూ, పిస్తా, ఖజూర్, కిస్‌మిస్ జ్యూస్ ఆయా’‘ఐసా నహీ’‘మేడమ్.. టాప్ మీద గోల్డ్ ఎంబ్రాయిడరీ. కాలర్ మీద డైమండ్ స్టడ్డింగ్, బెల్టులో రూబీ ఫిట్టింగ్’‘ఐసా నహీ’
అసలు ‘ఐసా నహీ’ అంటే ఏంటి?‘ఇలా కాదు’ అని. బాలీవుడ్‌లో ప్రొడ్యూసరు ఏది చేసినా..‘ఐసా నహీ.. అలా కావాలి’ అని అడుగుతుంటారు స్టార్‌లు.వాళ్ల నకరాలు, ఎక్స్‌ట్రాలు చూస్తే మనవాళ్లు ఐసా నహీ అనిపిస్తుంది. నవంబర్‌లో ఆమిర్‌ఖాన్ యాక్షన్–అడ్వెంచర్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ రిలీజ్ అవుతోంది. థగ్స్ అంటే దోపిడీదారులు. 1839లో ఫిలిప్స్ మెడోస్ టేలర్ అనే ఫ్రాన్స్ రచయిత రాసిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ థగ్’ అనే నవల ఆధారంగా విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. (ధూమ్ వన్, టు, త్రీ; రావన్ ఈయనవే). నిర్మిస్తున్నది ఆదిత్యా చోప్రా. 210 కోట్ల రూపాయల బడ్జెట్. 19వ శతాబ్దం నాటి ఈ స్టోరీలో బ్రిటిష్ పాలకులకు కంట్లో నలకలా మారిన ఒక ఇండియన్ దోపిడీ ముఠా ఉంటుంది. ఆ ముఠాకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడే ఆమిర్ ఖాన్. ‘ఆమిర్ అలీ’ అనే ఆ పాత్రలో ఆమిర్‌ఖాన్ జీవించేస్తున్నాడట! అయితే ఆ పాత్రలోనే కాదు, తన రెమ్యునరేషన్ దగ్గర కూడా ఆమిర్ ఒక దోపిడీ ముఠా నాయకుడికి ఏ మాత్రం తక్కువ కాని స్థాయిలో.. గొంతు మీద కత్తిపెట్టి, ‘తియ్.. ఎంతుందో’ అని డబ్బును డిమాండ్ చేశాడట! మూవీ ప్రాఫిట్‌లో 70 పర్సెంట్ తనకు ఇవ్వాలని ఆమిర్ అడిగినట్లు వార్తలొచ్చాయి. అంటే 147 కోట్ల రూపాయలు! ఇది తెలిసి ఇండస్ట్రీ షాక్ అయింది. నిర్మాతలకు, బయటì వాళ్లకు స్టార్‌లు, సెలబ్రిటీలు ఇచ్చే ఈ షాకులు కొత్తేం కాదు. వాళ్లు పెట్టే డిమాండ్‌లు ఎంత వింతగా, ఎంత విడ్డూరంగా, కొన్నిసార్లు ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా ఉంటాయో పాపం ఆ.. పడేవాళ్లకు మాత్రమే తెలుసు. అవి తీర్చలేని వారు ‘సారీ’ అంటారు. తీర్చక తప్పనివారు ‘సరే’ అంటారు. అలాంటి కొన్ని గొంతెమ్మ కోర్కెలు, వింత వింత షరతులు ఈవారం మన శాటర్‌డే స్పెషల్.
ఫస్ట్ ఐశ్వర్యారాయ్‌తో స్టార్ట్ చేద్దాం. పెద్ద స్టార్ కదా మరి! నిర్మాతల్ని ఆమె పెద్దగా బెదరగొట్టలేదు కానీ, ఫ్లయింట్ సిబ్బందే.. ఐశ్వర్య ఎక్కిందంటే చాలు.. ‘బాబోయ్’ అని మూలమూలలకి నక్కేస్తారు. ఆమె గురించి తెలియనివాళ్లే ధైర్యంగా ముందుకొచ్చి.. ‘యస్.. మ్యామ్. మేము మీకేదైనా సహాయపడగలమా?’ అని అడుగుతారు. ‘ఓయస్.. తప్పకుండా సహాయపడగలరు’ అని ఒక స్మయిల్ ఇచ్చి, ఫ్లయిట్‌లో ఏమేం డిష్‌లు ఉన్నాయో అన్నీ మొహమాటం లేకుండా తెప్పించుకుంటారు ఐశ్వర్య! అవన్నీ ఆరగిస్తారా అంటే లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని తెస్తే వాటిల్లో చూడచక్కగా ఉన్న ఒక్కటి మాత్రమే మేడమ్ సెలక్ట్ చేసుకుంటారు. ఫ్లయిట్‌లో ఎక్కడికి వెళ్లినా ఐశ్వర్యకు ఇదో హ్యాబిట్.
ఐశ్వర్యలా.. కరీనా కపూర్ తిండి విషయంలో ఏమంత పర్టిక్యులర్ కాదు. ఉన్నదేదో తినేస్తారు. అయితే ఉన్నవాళ్లెవరో వాళ్లతో నటించేయరు. అర్థం కాలేదా! నిర్మాతలు ఎవరైనా కరీనా దగ్గరికొచ్చి ‘కరీనాజీ మీరే మా సినిమాలో హీరోయిన్’ అని ఆనందంతో తబ్బిబ్బవుతూ చెబితే, కరీనా ఏ మాత్రం ఎక్స్‌ప్రెషన్ లేకుండా ‘ఇంకా ఎవరెవరుంటారు మీ సినిమాలో?’ అని అడుగుతారు. ‘ఇంకా కాస్టింగ్ పూర్తి కాలేదు’ అంటే.. ‘ఎ–లిస్ట్’ యాక్టర్‌లు అయితేనే నేను చేస్తాను’ అని షరతు విధిస్తారు కరీనా! కరీనాలా అందరూ ఎ–లిస్ట్ వాళ్లే అయితే నిర్మాతలు ఏ లిస్టులోకి వెళ్లిపోతారో ఊహకు అందనిదేం కాదు.
కరీనాలా రేఖ ఇలాంటి షరతులేం పెట్టకున్నా.. కరీనానే నయం అనిపించేలా చేశారొకసారి. అభిషేక్ కపూర్ చిత్రం ‘ఫితూర్’లో నటిస్తూ నటిస్తూ మధ్యలో క్విట్ కొట్టేశారు రేఖ. నిర్మాతకు కాళ్లు ఒణికాయి. ‘ఏమైంది తల్లీ?! మమ్మల్ని నడి సముద్రంలో వదిలేసివెళ్లారు’ అని ఫోన్‌చేసి అడిగాడు. ‘నా లుక్ నేను అనుకున్నంత బాగా రాలేదు. అందుకే మీ సినిమాను వదిలేశా’ అని కూల్‌గా చెప్పారు రేఖ. నిర్మాత కుప్పకూలిపోయాడు. తబూ వచ్చి పైకి లేపి నీళ్లిచ్చింది. నిర్మాత తేరుకుని ‘నువ్వే మా రేఖ’ అనేశాడు. రేఖతో షూట్ చేసిందంతా తిరిగి తబూతో చేయించాడు. ఈ బుద్ధి మల్లికా శెరావత్‌కీ ఉంది. సీన్ బాగా రాలేదని తనకు అనిపిస్తే (భలే వచ్చిందని డైరెక్టర్‌కి అనిపించినా కూడా) మళ్లీ తీయించమంటుంది. టేకులు తినకుండా టేకులు తినిపించడం అంటే ఇదే.
ప్రియాంకా చోప్రాది ఇంకో రకమైన ధోరణి. బయట ‘ఫ్యాషనబుల్‌గా చిరిగిపోయిన’ బట్టల్ని వేసుకుని చక్కగా కనిపిస్తారు కదా ఈవిడ.. సినిమాల్లో నటించడానికి మాత్రం ‘నో–న్యూడిటీ’ క్లాజ్ పెట్టేస్తారు. ‘ఒక్క సీన్ మేడమ్.. ప్లీజ్’ అని బతిమాలినా కూడా కనికరం చూపరు. ఇప్పుడామె హాలీవుడ్ నటి. అక్కడ కూడా అంతే. ‘క్వాంటికో’, ‘బేవాచ్’ సీరీస్‌లో ఒళ్లు కనిపిస్తే ఊరుకోనన్నారు. దాంతో ఆమె ఒళ్లు కనిపించే అవసరం లేకుండా నిర్మాతలు నిరుత్సాహంగా సన్నివేశాలను తిరగ రాసుకున్నారు.
దీపిక పడుకోన్ కూడా తక్కువేం తిన్లేదు. అయితే ఒళ్లు కనిపించనివ్వని విషయంలో కాదులెండి. విక్కీ కౌషల్ అనే యాక్టర్‌తో నటించేది లేదు పొమ్మంది. విక్కీ ఎ–లిస్టర్ కాదు. అదీ దీపిక అబ్జెక్షన్. వెంటనే నిర్మాతలు తన్ని తరిమేశారు. ఎవర్ని తన్ని తరిమేశారో వేరే చెప్పాలా?! పాపం విక్కీ.
కత్రీనాకు ఈ టైప్ ఆఫ్ అభ్యంతరాలు తక్కువే. అయితే ‘ఫితూర్’ ఫిల్మింగ్ మొత్తం అయిపోయాక ఓ సీన్‌ని మళ్లీ తీయాలని పట్టుపట్టింది. ‘బాగానే ఉంది కదమ్మా’ అని నిర్మాత అన్నాడు. ‘ఏం బాగుంది! నా మొఖం. కొంచెం బొద్దుగా లేనూ. మళ్లీ తియ్యండి’ అని కత్రీనా హఠం పట్టింది. విషయం ఏంటంటే.. సినిమా పూర్తయ్యాక కత్రీనా తగ్గడం మొదలుపెట్టింది. తగ్గాక అద్దంలో తనకు తనే విపరీతంగా నచ్చేసింది. ఆడియన్స్‌కి ఆ బొద్దు సీన్‌ని చూపించడం కన్నా, ఈ స్లిమ్ సీన్‌ని చూపించడం బెటర్ కదా అనుకుంది. చేసేది లేక నిర్మాత ‘ఓకే’ అన్నాడు. ‘అప్పుడే ఓకే కాదు, నాకు నచ్చిన స్టిల్ ఫొటోగ్రాఫర్ వచ్చి ఆ సీన్‌కి ఫొటో తీస్తాడు’ అంది. ‘అలాగే తల్లీ’ అని దండం పెట్టాడు నిర్మాత.
ఇప్పుడొక చిన్న బ్రేక్. ముక్కు మీద వేలేసుకునే విషయం. సన్నీలియోన్ తెలుసు కదా. తెలియకుండా ఉంటుందా! ఉండదనే నిర్మాతలూ అనుకున్నారు. అయితే కాంట్రాక్ట్‌లో ఆమె పెట్టిన షరతు చూసి కుప్పకూలి పోయారు. ‘నో కిస్సింగ్’ క్లాజ్ అది. ఇప్పటికీ లియోన్ ఏమీ మారలేదు. రెమ్యునరేషన్ తర్వాతి సంగతి. ముద్దు సీనైతే లేదు కదా అని అడుగుతుంది. భలే అమ్మాయండీ!
సోనాక్షి సిన్హా కూడా భలే అమ్మాయే. ఆమెకీ ఈ ‘ముద్దుపిచ్చి’ ఉంది. అంటే.. ముద్దిచ్చే పిచ్చి కాదు. ముద్దొద్దనే పిచ్చి. ‘నువ్విప్పుడు ఈ హీరోని ముద్దు పెట్టుకోవాలమ్మాయ్..’ అని అని చెబితే.. ‘ముందే చెప్పాను కదా.. నాకిలాంటివి ఇష్టం ఉండవని’ అంటుంది. సీన్ డిమాండ్ చేస్తోంది అమ్మాయ్’ అంటే.. నేను కమాండ్ చేస్తున్నా.. సీన్ మార్చండి అంటుంది. అలా చాలా సీన్‌లతో పాటు, చాలా సినిమాలూ వదులుకుంది సోనాక్షి.
‘దబాంగ్’లో సల్మాన్ పక్కన చేసింది సోనాక్షి. అతడూ అంతే ‘నో–కిస్సింగ్’ అంటాడు.. ప్రాజెక్టుకు సంతకం పెట్టే ముందే. అందుకనే సల్మాన్ చిత్రాల్లో మనకు అతడి కండలు కనిపిస్తాయి కానీ, అతడి ముద్దులు కనిపించవు. సల్మాన్‌తో నిర్మాతలకు ఇంకో ఇబ్బంది కూడా ఉంది. ఆకాశంలో ఔట్ డోర్ షూటింగ్ ఉన్నా.. అక్కడికి జిమ్ ఎక్విప్‌మెంట్ మొత్తం తెప్పించమంటాడు! షాట్ గ్యాప్‌లో బాడీని వామప్ చేసుకోవాలనిపిస్తే అతడికి ఈ సరంజామా అంతా ఉండాలి. నాలుగు గుంజీళ్లు తీస్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకోడు.
హృతిక్ రోషన్‌కి కూడా ఈ బాడీ పిచ్చి ఉంది. అయితే నిర్మాతల్ని మరీ అంతగా వేధించడు. ఔట్ డోర్‌కి వెళ్లే ముందు.. ‘మంచి జిమ్ బుక్ చెయ్యండి’ అని మాత్రం అడుగుతాడు. మరీ అంత మంచి జిమ్ దొరక్కపోయినా అడ్జెస్ట్ అయిపోతాడు.
అక్షయ్‌కుమార్ ఇంకో రకం ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. సండే సూర్యుడొచ్చి లేపినా లేవడు. ఇక డైరక్టరొచ్చి లేపితే లేస్తాడా! మంచి లైటింగ్ ఉంది లెమ్మంటే, రమ్మంటే.. ‘రేపు చూద్దాం’ అని నిర్మొహమాటంగా అనేస్తాడు. ఆదివారాలు ఈ మనిషి మనిషి కాదు అని వదిలేశారు దర్శకులు. ఆయన్ని వదిలేయడం కాదు. ఆయనపై ఆశల్ని వదులుకున్నారు. ఇప్పటికీ అంతే. అక్షయ్‌తో మరో తలనొప్పి కూడా ఉంది. షూటింగ్ ఎర్లీ మార్నింగ్ మొదలు కావాలంటాడు! ‘అదేంటీ అక్షయ్’ అని అడిగితే.. ‘లేట్ నైట్ నేను చెయ్యలేను’ అంటాడు. దీన్ని బట్టి అక్షయ్‌ది షూటింగ్‌లకు పనికొచ్చే బాడీ కాదనిపిస్తోంది. టెన్ టు ఫైవ్ ఉద్యోగానికి వెళ్లక, పొరపాటున ఇటు వచ్చినట్లున్నాడు.
ఈ స్టోరీ ఆమిర్‌తో కదా మొదలైంది.. చుక్కలు కనిపించే ‘లెక్క’లేశాడని! ఈయనతో ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. ‘లో యాంగిల్’ షాట్ తియ్యనివ్వడు. అంటే.. కాళ్ల దగ్గర కెమెరా పెట్టి, తనను షూట్ చెయ్యనివ్వడు. íసిగ్గట.. ఖాన్ సాబ్‌కి.ఈ సిగ్గులు, అసలు సిగ్గే పడకపోవడాలు డిమాండ్ ఉన్న స్టార్‌లకు మామూలే. వాళ్లేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. వాళ్లేం అడిగినా వాళ్ల కాళ్ల దగ్గరికి వచ్చేస్తుంది. మరీ ఇబ్బంది అనిపిస్తే తప్ప ప్రొడ్యూసర్లు బయటపడరు. స్టార్‌లను వదిలించుకోరు. హద్దు దాటినప్పుడే.. పద్దులు చూసుకుంటారు. ‘అమ్మా నీకో దండం’, ‘అయ్యా నీకో నమస్కారం’ అని ప్యాకప్ చెప్పేసి, కొత్త వాళ్లతో మళ్లీ పికప్ అవుతారు.
ముద్దంటే చేదు
ముద్దు సీన్‌లంటే గిట్టనివాళ్లు సన్నీలియోన్, సోనాక్షీ, సల్మాన్ (అరె! ముగ్గురి పేర్లూ ‘ఎస్’ తోనే మొదలయ్యాయే) మాత్రమే కాదు. షారుక్ కూడా. (మళ్లీ ఇంకో ‘ఎస్’). అగ్రిమెంట్‌లో ‘నో కిస్సింగ్’ అని తప్పనిసరిగా కండిషన్ పెడతాడు షారుక్. ఒక్క యాష్ చోప్రా రిక్వెస్ట్‌పైన మాత్రం ‘జబ్ తక్ హై జాన్’లో తన రూల్‌ని తను బ్రేక్ చేసుకున్నాడు. రికార్డులు బ్రేక్ చేస్తేనే కాదు.. అప్పుడప్పుడు మన రూల్స్‌ని మనమే బ్రేక్ చేసుకున్నా గౌరవమే. యాష్ చోప్రా.. పై నుంచి షారుక్‌ని దీవిస్తూ ఉండివుంటారు.. ముద్దుకి షారుక్ ఓకే అన్నందుకు.
Comments
Please login to add a commentAdd a comment